త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | తొమ్మిది టీ20 ప్రపంచకప్‌లు.. చాంపియన్లుగా ఎనిమిది మంది..! ఎక్కువ మ్యాచులు గెలిచింది ఎవరు?

T20 World Cup | ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి ఎనిమిది వరకు జరుగనున్న టోర్నీకి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్వం ఇవ్వనున్నాయి. పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. రెండు దేశాల్లోని మొత్తం ఎనిమిది వేదికల్లో 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

P

Sports | Published On Feb 6, 2026, 1.35 pm IST

T20 World Cup | తొమ్మిది టీ20 ప్రపంచకప్‌లు.. చాంపియన్లుగా ఎనిమిది మంది..! ఎక్కువ మ్యాచులు గెలిచింది ఎవరు?
Advertisement

T20 World Cup | ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి ఎనిమిది వరకు జరుగనున్న టోర్నీకి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్వం ఇవ్వనున్నాయి. పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. రెండు దేశాల్లోని మొత్తం ఎనిమిది వేదికల్లో 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారత జట్టు బరిలోకి దిగబోతున్నది. ఇటలీ తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడబోతున్నది. ఇక ఇప్పటి వరకు తొమ్మిది ఎడిషన్లలో టీ20 ప్రపంచకప్‌ జరిగింది. ఇప్పటి వరకు ఆ జట్లు కప్‌ని గెలిచాయి. భారత్‌, వెస్టిండిస్‌, ఇంగ్లండ్‌ రెండుసార్లు ట్రోఫీని నెగ్గాయి. అయితే, టీ20 వరల్డ్‌కప్‌లో గత తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది మంది కెప్టెన్లు తమ జట్లను విజయతీరాలకు చేర్చారు. ఈ ఐసీసీ టోర్నీలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో డారెన్‌ సమీ అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. అతని సార్థ్యంలో వెస్టిండిస్‌ జట్టు 2012, 2016లో ఎడిషన్లలో టీ20 కప్‌ గెలిచింది.

ఎంఎస్‌ ధోనీ

టీ20 వరల్డ్‌ కప్‌ తొలి ఎడిషన్‌లోనే ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో టీమిండియా టైటిల్‌ గెలిచింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డు కూడా ధోనీ పేరిటే ఉన్నది. ఆరు టీ20 ప్రపంచకప్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 33 మ్యాచులు ఆడి 21 మ్యాచ్‌లు గెలిచింది. 11 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

యూనిస్‌ ఖాన్‌

2009లో యూనిస్‌ ఖాన్‌ కెప్టెన్సీలో పాకిస్తాన్‌ ఐసీసీ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆ తర్వాత పాకిస్తాన్‌ మళ్లీ టైటిల్‌ని నెగ్గలేదు. యూనిస్‌ కెప్టెన్సీలో పాక్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలుపొందింది. రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. 2009 టీ20 ప్రపంచకప్‌ తర్వాత యూనిస్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. 2010లో షాహిద్‌ అఫ్రిదీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

పాల్‌ కాలింగ్‌వుడ్‌

2010లో పాల్‌ కాలింగ్‌వుడ్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది ఇంగ్లండ్‌. అయితే, టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా కాలింగ్‌వుడ్‌ రికార్డు ఏం బాగోలేదు. అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ టీ20 17 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింట్లో గెలిచింది. జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఓడింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

డారెన్‌ సమీ

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో బెస్ట్‌ కెప్టెన్‌ (టైటిల్స్‌ పరంగా) డారెన్‌ సమీ 2012లో తొలిసారిగా వెస్టిండిస్‌ను ఈ ఫార్మాట్‌లో చాంపియన్‌గా నిలిపాడు. క్రిస్‌ గేల్‌, ఆండ్రే రసెల్‌, సునీల్‌ నరైన్‌తో కూడిన జట్టు ఫైనల్‌లో శ్రీలంకను 36 పరుగుల తేడాతో ఓడించి తొలి టైటిల్‌ను సాధించింది. 2016లోనూ సమీ కెప్టెన్సీలోనే ఇంగ్లండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ రెండు టీ20 వరల్డ్‌ కప్‌ల సమయంలోనూ సమీ వెస్టిండిస్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఆ జట్టు 18 మ్యాచులు ఆడి.. 11 గెలిచింది. ఐదు మ్యాచులు ఓడిపోగా.. మ్యాచ్‌ టై అయ్యింది. ఒక మ్యాచ్‌ నిలిచిపోయింది.

లసిత్‌ మలింగ

2014 వరల్డ్‌ కప్‌లో శ్రీలంకకు మలింగ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. ఫైనల్లో భారత్‌ను ఓడించి శ్రీలంక చాంపియన్‌గా నిలిచింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ దినేశ్‌ చండిమల్‌ ఒక మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. దాంతో ఫైనల్‌లో మలింగ జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ వరల్డ్‌ కప్‌లో మలింగ కెప్టెన్‌గా పని చేయలేదు. మలింగకు కెప్టెన్సీలో శ్రీలంక ఆడిన మూడు మ్యాచుల్లో నెగ్గింది.

ఆరోన్‌ ఫించ్‌

2016లో టీ20 ప్రపంచకప్‌ జరుగలేదు. ఆ తర్వాత 2018లో టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించగా.. జాతీయ జట్లన్నీ బిజీగా ఉండడంతో సాధ్యపడలేదు. ఆ తర్వాత కొవిడ్‌ అడ్డుగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత 2021లో టీ20 ప్రపంచకప్‌ జరిగింది. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు దుబాయిలో న్యూజిలాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇది ఆస్ట్రేలియా సాధించిన ఏకైక టీ20 ప్రపంచ కప్ టైటిల్. ఆ తర్వాత 2022లో కూడా ఫించ్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, అతని జట్టు మళ్లీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఫించ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం పది మ్యాచ్‌లు ఆడి, ఎనిమిదింటిలో గెలిచి రెండింటిలో ఓడిపోయింది.

జోస్‌ బట్లర్‌

2022లో ఇంగ్లండ్‌కు బట్లర్‌ రూపంలో మరోసారి అదృష్టం తీసుకువచ్చింది. జట్టు అద్భుతంగా ఆడి, ఫైనల్లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో బెన్‌ స్టోక్స్‌ బెట్టింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, 2024 టీ20 ఎడిషన్‌లో కూడా బట్లర్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, సెమీఫైనల్లో భారత్‌ చేతిలో ఓడి జట్టు నిష్క్రమించింది. జోస్‌ బట్లర్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ మొత్తం 14 టీ20 ఎడిషన్‌ మ్యాచులు ఆడి వాటిలో తొమ్మిది గెలిచింది. నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

రోహిత్‌ శర్మ

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 2024 టీ20 వరల్డ్‌ కప్‌ గెలుచుకోవడంతో భారత్‌ 11 ఏళ్ల ఐసీసీ టైటిల్‌ కరువును అంతం చేసింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ సాధించింది భారత్‌. ఈ విజయం తర్వాత రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. రోహిత్‌ కెప్టెన్సీలో భారత్‌ టీ20 వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో 14 మ్యాచులు ఆడి 12 మ్యాచ్‌లు గెలిచింది. అతని కెప్టెన్సీలో టీమిండియా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లూ 2022 టీ20 వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌ ఎడిషన్‌లోనే. అయితే, 2024 భారత జట్టు టోర్నమెంట్‌ అంతటా అజేయంగా నిలిచింది.

Advertisement
Advertisement