త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | ఓపెనర్ల వైఫల్యంతో బ్యాటింగ్‌లో తడబాటు.. వ్యూహాత్మక లోపాలు..! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌ 8లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారత్‌ దారుణంగా పరాజయం పాలైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 189 రన్స్‌ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కుప్పకూలింది. షాట్ల ఎంపిక, మంచి భాగస్వామ్యాలు లేకపోవడం, మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌లో లోపాలు టీమిండియా ఓటమిని శాసించింది. భారత జట్టు 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయ్యింది. టీమిండియా ఓటమికి పలు ప్రధాన కారణాలను ఉన్నాయి.

P

Sports | Published On Feb 23, 2026, 3.03 pm IST

T20 World Cup | ఓపెనర్ల వైఫల్యంతో బ్యాటింగ్‌లో తడబాటు.. వ్యూహాత్మక లోపాలు..! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!
Advertisement

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌ 8లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారత్‌ దారుణంగా పరాజయం పాలైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 189 రన్స్‌ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కుప్పకూలింది. షాట్ల ఎంపిక, మంచి భాగస్వామ్యాలు లేకపోవడం, మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌లో లోపాలు టీమిండియా ఓటమిని శాసించింది. భారత జట్టు 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయ్యింది. టీమిండియా ఓటమికి పలు ప్రధాన కారణాలను ఉన్నాయి. అవేంటో అన్వేషిద్దాం..!

టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం

భారత్‌ ఓటమికి ప్రధాన కారణం టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం. గ్రూప్‌ దశలో బ్యాట్‌తో చెలరేగిన ఓపెనర్‌ ఈషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అదే సమయంలో విధ్వంసకర ఓపెనర్‌గా పేరున్న అభిషేక్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచుల్లో డకౌట్‌ అయ్యాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతనిపై ఎంతో నమ్మకంతో జట్టులో కొనసాగించింది. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం 15 పరుగులు చేయగలిగాడు. జట్టును పలుసార్లు ఆదుకున్న తిలక్‌ వర్మ సైతం ఒకే పరుగు చేసి అవుట్‌ అయ్యాడు. పవర్‌ ప్లేలోనే కీలక టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో రన్‌రేట్‌ సైతం తీవ్రంగా ప్రభావితం చేసింది. మిడిలార్డర్‌పై అదనంగా ఒత్తిడిని పెంచింది. అయితే, దక్షిణాఫ్రికా టాప్‌ ఆర్డర్‌ సైతం విఫలమైంది. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మిడిలార్డర్‌ ఆదుకోవడంతో టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత జట్టు మాత్రం వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లలో శుభమ్‌ దూబే మినహా ఎవరూ రాణించలేదు.

తొందరపాటు.. భాగస్వామ్యాలు లేకపోవడం..

189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్‌మెన్‌ ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంది. అయితే, భారత బ్యాట్స్‌మెన్‌ మాత్రం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో వికెట్లను సమర్పించుకున్నారు. ప్రారంభం నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించి చెత్త షాట్లు ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. ఏ ఒక్కరూ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడటానికి బదులుగా ప్రమాదకరమైన షాట్లకు వెళ్లారు. టాప్‌ ఆర్డర్‌ నుంచి మిడిలార్డర్‌ వరకు ఇదే కనిపించింది. భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారీ భాగస్వామ్యాన్ని నెలకొలన్న సంగతి మరిచిపోయారు. టీమిండియా ఇన్సింగ్స్‌లో ఒక్క ఎల్‌బీడబ్య్లూ, రనౌట్‌, బౌల్డ్‌ అవడం కానీ లేదు. బ్యాట్స్‌మెన్‌ అంతా క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరగడం గమనార్హం. బ్యాట్స్‌మెన్‌ అంతా చెత్త షాట్లు ఆడి వికెట్లు గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా అనిపించింది.

స్పిన్ బౌలింగ్ వైఫల్యం

మ్యాచ్లో ఫాస్ట్‌ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాపై మెరుగైన ప్రదర్శన చేశారు. ఒక దశలో దక్షిణాఫ్రికా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమిండియా స్పిన్‌ త్రయం ప్రొటీస్‌ జట్టును చుట్టేస్తుందని అంతా భావించారు. కానీ, స్పిన్నర్లు అంచనాలను అందుకోలేకపోయారు. భారీగా పరుగులను సమర్పించుకున్నారు. వరుణ్‌ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే వికెట్‌ తీయగలిగాడు. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ముఖ్యంగా డేవిడ్‌ మిల్లర్‌, డెవాల్డ్‌ బ్రేవిస్‌ జోడీ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఈ జోడి నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 97 పరుగులు చేయడం విశేషం. నాలుగో ఓవర్‌లో మూడో వికెట్‌ తీసిన టీమిండియా బౌలర్లు. ఆ తర్వాత 13 ఓవర్‌లో బ్రేవిస్‌ను శుభమ్‌ దూబే పెవిలియన్‌కు పంపాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక వాషింగ్టన్‌ సుందర్‌ రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. వికెట్లు ఏమీ రాబట్టలేకపోయాడు.

టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన ఘోరమైన తప్పులు..

ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బెంచ్‌కే పరిమితం చేసి ఘోరమైన తప్పు చేసింది. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను ఆడించాలని మొదట భావించినా.. చివరకు సుందర్‌ వైపే మొగ్గు చూపింది. సుందర్‌ బౌలింగ్‌లోనూ అటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. అక్షర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సుందర్‌ అదనపు బ్యాటింగ్‌ డెప్త్‌, టైట్‌ బౌలింగ్‌ చేయలేకపోయాడు. సుందర్‌ కేవలం 11 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు వేసి 17 రన్స్‌ను సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లను రంగంలోకి దించగా.. కేవలం ఇద్దరు స్పిన్నర్లు ఒకే వికెట్‌ని పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ చేసింది. ఐడెన్ మార్క్రామ్ ఒక ఓవర్‌లో ఐదు పరుగులకు ఒక వికెట్ పడగొట్టగా, కేశవ్ మహారాజ్ మూడు ఓవర్లలో 24 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక్కడే మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది. ఫాస్ట్‌ బౌలర్‌ జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 వరల్డ్‌ కప్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న అభిషేక్‌ శర్మపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం పెట్టుకుంది. మరో ఓపెనర్‌ శాంసన్‌కు ఆడేందుకు అవకాశం ఇవ్వాల్సిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, అభిషేక్‌ తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

డెత్‌ ఓవర్లలో దారుణంగా బౌలింగ్‌..

మ్యాచ్ చివరి ఓవర్లలో భారత బౌలర్లు తమ వేగాన్ని కోల్పోయారు. ముఖ్యంగా హార్దిక వేసిన ఒక ఓవర్‌ దక్షిణాఫ్రికా స్కోర్‌ వేగంగా పెరిగేందుకు కారణమైంది. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో బౌలర్లు ఒత్తిడి పెంచారు. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయారు. డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడం వంటి వైవిధ్యం చూపించలేకపోయారు. బ్రెవిస్, మిల్లర్ మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్‌ స్వరూపాన్ని మలుపు తిప్పారు. చివరకు స్టబ్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కూడా తోడైంది.  బ్రెవిస్ 29 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 పరుగులు చేయగా, మిల్లర్ 35 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. స్టబ్స్ 24 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రాకి మూడు వికెట్లు దక్కగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు. వరుణ్‌, దూబేకు ఒక్కో తీశారు.

ఓపెనర్లు రాణించకపోతే.. జట్టు మొత్తం విఫలం..

టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాకు ఓపెనింగ్ జోడీ పెద్ద తలనొప్పిగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓపెనింగ్ జోడీ అభిమానులను నిరాశపరిచింది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓపెనింగ్‌ జోడీ కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్‌ శర్మ పూర్తిగా విఫలం కాగా.. కేవలం ఇషాన్‌ కిషన్‌ మాత్రమే రాణించాడు. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం జట్టుపై ప్రభావం చూపింది. గతంలో ఇషాన్‌ రాణించిన సమయంలో మిడిలార్డర్‌ విఫలమైంది. ఇక భారత బ్యాటింగ్‌ లైనప్‌లో ఎక్కువ మంది ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ ఉండడం ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత గడ్డపై జరుగుతున్న మ్యాచుల్లో స్పిన్నర్లు కొంత వరకు ప్రభావం చూపించగలగుతారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌పై ఆఫ్‌ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. పిచ్‌ స్పిన్‌కు సహకారం అందిస్తే భారత బ్యాట్స్‌మెన్‌కి కూడా ఇబ్బందే. ప్రొటీస్‌ కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రామ్‌ ఇదే ఫార్ములాతో తొలి ఓవర్‌లోనే స్వయంగా తానే బౌలింగ్‌కు దిగాడు. ఇషాన్‌ కిషన్‌ను సున్నా స్కోర్‌కే పెవిలియన్‌కు పంపాడు. అయితే, టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ సుందర్‌ మాత్రం తన సత్తా చాటలేకపోయాడు.

వ్యూహాత్మక తప్పిదాలు..

భారత జట్టు ఈ విఫల్యంలో ఎవరో ఎరిది బాధ్యత కాదు.. మొత్తం జట్టు సమష్టి వైఫల్యం. టాప్‌ ఆర్డర్‌లో లోపాలు, భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోవడం. స్పిన్‌ బౌలింగ్‌ వైఫల్యం, వ్యూహాత్మక వైఫల్యాలన్నీ ఓటమికి కారణమయ్యాయి. కీలకమైన సూపర్‌ 8 దశలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా.. ఫలితం తారమారవుతుంది. టోర్నీలో ముందుకు సాగేందుకు టీమిడియా జింబాబ్వే, వెస్టిండిస్‌ జట్లను ఓడించాల్సి ఉంటుంది. కేవలం మ్యాచుల్లో గెలిస్తే సరిపోతు భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు ఖాతాలో చేరినా.. ప్రత్యర్థి జట్లలో మరో జట్లు నాలుగు పాయింట్లు సాధించినా అప్పుడు రన్‌ రేట్‌ కీలకమవుతుంది. రాబోయే మ్యాచుల్లో మెరుగైన వ్యూహంతో బరిలోకి దిగాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్‌ ఈ నెల 26న జింబాబ్వే, మార్చి 1న వెస్టిండిస్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఏ ఒక్క ఓటమి అయినా టీమిండియా సూపర్‌ 8 దశలోనే ప్రయాణం ముగుస్తుంది.

Advertisement
Advertisement