త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నెలకు 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసల్లేవా?

Harish Rao | డీలర్ల‌కు నెల‌కు రూ.10 కోట్లు గౌర‌వ వేత‌నం ఇవ్వ‌డానికి పైస‌లు లేవా అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. స‌చ్చిపోతెనే బిల్లులు వ‌స్తాయా అని నిల‌దీశారు.

S

Telangana | Published On Oct 27, 2026, 4.38 pm IST

Harish Rao | నెలకు 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసల్లేవా?
Advertisement
  • డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు ప్రాణ‌త్యాగానికి సిద్ధ‌మంటున్న‌డు
  • నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా ఓ మాట‌న్న‌డు
  • అన్న‌ట్టే.. కాంగ్రెస్ పాల‌నలో స‌చ్చిపోతేనే బిల్లులు వ‌స్త‌యా?
  • వెంట‌నే డీల‌ర్ల‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వాలి
  • లేదంటే అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తం
  • డీల‌ర్ల స‌మావేశంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌

Harish Rao | త్రినేత్ర న్యూస్: రూ.100 కోట్లతో సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి, రూ. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు డబ్బులుంటాయ‌ని.. కానీ 17,200 మంది డీలర్ల(Dealers)కు నెలకు రూ.10 కోట్లు గౌరవ వేతనం (Honorarium) ఇవ్వడానికి పైసలు లేవా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. ప్రాణ త్యాగానికి సిద్ధ‌మ‌ని డీల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు రాజు అంటుంటే బాధ క‌లిగించింద‌న్నారు. ఈ కాంగ్రెస్ పాల‌న‌లో స‌చ్చిపోతేనే బిల్లులు వ‌స్తాయా అని మండిప‌డ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా ప్ర‌సంగించారు. డీల‌ర్ల‌ను వెంట‌నే చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో స‌చ్చిపోతేనే పనులు అవుతాయా? సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను రూ.లక్ష కోట్ల అప్పుల్లో ముంచారు. రూ.600 కోట్ల బియ్యాన్ని పందికొక్కుల పాలు చేశారు. బిల్లుల కోసం తాను చచ్చిపోవడానికీ సిద్ధమని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటుంటే, సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అంటున్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ. లక్ష కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. 16 నెలలుగా గోదాములు, షాపుల్లో మూలుగుతున్న రూ. 600 కోట్ల విలువైన దొడ్డు బియ్యాన్ని పురుగులు, పందికొక్కుల పాలు చేశారు.

ఎన్నికల ముందు రూ. 5,000 గౌరవ వేతనం, రూ. 300 కమిషన్, మినీ సూపర్ మార్కెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రేషన్ డీలర్లుతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదు.

రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజును నేను గత 25 ఏళ్లుగా చూస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి సునీతా లక్ష్మారెడ్డిని, పద్మా దేవేందర్ రెడ్డిని, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డిని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకుని డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన నేర్పరి. ఈరోజు వేదిక మీద నాయికోటి రాజు మాట్లాడుతూ.. డీలర్ల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ప్రాణత్యాగానికైనా సిద్ధం అనడం నన్ను కదిలించింది.

 

నిన్ననే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు అనిరుధ్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు.. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి, జడ్చర్లలో రోడ్లు పగుళ్లు పడ్డా రూ. 30-40 కోట్ల బిల్లులు రావడం లేదు, ఒక కాంట్రాక్టర్ చనిపోతేనే రూ. 5 కోట్ల బిల్లు పడింది, నేను స‌చ్చిపోతేనే మా నియోజకవర్గ బిల్లులు వస్తాయంటే ప్రాణత్యాగానికి సిద్ధం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. స‌చచ్చిపోతేనే పనులు అవుతాయా? స‌చ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేనే స‌చ్చిపోవడానికి సిద్ధమనే దుస్థితి వచ్చింది.

డీల‌ర్ల క‌మిష‌న్ సాధిద్దాం

కానీ ఎవరూ స‌చ్చిపోవద్దు, అందరూ బాగుండాలి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. అందరం కలిసి గట్టిగా కొట్లాడి బిల్లులు, డీలర్ల కమిషన్ సాధించుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెల్లారే హామీలు అమలు చేయమని డీలర్లు అడగలేదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవాలని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఓపికగా ఎదురుచూశారు. కానీ మూడేళ్లు గడిచినా డీలర్ల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేడు. కనీసం సివిల్ సప్లైస్ కమిషనర్ గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని అధ్యక్షుడు రాజు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డేమో తమది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటారు.

300 ఇవ్వాల‌ని ఉత్త‌మ్ మాట్లాడిండు

ప్రజలను ఎప్పుడైనా కలిసేదే ప్రజా ప్రభుత్వం కదా! మరి 17,200 మంది రేషన్ డీలర్లు ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడికే మూడేళ్లలో అపాయింట్‌మెంట్ దొరకకపోతే ఇదెక్కడి ప్రజాపాలన? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయికోటి రాజు, నందయ్య తదితరులు వస్తే సచివాలయంలో రెండు రోజుల పాటు కూర్చోబెట్టి, భోజనం పెట్టి, నాటి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి అధికారులను, కేసీఆర్ ని ఒప్పించి కమిషన్‌ను రూ.140కి పెంచాం. ఆరోజు బయట ప్రెస్ మీట్ పెట్టిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ. 140 ఏం చాలుతాయి, కనీసం రూ. 300 ఇవ్వాలి అని మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఒక్కో డీలర్ వందలాది ఓట్లు వేయిస్తాడని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జీవన్ రెడ్డి గారు వెళ్లి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకి చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు. నెలకు రూ. 5,000 గౌరవ వేతనం, క్వింటాలుకు రూ. 300 కమిషన్, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి అన్ని వస్తువులు అమ్ముకునే అనుమతి ఇస్తామని నమ్మబలికారు. ఆ మాటలు నమ్మి డీలర్లందరూ కాంగ్రెస్‌కు పనిచేసి, ఓట్లు వేయించి గెలిపించారు.

ఇవాళ డీలర్లు కొత్త డిమాండ్లేమీ పెట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆ మూడు హామీలనే అమలు చేయమని అడుగుతున్నారు. చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ సాధించిన గజ్వేల్ గడ్డ మీద సమావేశం పెడితేనే ప్రభుత్వ పెద్దలకు సురుకు తగిలి కదలిక వస్తుందని ఇక్కడి నుంచే డీలర్లు సమరశంఖం పూరించారు. పేద ప్రజలందరికీ కడుపునిండా అన్నం పెడుతున్న రేషన్ డీలర్ల కడుపు మాత్రం కాంగ్రెస్ పాలనలో ఎండిపోతోంది.

నాడు కేసీఆర్ పేదవాడు కడుపునిండా తినాలని మనిషికి 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలకు పెంచి, కార్డుకు 20 కిలోల సీలింగ్ ఎత్తేశారు. ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇచ్చారు. ఇవాళ డీలర్లకు రూపాయి కమిషన్ పెరగలేదు గానీ, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. మంచినూనె రూ. 210, కందిపప్పు రూ. 175, పెసరపప్పు రూ. 130, ఉల్లిగడ్డ రూ. 60 కి చేరింది, ఎల్లిగడ్డ ధర కొండెక్కింది. పన్నులు, అధికారుల వేధింపులు పెరిగిపోయి డీలర్లు కుటుంబాలను వెళ్లదీయలేని దుస్థితి నెలకొంది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి దొడ్డు బియ్యం వ్యవహారమే నిదర్శనం. సన్న బియ్యం పంపిణీ మొదలుపెట్టాక, చిన్నగా ఉండే రేషన్ షాపుల్లో జాగా లేకపోయినా మూడు నెలల బియ్యం ఒకేసారి నిల్వ చేసి ఇవ్వమంటున్నారు. మరోవైపు గత 16, 17 నెలలుగా పాత దొడ్డు బియ్యం నిల్వలను అలాగే వదిలేశారు. గోదాములు, MLS పాయింట్లలో లక్ష మెట్రిక్ టన్నులు, రేషన్ షాపుల్లో 40 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మూలుగుతోంది.

దీని విలువ అక్షరాలా రూ. 600 కోట్లు.. 16 నెలలుగా ఆ బియ్యం ముక్కిపోయి, ఎర్ర పురుగులు, లక్క పురుగులు పట్టి, ఎలుకలు, పందికొక్కులు తిని పిండిగా మారిపోయింది. సిద్దిపేటలో నేను ఒక రేషన్ షాపుకు వెళ్లి చూస్తే పురుగులు బయటకు పారుతున్నాయి. ఆ పాడైపోయిన బియ్యాన్ని మనుషులే కాదు, బయట పారబోస్తే తిన్న పశువులు, కుక్కలు కూడా విషతుల్యమై చచ్చిపోయే పరిస్థితి వచ్చింది.

600 కోట్లు పందికొక్కుల పాలు..

మిలిటరీలో పనిచేశానని గొప్పలు చెప్పుకునే మంత్రికి.. 16 నెలల క్రితమే ఆ బియ్యాన్ని వేలం వేసి అమ్మే కనీస తెలివి లేదా? ఆ బియ్యాన్ని అమ్మితే వచ్చే రూ. 600 కోట్లతోనే డీలర్ల కమిషన్ పెంపు, గౌరవ వేతనం ఇచ్చేయవచ్చు కదా. తమ నిర్లక్ష్యంతో రూ. 600 కోట్ల ప్రజాధనాన్ని పందికొక్కుల పాలు చేయడమే కాకుండా.. ఇప్పుడు టెండర్లు పిలిచి 16 నెలల క్రితం షాపులో ఉన్న స్టాక్ లెక్క ప్రకారం తూకం వేసి ఇవ్వాలని డీలర్లను వేధిస్తున్నారు. అసలే ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకం తక్కువ వస్తుంటే, ఏడాదిన్నరగా ఎలుకలు, పురుగులు తిని తగ్గిన 5, 6 క్వింటాళ్ల తరుగును కూడా డీలర్లే జేబులోంచి కట్టాలనడం ఎంతవరకు న్యాయం?

కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేడు దాదాపు రూ. లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. సన్న బియ్యం నిధులు, సన్న వడ్ల బోనస్ డబ్బులు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా కార్పొరేషన్‌కు విడుదల చేయకుండా కార్పొరేషన్‌నే అప్పులు తెచ్చుకోమంటోంది. గ్రామాల్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఒక నెల వేస్తే మూడు నెలలు ఎగ్గొడుతున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బలంగా ఉంటేనే డీలర్లు బతుకుతారు, కార్పొరేషన్ దివాలా తీస్తే డీలర్లు కూడా ఆగమవుతారు. డీలర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే అదీ కాదు. రూ. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, రూ. లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ, రూ. 30 వేల కోట్లతో రోడ్లు అంటున్నారు.

అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు నిధులుంటాయి. నాడు కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కడితే విమర్శించిన రేవంత్ రెడ్డి.. నేడు రూ. 100 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు, దాని కాంపౌండ్ వాల్‌కే రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రాష్ట్రంలోని 17,200 మంది డీలర్లకు నెలకు రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తే అయ్యే ఖర్చు నెలకు రూ. 10 కోట్లు కూడా కాదు. షోకులకు, క్యాంప్ ఆఫీసులకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి.. పేదల ఆకలి తీర్చే డీలర్లకు నెలకు రూ. 10 కోట్లు ఇవ్వడానికి మనసు రావడం లేదా? ఎన్టీఆర్ గారి కాలం నుంచి చూస్తున్నాం.. రేషన్ డీలర్లు సైలెంట్ కిల్లర్లు. వారు బయటకు ఎక్కువగా మాట్లాడరు కానీ, వారితో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ నిలబడలేదు. ప్రభుత్వం వారి శక్తిని తక్కువ అంచనా వేయవద్దు.

తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి డీలర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని చర్చలకు పిలవాలి. డీలర్లపై వేధింపులు ఆపి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన రూ. 5,000 గౌరవ వేతనం, రూ. 300 కమిషన్, మినీ సూపర్ మార్కెట్ల హామీలను వెంటనే అమలు చేయాలి. డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉండి అసెంబ్లీలో, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ధరావత్ మోహన్ నాయక్, అజీజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement