త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Elections 2027 | 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా: అధికారుల బదిలీలపై కీలక ఆదేశాలు.. ఆ డిక్లరేషన్ తప్పనిసరి!

యూపీ, పంజాబ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. సొంత జిల్లాలు, మూడేళ్లు పూర్తయిన అధికారుల బదిలీలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

J

National | Published On Oct 27, 2026, 4.42 pm IST

Assembly Elections 2027 | 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా: అధికారుల బదిలీలపై కీలక ఆదేశాలు.. ఆ డిక్లరేషన్ తప్పనిసరి!

సంక్షిప్త సారాంశం

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రాథమిక కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రారంభించింది. సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న లేదా ఒకే జిల్లాలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఎన్నికల సంబంధిత అధికారులను వెంటనే బదిలీ చేయాలని స్పష్టం చేసింది. కేడర్ కోసం కేటాయించిన పోస్టుల్లో కేవలం సంబంధిత కేడర్ అధికారులనే నియమించాలని ఆదేశించింది. అభ్యర్థులకు బంధువులు కాదని, క్రిమినల్ కేసులు లేవని ప్రతి అధికారి లిఖితపూర్వక డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి చేసింది.

Advertisement

Assembly Elections 2027 | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తొలి కీలక అడుగు వేసింది. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు సన్నాహక కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్నికల సంబంధిత అధికారుల బదిలీలపై అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.

సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో పాటు, ఒకే జిల్లాలో గత నాలుగేళ్ల కాలంలో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.

బదిలీ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు

ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులను వారి సొంత జిల్లాల్లో (Home Districts) పోస్టింగ్‌లో కొనసాగించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మార్చి 31 నాటికి.. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నాటికి మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకునే అధికారులందరికీ ఈ బదిలీ నిబంధన వర్తిస్తుంది. కేడర్ నిర్దేశిత స్థానాల్లో కేవలం ఆయా కేడర్‌కు చెందిన అధికారులను మాత్రమే నియమించాలని పేర్కొంది.

గత అసెంబ్లీ లేదా ఉప ఎన్నికల్లో పనిచేసిన నియోజకవర్గాలు/జిల్లాల్లో అదే డీఈవో (DEO), ఆర్వో (RO), ఏఆర్వో (ARO), పోలీస్ ఇన్‌స్పెక్టర్ లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులను తిరిగి పోస్ట్ చేయకూడదని తేల్చిచెప్పింది.

అధికారుల డిక్లరేషన్ తప్పనిసరి

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఉండేందుకు అధికారుల నుంచి లిఖితపూర్వక హామీని (Declaration) ఈసీ తప్పనిసరి చేసింది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన రెండు రోజుల్లోగా సంబంధిత అధికారులు తమ జిల్లా ఎన్నికల అధికారికి (DEO) నిర్దేశిత ఫార్మాట్‌లో డిక్లరేషన్ సమర్పించాలి.

ఈ డిక్లరేషన్‌లో అధికారులు రెండు ముఖ్యమైన అంశాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.

బరిలో ఉన్న అభ్యర్థులకు గానీ, జిల్లా/రాష్ట్ర స్థాయి ప్రధాన రాజకీయ నేతలకు గానీ తాము సన్నిహిత బంధువులం కాదని స్పష్టం చేయాలి.

తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని పేర్కొనాలి.

ఒకవేళ బంధువులు పోటీలో ఉన్నా లేదా కేసులు ఉన్నా ఆ వివరాలను ప్రత్యేక షీట్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ సమర్పించినట్లు తేలితే సంబంధిత అధికారిపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ సమాచారాన్ని డీఈవోలు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు (CEO) నివేదించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement