త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | సొంతగడ్డపైనే కానీ అతిథులుగా.. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగబోతున్న 40 మంది భారత సంతతి క్రికెటర్లు..!

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనున్నది. భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సారి టోర్నీకి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే భారత సంతతికి చెందిన 40 మంది ఆటగాళ్లు వేర్వేరు జట్ల తరఫున మైదానంలోకి దిగబోతున్నారు.

P

Sports | Published On Feb 6, 2026, 2.15 pm IST

T20 World Cup | సొంతగడ్డపైనే కానీ అతిథులుగా.. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగబోతున్న 40 మంది భారత సంతతి క్రికెటర్లు..!
Advertisement

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనున్నది. భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సారి టోర్నీకి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే భారత సంతతికి చెందిన 40 మంది ఆటగాళ్లు వేర్వేరు జట్ల తరఫున మైదానంలోకి దిగబోతున్నారు. ఒకప్పుడు వారంతా భారత్‌ తరఫున క్రికెట్‌ ఆడాలని కలలు కన్నారు. కానీ, తీవ్రమైన పోటీతో అవకాశాలు దక్కక, వలస వెళ్లి ఇతర దేశాల తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వారంతా ఇతర జట్ల జెర్సీలు వేసుకొని విశ్వకప్‌ వేదికపై తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా కెనడా, యూఎస్‌ఏ జట్లలో ఉన్నారు. కెనడాలో 11 మంది, యూఎస్‌ఏ జట్లలో తొమ్మిది మంది చొప్పున, ఒమన్‌, యూఏఈలో ఏడుగురు చొప్పున, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్‌, ఇటలీ, నెదర్లాండ్‌ జట్లలో భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ సారి టోర్నీలో ఆతిథ్య జట్టుగా భారత్‌ టైటిల్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. భారత సంతతి ఆటగాళ్లు తమ జట్ల తరఫున చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది ప్లేయర్లు భారతీయులు ఉన్నారు. కెప్టెన్‌ సహా ఆరుగురు ప్లేయర్లు భారత్‌లో జన్మించారు. కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ సింగ్‌ బజ్వా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జన్మించగా.. నవనీత్ సింగ్ ధాలివాల్ చండీగఢ్‌కు చెందినవాడు. పంజాబ్‌లోని మొహాలీలో జన్మించిన జస్కరన్ సింగ్ బుట్టార్ సైతం భారత్‌ తరఫున ఆడాడు. శ్రేయాస్ మొవ్వా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించాడు. అన్ష్ ప్రదీప్‌కుమార్ పటేల్ గుజరాత్‌లోని వడోదరలో, శివం శర్మ ఢిల్లీలో పుట్టారు. హర్ష్ ఠాకర్, కన్వర్‌పాల్ తత్గూర్, యువరాజ్ సింగ్ సమ్రా, రవీందర్‌పాల్ సింగ్, అజయ్‌వీర్ సింగ్ హుందాల్ కెనడాలో జన్మించగా.. వీరంతా భారత సంతతికి చెందినవారే. ‘భారతదేశంలో అవకాశం పొందడం ఎంత కష్టమో ఆటగాళ్లకు తెలిస్తే.. వారంతా బయట అవకాశాల కోసం చూస్తారు. ఇప్పుడు అవగాహన మరింత త్వరగా వస్తోంది’ అని ఒమన్‌ డిప్యూటీ కోచ్‌ సులక్షణ్‌ కులకర్ణి అభిప్రాయపడ్డారు.

సౌరభ్‌ నేత్రవల్కర్‌

ముంబయిలో జన్మించిన సౌరభ్ నెత్రవల్కర్ ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియంలో జరగున్న మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడనున్నాయి. అండర్-19 విభాగంలో భారత్ తరఫున ఆడిన అతను.. అమెరికాకు వెళ్లాడు. తాను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతానని.. అది కూడా భారత్‌పై ఆడాల్సి వస్తుందని ఊహించలేదని తెలిపాడు. మ్యాచ్‌ సమయంలో స్పందన ఎలా ఉంటుందో చెప్పలేనని.. ఖచ్చితంగా భావోద్వేగ క్షణమవుతుందని తెలిపారు. ఇది నాకు ఓ సర్కిల్‌లాంటిదని.. ఎందుకంటే తాను ముంబయిలోనే క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టానని.. తర్వాత క్రికెట్‌ను వదిలేసి అమెరికా వెళ్లానని.. మళ్లీ క్రికెట్‌ ఆడుతానని ఊహించలేదని 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కమ్‌ క్రికెటర్‌ తెలిపాడు. 2024లో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ జట్టును ఓడించి అమెరికాను సూపర్‌ 8 దశకు తీసుకెళ్లాడు. మరి సారి ఏ జట్టుకు షాక్‌ ఇస్తాడో చూడాల్సిందే. గత ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వంటి దిగ్గజాలను పెవిలియన్‌కు పంపాడు.

అమెరికాకు కెప్టెన్‌గా మోనాంక్‌ పటేల్‌..

ఆనంద్ (గుజరాత్)లో జన్మించిన మోనాంక్ పటేల్ భారత్‌పై అమెరికాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ అతనికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే గుజరాత్ అండర్-19 సహచర ఆటగాడు జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కోనున్నాడు. మోనాంక్ మాట్లాడుతూ మేం కలిసి రెడ్‌బాల్‌, వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడాము.. అప్పుడు మాకు జస్‌ప్రీత్‌లో ప్రత్యేక ప్రతిభ ఉందని.. గొప్ప విజయం సాధిస్తాడని భావించామని తెలిపాడు. 32 ఏళ్ల మోనాక్‌ పటేల్‌.. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై అర్ధ సెంచరీతో యూఎస్‌ఏ జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు.

నెరవేరని జతీందర్‌ సింగ్‌ కల

లూథియానాలో జన్మించిన జతీందర్ సింగ్ ఒమన్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 36 సంవత్సరాల వయసులో ప్రపంచకప్‌ ఆడుతున్నాడు. భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం దక్కలేదు. ఈ సారి కూడా ఆ నెల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఈ సారి ఒమన్‌ లీగ్‌ మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరుగనున్నాయి. దాంతో భారత్‌లో క్రికెట్‌ ఆడాలన్న కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే, ఒమన్‌ సూపర్‌ 8కి చేరితే మాత్రం భారత్‌లో ఆడే అవకాశం దక్కే ఛాన్స్‌ ఉంది.

ఇటలీ తరఫున జస్‌ప్రీత్‌ సింగ్‌

పంజాబ్‌లోని ఫగ్వారాలో జన్మించిన జస్‌ప్రీత్ సింగ్ ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఇటలీ తరపున ఆడనున్నాడు. 2006లో తన కుటుంబంతో కలిసి ఇటలీకి వెళ్లిన జస్‌ప్రీత్.. టేప్ బాల్ క్రికెట్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఒకప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా జీవనం సాగించిన జస్‌ప్రీత్‌ కల ఎట్టకేలకు నెరవేరనున్నది. తొలిసారిగా ఆడాలన్న కల నెరవేర్చుకోనున్నాడు. ఇటలీ తొలి మ్యాచ్‌ను ఈ నెల 9న కోల్‌కతాలో స్కాట్లాండ్‌తో తలపడనున్నది. ఆ జట్టు లీగ్‌ మ్యాచులన్నీ భారత్‌లో జరుగనున్నాయి.

డచ్‌ జట్టులో ఒకే ఒక్కడు ఆర్యన్‌ దత్‌..

నెదర్లాండ్స్‌ జట్టులో ఒకే భారత సంతతి క్రికెటర్‌ ఉన్నాడు. అతనే ఆర్యన్‌ దత్‌. ఆ జట్టులో ఆఫ్‌ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. డచ్ ఆఫ్-స్పిన్నర్ ఆర్యన్ దత్ 2023 వన్డే ప్రపంచ కప్‌లో స్వదేశంలో.. సొంత అభిమానుల ముందు క్రికెట్‌ ఆడాడు. పంజాబ్‌ మూలాలున్న ఆర్యన్‌ తాజా జరిగే ఈ టోర్నీలో భారీ జట్లకు షాక్‌ ఇవ్వాలని చూస్తున్నాడు.

కెనడా కెప్టెన్‌గా దిల్‌ప్రీత్‌ బజ్వా

గురుదాస్‌పూర్‌లో జన్మించిన దిల్‌ప్రీత్ బజ్వా 2020లో కెనడాకు వెళ్లాడు. పంజాబ్‌లో పరిమిత క్రికెట్‌ ఆడాడు. బ్యాట్స్‌తో పరుగులు చేసినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో కెనడాకు మకాం మార్చాడు. అక్కడ కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. 23 ఏళ్ల దిల్‌ప్రీత్‌ ప్రస్తుతం కెనడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సొంత దేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడుతుండడం ఆనందంగా ఉన్న.. సొంత జట్టుకు ప్రాతినిథ్యం వహించకపోవడం అతని బాధను కలిగించింది.

కెనడా : దిల్‌ప్రీత్‌ బజ్వా (కెప్టెన్‌), అజయవీర్ హుండల్, అంష్ పటేల్, హర్ష ఠాకర్, జస్కరణ్‌ సింగ్‌ బుట్టర్‌, హర్ష్ తుషార్‌భాయ్ థాకర్, నవనీత్ ధాలివాల్, రవీందరపాల్ సింహ, శివం శర్మ, శ్రేయస్ మోవా, యువరాజ్ సమరా.

అమెరికా : మోనాంక్ పటేల్ (కెప్టెన్‌), జేసీ సింగ్‌, మిలింద్ కుమార్, నోస్తూష్ కెన్జిగె, సాయితేజ ముక్కమల్ల, కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్‌ బద్దన్‌, సౌరభ్‌ నేత్రవల్కర్‌, శుభమ్ రంజనే.

ఒమన్‌ : జతిందర్ సింహ (కెప్టెన్‌), వినాయక్ శుక్ల, కరణ్‌ సోనావలే, జయ్ ఒడెద్రా, ఆశీష్ కుమార్‌, జితేన్ రామానంది, వాసిమ్‌ అలీ.

యూఏఈ : అలీషన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్‌ పరాశర్, హర్షిత్ కౌషిక్, మయంక్ కుమార్‌, సిమ్రన్‌ జిత్‌ సింగ్‌, సోహైబ్ ఖాన్.

న్యూజిలాండ్ : ఈష్ సోధి, రచిన్ రవీంద్ర

దక్షిణాఫ్రికా : కేశవ మహారాజ్

వెస్టిండీస్ : గుడాకేష్ మోటి

ఇటలీ : జస్‌ప్రీత్ సింహ

నెదర్లాండ్‌ : ఆర్యన్ దత్త

Advertisement
Advertisement