త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేద‌న‌.. సంచిత కేసులో కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన స్నేహితురాలు

Sanchita Ugale | ప్రముఖ టెలివిజన్ నటి సంచిత ఉగలే (22) ఆత్మ‌హ‌త్య టీవీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ నెల 14న ముంబ‌యి సమీపంలోని నాలాసోపారా ఈస్ట్‌లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆమె తనువు చాలించిన ఘటనపై అచోలే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

P

Entertainment | Published On Jun 17, 2026, 4.50 pm IST

Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేద‌న‌.. సంచిత కేసులో కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన స్నేహితురాలు
Advertisement

Sanchita Ugale | ప్రముఖ టెలివిజన్ నటి సంచిత ఉగలే (22) ఆత్మ‌హ‌త్య టీవీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ నెల 14న ముంబ‌యి సమీపంలోని నాలాసోపారా ఈస్ట్‌లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆమె తనువు చాలించిన ఘటనపై అచోలే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సంచిత మరణానికి ముందు ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలపై ఆమె సన్నిహితులు మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ఆప్తమిత్రురాలు, నటి గీతాంజలి మాట్లాడుతూ సంచిత గత కొన్ని నెలలుగా తీవ్ర డిప్రెషన్‌తో పాటు నిద్రలేమి సమస్యతో బాధపడుతోందని తెలిపింది. “జనవరి నుంచి ఆమె పరిస్థితి క్రమంగా దిగజారింది.

రాత్రిళ్లు నిద్రపట్టక తీవ్రమైన మానసిక వేదనలో ఉండేది. ‘ఇలా బతకడం కష్టం. చనిపోవాలనిపిస్తోంది’ అని తరచూ చెప్పేది” అని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు. సంచిత పరిస్థితికి సంబంధించిన కొన్ని వాట్సాప్ మెసేజ్ ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని అవసరమైతే పోలీసులకు అందజేస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే సంచిత వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని తెలిపారు. ఇక మరోవైపు సంచిత కజిన్ ఆకాష్ ఉగలే, ఆమె తండ్రి మచ్చింద్ర ఉగలే పరిశ్రమలోని కొందరు కాస్టింగ్ ఏజెంట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవకాశాల పేరుతో కొందరు వ్యక్తులు సంచితను మానసికంగా వేధించారని, అదే ఆమెను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి నటిగా ఎదగాలన్న ఆమె ఆశలను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జూన్ 14న ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రోజునే సంచిత సైతం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే, సంచిత చివరి సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించిన కొన్ని సంకేతాలపై కుటుంబీకులు అనుమానాలు వ్య‌క్తం చేశారు. మరోవైపు సంచిత నటించిన టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లోని సహనటులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణానికి కొన్ని గంటల ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతూ డాన్స్ చేస్తున్న రీల్‌ను షేర్ చేసింది. ఆ త‌ర్వాత ఒక్కసారిగా దారుణ‌మైన నిర్ణయం తీసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా స్పందిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. యువ న‌టి మ‌ర‌ణం వెనుక నిజానిజాల‌ను నిగ్గు తేల్చాల‌ని ఆయ‌న సీఎంను కోరారు.

Advertisement
Advertisement