త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neymar | క‌న్నీళ్ల‌తోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్ర‌యాణం.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్‌కు నెయ్‌మ‌ర్ గుడ్‌బై..!

Neymar | ఫిఫా ప్రపంచకప్-2026లో బ్రెజిల్ ప్రయాణం రౌండ్ ఆఫ్-16లోనే ముగియడంతో స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. నార్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-1తో బ్రెజిల్ ఓటమి పాలైన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించిన నెయ్‌మర్.. సెలెకావో (బ్రెజిల్ జాతీయ జట్టు) తరఫున తన ప్రయాణం ఇక్కడితో ముగిసిందని భావోద్వేగంగా వెల్లడించాడు.

P

Sports | Published On Jul 6, 2026, 8.56 am IST

Neymar | క‌న్నీళ్ల‌తోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్ర‌యాణం.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్‌కు నెయ్‌మ‌ర్ గుడ్‌బై..!
Advertisement
  • నార్వే చేతిలో ప‌రాజ‌యం త‌ర్వాత కీల‌క ప్ర‌క‌ట‌న‌
  • 16 ఏళ్ల కెరీర్ ఇక్క‌డితో ముగిసిపోయింద‌ని వెల్ల‌డి

Neymar | ఫిఫా ప్రపంచకప్-2026లో బ్రెజిల్ ప్రయాణం రౌండ్ ఆఫ్-16లోనే ముగియడంతో స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. నార్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-1తో బ్రెజిల్ ఓటమి పాలైన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించిన నెయ్‌మర్.. సెలెకావో (బ్రెజిల్ జాతీయ జట్టు) తరఫున తన ప్రయాణం ఇక్కడితో ముగిసిందని భావోద్వేగంగా వెల్లడించాడు. న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్ బ్రెజిల్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌తో నార్వే చారిత్రక విజయాన్ని అందుకోగా.. ఇంజ్యూరీ టైమ్‌లో నెయ్‌మర్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన నెయ్‌మర్.. మరోసారి ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమించినా.. తన అంతర్జాతీయ కెరీర్‌కు ఇదే ముగింపు వెల్ల‌డించారు.

గాయంతో తొలి మ్యాచుల‌కు దూరం..

ఈ ప్రపంచకప్‌లో నెయ్‌మర్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ ఆగ‌లేదు. గాయంతో టోర్నీలో అడుగుపెట్టిన స్టార్ ప్లేయ‌ర్‌.. బ్రెజిల్ తొలి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. క్రమంగా కోలుకొని కోచ్ కార్లో అన్సెలోట్టి ప్రణాళికల్లో చోటు సంపాదించాడు. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత కూడా ఎక్కువ‌గా ప్రత్యామ్నాయ ఆటగాడిగానే సేవ‌లు తీసుకున్నారు. స్కాట్లాండ్, నార్వేతో జరిగిన మ్యాచ్‌ల్లో బెంచ్ నుంచి బరిలోకి దిగిన నెయ్‌మర్.. నార్వేపై చేసిన పెనాల్టీ గోల్‌నే బ్రెజిల్ తరఫున తన చివరి అంతర్జాతీయ గోల్‌గా కెరీర్‌లో నిలిచిపోయింది.

ఓ తరం ఫుట్‌బాల్‌కు గుర్తుగా..

2010లో బ్రెజిల్ సీనియర్ జట్టులో అరంగేట్రం చేసిన నెయ్‌మర్.. 129 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 80 గోల్స్ చేసి దేశ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన పురుష ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. నాలుగు ఫిఫా ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించిన నెయ్‌మర్.. దాదాపు పదేళ్లకుపైగా బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు ముఖచిత్రంగా నిలిచాడు. ప్రపంచకప్ ట్రోఫీ క‌ల మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయినా.. అంతర్జాతీయ వేదికపై ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2013లో ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్‌ను గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించిన నెయ్‌మర్.. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వదేశంలో బ్రెజిల్‌కు తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కెప్టెన్‌గా అందించాడు. అంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం కూడా సాధించి పెట్టాడు. అయితే, అత‌ని అంతర్జాతీయ కెరీర్ అంతా సునాయాసంగా ఏమీ సాగ‌లేదు. కీలక టోర్నీల్లో గాయాలు పదేపదే వెంటాడగా.. కోట్లాది అభిమానుల అంచనాలు మోయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేది. అంచ‌నాల భారం ఉన్నా తన అద్భుతమైన ఆటతీరుతో బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానం సంపాదించాడు.

కన్నీళ్లతో ముగిసిన చివరి మ్యాచ్

గాయం నుంచి కోలుకొని ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి నెయ్‌మర్ తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మైదానంలో అడుగుపెట్టినా.. నాకౌట్ దశలోనే బ్రెజిల్ నిష్క్రమించడం అతడికి తీవ్ర నిరాశను మిగిల్చింది. నార్వేతో మ్యాచ్ ముగిసిన వెంటనే కొద్దిసేపు మైదానంలోనే నిశ్శబ్దంగా నిలిచిపోయిన నెయ్‌మర్.. ఆ తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. గత దశాబ్దకాలంగా బ్రెజిల్ ఆశలను మోసుకుకుంటూ వ‌చ్చిన ఈ స్టార్‌ను సహచర ఆటగాళ్లు ఓదార్చారు. ఈ ఓటమితో కోచ్ కార్లో అన్సెలోట్టి హయాంలో బ్రెజిల్ ప్రపంచకప్ ప్రయాణం కూడా ముగిసింది. గ్రూప్ దశలో ఫలితాలు సాధించిన అన్సెలోట్టి వ్యూహం.. నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఫలించలేదు. టోర్నీలోనే అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచిన ఈ విజయంతో నార్వే ముందంజ వేయగా.. బ్రెజిల్ ఇంటిముఖం పట్టింది.

పెనాల్టీ గోల్‌తో..

నెయ్‌మర్‌కు మాత్రం ఈ ఓటమి మరింత ప్రత్యేకంగా నిలిచింది.బ్రెజిల్ జెర్సీలో అత‌ని చివరి పెనాల్టీ గోల్‌గా ఖాతాలో వేసుకున్నాడు. కానీ, చివరి మ్యాచ్ మాత్రం కన్నీళ్లతోనే ముగిసింది. గాయాలు అడ్డంకిగా మారకపోయి ఉంటే కెరీర్ మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించేద‌న్న చ‌ర్చ సాగుతూనే ఉండేది. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా, ఓ తరం ఫుట్‌బాలర్లకు స్ఫూర్తిగా నిలిచిన నెయ్‌మర్ తన అంతర్జాతీయ ప్రయాణాన్ని నిరాశ‌తో ముగించాల్సి వ‌చ్చింది. అయినా, ఎంద‌రో యువ ఆట‌గాళ్ల‌కు స్ఫూర్తిగా నిలిచాడు.

Advertisement
Advertisement