త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone | మీ ఐఫోన్‌ను వెంట‌నే లేటెస్ట్ ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోండి.. యాపిల్ హెచ్చ‌రిక‌..

iPhone | యాపిల్ సంస్థ త‌న‌ ఐఫోన్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 180 కోట్ల ఐఫోన్ యూజర్లు వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. తాజాగా విడుదల చేసిన iOS 26.3 అప్‌డేట్‌లో తీవ్ర భద్రతా లోపాలను పరిష్కరించినట్లు యాపిల్ వెల్లడించింది.

S

Technology | Published On Feb 17, 2026, 7.55 am IST

iPhone | మీ ఐఫోన్‌ను వెంట‌నే లేటెస్ట్ ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోండి.. యాపిల్ హెచ్చ‌రిక‌..
Advertisement

iPhone | యాపిల్ సంస్థ త‌న‌ ఐఫోన్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 180 కోట్ల ఐఫోన్ యూజర్లు వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. తాజాగా విడుదల చేసిన iOS 26.3 అప్‌డేట్‌లో తీవ్ర భద్రతా లోపాలను పరిష్కరించినట్లు యాపిల్ వెల్లడించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, యాప్‌లను క్రాష్ చేయడం లేదా ఫోన్‌పై పూర్తిగా నియంత్రణ పొందే ప్రమాదం ఉందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ అప్‌డేట్‌లో మొత్తం 39 భద్రతా లోపాలను సరిచేసినట్లు యాపిల్ తెలిపింది. వీటిలో ముఖ్యంగా డైల్డ్ (dyld - డైనమిక్ లింక్ ఎడిటర్) అనే కీలక సిస్టమ్‌లో ఉన్న జీరో-డే లోపం అత్యంత ప్రమాదకరమని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఫోన్‌లో ప్రతి యాప్ పని చేయడానికి ముందు ఈ సిస్టమ్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే దీనిని నిపుణులు ఐఫోన్‌కు గేట్‌కీపర్ గా అభివర్ణిస్తుంటారు. అయితే జీరో-డే లోపం ద్వారా హ్యాకర్లు భద్రతా తనిఖీలను తప్పించుకుని హానికరమైన కోడ్‌ల‌ను రన్ చేయగలుగుతారని తెలిపారు.

జీరో-డే లోపం ద్వారా హ్యాకింగ్‌..

iOS 26కి ముందు ఉన్న వెర్షన్లలో ఈ లోపాన్ని ఉపయోగించి కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై అత్యంత నిపుణతతో కూడిన దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయని యాపిల్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో డైల్డ్‌తో పాటు ఇతర సిస్టమ్‌లలో కూడా భద్రతను మరింత బలోపేతం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అనధికార యాక్సెస్‌ను అడ్డుకోవడం, మెమరీ ఎర్రర్లను నివారించడం, వ్యక్తిగత డేటా రక్షణ కోసం అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీరో-డే లోపం ద్వారా హ్యాకర్లు ఫోన్‌లో స్పైవేర్ లేదా బ్యాక్‌డోర్లను ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంది. మాల్వేర్‌బైట్స్‌కు చెందిన పరిశోధకుడు Pieter Arntz మాట్లాడుతూ ఇలాంటి దాడులు చాలా కాలం గుర్తించకుండా కొనసాగుతాయని, అందుకే ఇవి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ కారణంగానే iOS 26.3 అప్‌డేట్‌ను ఐఫోన్ చరిత్రలోనే అత్యంత కీలకమైన భద్రతా అప్‌డేట్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

సాధార‌ణ వినియోగ‌దారులు కూడా..

సాధారణంగా ఇలాంటి స్పైవేర్ దాడులు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణ వినియోగదారులు కూడా ప్రభావితమయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అనుకోకుండా టార్గెట్ అవ్వొచ్చు అని KnowBe4 సంస్థకు చెందిన జావాద్ మాలిక్ పేర్కొన్నారు. యూజర్లు వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి తాజా అప్‌డేట్ అందుబాటులో ఉందో లేదో చూసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని యాపిల్ సూచించింది. ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను ఆన్ చేసుకుంటే భవిష్యత్తులో భద్రతా అప్‌డేట్స్ మిస్ అయ్యే అవకాశం ఉండదని తెలిపింది. ఈ భద్రతా ప్యాచ్‌లు ఐఫోన్‌లతో పాటు ఐప్యాడ్‌లు, మాక్‌లు, ఆపిల్ వాచ్‌లు, ఆపిల్ టీవీ, సఫారీ బ్రౌజర్‌కు కూడా వర్తిస్తాయ‌ని తెలియ‌జేసింది.

ఫోన్ అకస్మాత్తుగా వేడెక్కడం, బ్యాటరీ వేగంగా ఖాళీ కావడం, తెలియని యాప్‌లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యధిక భద్రత కావాలనుకునే వినియోగదారులు యాపిల్ అందిస్తున్న లాక్‌డౌన్ మోడ్ ను ఉపయోగించుకోవచ్చని, అయితే ఇది కొంత ఫంక్షనాలిటీని పరిమితం చేస్తుందని కూడా తెలిపారు. క‌నుక ఐఫోన్ యూజ‌ర్లు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement
iPhone | మీ ఐఫోన్‌ను వెంట‌నే లేటెస్ట్ ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోండి.. యాపిల్ హెచ్చ‌రిక‌.. | త్రినేత్ర News