Telugu Cinema | హీరోయిజం హై.. హీరోయిన్ కిదర్ హై!
Telugu Cinema | సినిమా అంటే హీరో. హీరో అంటే కథ. కథంటే అతడి చుట్టూనే సన్నివేశాలు. తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇది కొత్తేమీ కాదు. కాలం మారుతున్న కొద్దీ కథల్లోనూ మార్పు రావాలి. ముఖ్యంగా మహిళా పాత్రలు మరింత బలంగా మారాలి. కానీ, కొన్ని భారీ చిత్రాలను గమనిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
Entertainment | Published On Sep 30, 2026, 8.45 pm IST
- తెరమరుగవుతున్న కథానాయిక పాత్ర
- పాటలు, అందాల ఆరబోతకే పరిమితమా?
- హీరో ఎలివేషన్‌తో తగ్గుతున్న ప్రాధాన్యం
- హీరోయిన్‌పై ఎందుకీ చిన్నచూపు?
- తెలుగు సినిమాలో విచిత్ర పరిస్థితి
- పరిస్థితి మారాలంటున్న అభిమానులు
Telugu Cinema | సినిమా అంటే హీరో. హీరో అంటే కథ. కథంటే అతడి చుట్టూనే సన్నివేశాలు. తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇది కొత్తేమీ కాదు. కాలం మారుతున్న కొద్దీ కథల్లోనూ మార్పు రావాలి. ముఖ్యంగా మహిళా పాత్రలు మరింత బలంగా మారాలి. కానీ, కొన్ని భారీ చిత్రాలను గమనిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. హీరోయిన్లు ఉన్నారు.. పాటల్లో కనిపిస్తున్నారు.. గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు.. ప్రమోషన్స్‌లోనూ భాగమవుతున్నారు. సినిమా కథలో మాత్రం వాళ్ల పాత్ర ఏంటి? కథకు వాళ్లు చేస్తున్న సహాయం ఏంటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అందరు దర్శకులూ ఇలాగే చేస్తున్నారని కాదు. మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్న దర్శకులు చాలామందే ఉన్నారు. బడా హీరోలు, భారీ బడ్జెట్లు, యాక్షన్ కథలు అంటూ వెళ్లే క్రమంలో కొందరు దర్శకులు హీరోయిన్ పాత్రను పరిమితం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. హీరోయిన్‌ను సినిమాలో పెడుతున్నారు కానీ, ఆమెకు గుర్తుండిపోయే పాత్రను మాత్రం ఇవ్వడం లేదు.
ఒకప్పుడు హీరోయిన్ అంటే కేవలం పాటల కోసమే కాదు
తెలుగు సినిమా పాత రోజులను పరిశీలిస్తే కథానాయిక పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. హీరోకు సమానమైన యాక్షన్ పాత్ర కాకపోయినా.. కథలో ఆమె తీసుకునే నిర్ణయాలు, కుటుంబం, భావోద్వేగాలు, సంఘర్షణలు, హీరో జీవితంపై చూపించే ప్రభావం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండేది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రే కథను ముందుకు నడిపించేది. క్రమంగా కమర్షియల్ ఫార్ములా బలపడటంతో హీరోయిజం ప్రధానంగా మారింది. హీరో ఇంట్రడక్షన్.. ఎలివేషన్స్.. యాక్షన్ సీక్వెన్సులు.. డైలాగ్స్.. ఫ్యాన్స్‌కు నచ్చే సన్నివేశాలు.. వీటి చుట్టూనే కథను అల్లే ధోరణి పెరిగింది. ఈ క్రమంలో హీరోయిన్ పాత్రకు కేటాయించే స్థలం తగ్గుతూ వచ్చింది. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.. రెండు పాటలు చేసింది.. హీరోతో రొమాన్స్ చేసింది.. ఒకటి రెండు కామెడీ సీన్లలో కనిపించింది.. క్లైమాక్స్‌కు ముందు హీరోకు స్ఫూర్తినిచ్చింది.. అంతే. ఇలాంటి పాత్రలు ఇప్పటికీ పెద్ద సినిమాల్లో కనిపిస్తుండటం చర్చకు దారితీస్తోంది.
‘ప్యారడైజ్’తో మరోసారి తెరపైకి వచ్చిన చర్చ
ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’లాంటి సినిమాల విషయంలోనూ ఇదే తరహా చర్చ జరుగుతోంది. కయదు లోహర్ పోషించిన పాత్రపై అంచనాలు ఏర్పడినా.. కథలో ఆమెకు దక్కిన స్పేస్ ఎంత? ఆ పాత్రకు కథతో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు వినిపించాయి. పాత్రను బోల్డ్‌గా చూపించడం ఒక ఎత్తయితే.. ఆ పాత్రకు కథలో బలమైన ఉనికి ఇవ్వడం మరో ఎత్తు. ఒక హీరోయిన్‌ను భిన్నమైన లుక్‌లో చూపించడం, గ్లామర్ యాంగిల్‌ను ఉపయోగించుకోవడం తప్పు కాదు. కానీ ఆమె పాత్రకు కథలో ఎలాంటి ప్రయోజనం లేకపోతే.. ప్రేక్షకుడికి ఆ పాత్ర గుర్తుండిపోవడం కష్టం. ఇదే అసలు సమస్య.
జాన్వీ కపూర్ నుంచి మొదలైన చర్చ కాదు..
ఇటీవల ‘పెద్ది’ సినిమా విషయంలో జాన్వీ కపూర్ పాత్రపై జరిగిన చర్చ కూడా హీరోయిన్ పాత్రల ప్రాధాన్యాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. హీరోయిన్ పాత్రకు సంబంధించిన అంశాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో జాన్వి కనిపించకపోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఒక స్టార్ హీరోయిన్ భారీ ప్రాజెక్టులో భాగం కావడం మాత్రమే సరిపోదు. ఆమె పాత్రకు కథలో ఎంత ప్రాధాన్యం ఉంది? పాత్రకు ఒక ఆరంభం, మధ్య, ముగింపు ఉన్నాయా? ఆమె పాత్ర వల్ల కథలో ఏదైనా మార్పు వస్తుందా? అనేదే అసలు విషయం.
ఉస్తాద్ భగత్ సింగ్‌లో రాశి ఖన్నా.. గుర్తు చేస్తే కానీ!
హీరోయిన్ పాత్ర ఎంత చిన్నదిగా మారిపోతుందో చెప్పడానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా భాగమే. సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి వచ్చేంతగా ఆ పాత్ర ప్రభావం కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక స్టార్ హీరోయిన్‌ను సినిమాలో తీసుకున్నప్పుడు.. ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకుడికి గుర్తుండాలి. కథలో ఆమె ఉనికి అనిపించాలి. కానీ కేవలం హీరోయిన్ ఉంది అనే కారణం కోసం పాత్రను ఉంచితే మాత్రం ప్రయోజనం ఏమిటనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
నిధి అగర్వాల్ పరిస్థితి కూడా అంతే
‘హరిహర వీరమల్లు’ విషయంలోనూ నిధి అగర్వాల్ పాత్ర గురించి ఇలాంటి చర్చే జరిగింది. భారీ తారాగణం, భారీ సెట్స్, పెద్ద కథ ఉన్నప్పుడు.. కథానాయిక పాత్ర సహజంగానే మరింత బలంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సినిమా నిడివి, కథా పరిధి, ఇతర పాత్రల ప్రాధాన్యం వంటి కారణాలతో హీరోయిన్ పాత్రలు కుదించబడితే మాత్రం ఆ ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. కొన్ని సందర్భాల్లో హీరోయిన్ పాత్రను దర్శకుడు మొదట బాగానే రాసి ఉండొచ్చు. షూటింగ్ సమయంలో ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కానీ, ఫైనల్ ఎడిటింగ్‌లో సినిమా నిడివి కోసం వాటిని తొలగించే పరిస్థితి రావచ్చు. అలాంటి సందర్భాల్లో హీరోయిన్‌పై విమర్శలు రావడం కొంతవరకు అనివార్యం. తెరపై కనిపించే తుది రూపమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కాబట్టి.. అక్కడ పాత్ర బలహీనంగా ఉంటే ప్రశ్నలు తలెత్తుతాయి.
‘గేమ్ ఛేంజర్’లో కియరా అద్వానీ
‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే.. కియరా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నప్పటికీ ఆమె పాత్రకు బలమైన ఆర్క్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమాలో హీరో పాత్ర చుట్టూ కథ, రాజకీయ అంశాలు, యాక్షన్ ఎపిసోడ్లు సాగుతుండగా.. హీరోయిన్‌కు లభించిన స్పేస్ పరిమితమైంది. ఇలాంటి సినిమాల్లో సమస్య మరోలా ఉంటుంది. హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాలు షూటింగ్ సమయంలో చాలానే ఉండొచ్చు. కానీ తుది నిడివి కోసం ఎడిటింగ్ టేబుల్‌పై చాలా సన్నివేశాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా మొదట ఊహించిన పాత్ర, ప్రేక్షకుడికి కనిపించే పాత్ర మధ్య భారీ తేడా రావచ్చు.
‘ది రాజా సాబ్’లో ముగ్గురు హీరోయిన్లు.. కానీ?
సంక్రాంతి బరిలోకి వచ్చిన ‘ది రాజా సాబ్’లో పలువురు కథానాయికలు ఉన్నారు. ఇంతమంది హీరోయిన్లు ఉన్న సినిమాలో వారి పాత్రలు ప్రేక్షకుడి మదిలో ప్రత్యేకంగా నిలవాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా హీరో చుట్టూనే కథ తిరిగే క్రమంలో హీరోయిన్ పాత్రలు పాటలు, కొన్ని సన్నివేశాలకు పరిమితమైన భావన కలిగిందనే చర్చ జరిగింది. ఇది ఒక సినిమాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. భారీ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రను కథలో సహజంగా భాగం చేయడం కంటే.. స్టార్ హీరోకు జోడీగా చూపించడానికే ప్రాధాన్యం ఇస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. చెప్పుకుంటూ పోతో ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్ల పరిస్థితి దాదాపుగా ఇదే.
హీరోయిజం పెరిగే కొద్దీ హీరోయిన్ స్పేస్ తగ్గుతోందా?
భారీ హీరోల సినిమాల్లో హీరోయిజం కోసం దర్శకులు భారీగా స్పేస్ ఇస్తున్నారు. ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు, అభిమానుల అంచనాలు, మార్కెట్, థియేట్రికల్ విలువ.. ఇలా అన్నింటిపైనా ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పాత్ర మాత్రం హీరోకు అనుగుణంగా మారిపోతోంది. హీరో చుట్టూ కథను రాసి.. ఆ తర్వాత హీరోయిన్‌ను అందులోకి తీసుకురావడంతో చివరకు ‘హీరోకి జోడీ’గా మాత్రమే మిగిలిపోతోంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్, పాటలు, రొమాన్స్‌కు స్థానం ఉంటుంది. అవే హీరోయిన్ పాత్ర మొత్తంగా మారితేనే సమస్య. సొంత వ్యక్తిత్వం లేకపోవడం, కథలో నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం, హీరో ప్రయాణానికే పరిమితం కావడం.. ఇవన్నీ పాత్ర ప్రాధాన్యాన్ని తగ్గిస్తాయి. పాట పూర్తయిన తర్వాత పాత్ర కూడా ముగిసిపోతే.. ఆ హీరోయిన్‌ను ప్రేక్షకుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటాడనేది ప్రశ్న.
హీరోయిన్ లేకుండా సినిమా తీస్తే?
హీరో కథకు హీరోయిన్ పాత్ర అవసరం లేకపోతే.. ఆమెను ఎందుకు పెట్టాలనే ప్రశ్న ఎదురవుతోంది. కేవలం పాటలు, గ్లామర్ కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకోవడం కంటే.. కథలో ఆమెకు ఒక ఉద్దేశం ఉండాలి. హీరో ప్రయాణాన్ని మార్చాలి, కథలోని సమస్యకు పరిష్కారం చూపాలి లేదంటే కథానాయకుడి మరో కోణాన్ని బయటపెట్టాలి. ‘హీరోయిన్ ఉంది’ అనే మార్కెటింగ్ పాయింట్‌గానే పాత్రను ఉంచితే సినిమాకూ, హీరోయిన్ పాత్ర పోషంచిన నటికి పెద్దగా ప్రయోజనం ఉండదు. పాన్ ఇండియా సినిమాల్లో కథలను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ పెరిగింది. దీంతో కొన్ని పాత్రలను తొలి భాగంలో పరిమితం చేసి.. తర్వాతి భాగాల్లో విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగితే మొదటి భాగంలో ఆమెకు తక్కువ స్క్రీన్ టైమ్ దక్కుతుంది. కానీ ప్రేక్షకుడికి తెరపై కనిపించినదే సినిమా. తర్వాతి భాగంలో పాత్ర పెరుగుతుందనే హామీతో తొలి భాగంలోని లోటు ఉండదు. తెలుగు సినిమాలో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్న దర్శకులు, సినిమాలు కూడా ఉన్నాయి. భారీ హీరోల చిత్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందన్న చర్చ టాలీవుడ్‌లో ఉన్నది.. స్టార్ హీరో మార్కెట్, ఫ్యాన్ బేస్, యాక్షన్, ఎలివేషన్లు, భారీ బడ్జెట్ మధ్య హీరోయిన్‌కు అవసరమైన స్పేస్ ఇవ్వడం కొందరు దర్శకులకు సవాల్‌గా మారుతోంది.
అలా చేస్తేనే హీరోయిన్ కనిపిస్తుంది..
హీరోయిన్‌ను పాటలు, గ్లామర్‌కు పరిమితం చేయకుండా.. కథలో లక్ష్యం, సంఘర్షణ, భావోద్వేగం, నిర్ణయాలు ఉండేలా పాత్రను రాయాలి. హీరో ఎలివేషన్ కోసం భారీగా ఖర్చు చేసే రోజుల్లో.. హీరోయిన్ పాత్ర కోసం కొన్ని బలమైన సన్నివేశాలు రాయడం పెద్ద విషయం కాదు. లేకపోతే హీరోయిన్ తెరపై కనిపిస్తుంది.. పాటలో మెరిసిపోతుంది.. హీరోతో కొన్ని సీన్లు చేస్తుంది.. సినిమా పూర్తయ్యేసరికి మాత్రం ఆమె పాత్ర ఏంటో గుర్తుండదు. హీరోయిజం ఎంత ముఖ్యమో.. కథానాయిక పాత్ర కూడా అంతే ముఖ్యం. హీరోయిన్‌ను సినిమాలో పెట్టడమే కాదు.. కథలో నిలబెట్టే బాధ్యత కూడా దర్శకుడు, రచయితలదే. ఇకనైనా సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దపీట వేస్తారా లేదా చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 30, 2026

Jonita Gandhi | పర్పుల్ శారీలో మెరిసిపోయిన సింగర్ జోనితా గాంధీ.. నెట్టింట ఫొటోలు వైరల్..!
సెప్టెంబర్ 30, 2026

Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Jonita Gandhi | పర్పుల్ శారీలో మెరిసిపోయిన సింగర్ జోనితా గాంధీ.. నెట్టింట ఫొటోలు వైరల్..!
- ●Moinabad ACB Trap | ఏసీబీ మెరుపు దాడి: నిర్మాణదారుడిని బెదిరించి రూ.75 వేలు లంచం.. టీపీవో, సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
- ●CM Revanth Reddy | సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ●Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!
- ●Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్
- ●Bindaas Song | జైలర్ 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా..!

Jonita Gandhi | పర్పుల్ శారీలో మెరిసిపోయిన సింగర్ జోనితా గాంధీ.. నెట్టింట ఫొటోలు వైరల్..!

Moinabad ACB Trap | ఏసీబీ మెరుపు దాడి: నిర్మాణదారుడిని బెదిరించి రూ.75 వేలు లంచం.. టీపీవో, సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్

CM Revanth Reddy | సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!



