త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | టీ20 సంగ్రామం స్టార్ట్.. క్రికెట్ అభిమానులకు రెండు నెలలు నాన్‌స్టాప్ పండగ!

IPL 2026 | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్‌ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మండు వేసవిలో అలసిపోయే వారికి మైదానంలో బంతికి, బ్యాట్‌కి మధ్య జరిగే పోరును ఎంజాయ్‌ చేస్తూ సేద తీరే సమయం రానే వచ్చేసింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ని ఎంజాయ్‌ చేసిన అభిమానులు మరోసారి రెండునెలల పాటు ఐపీఎల్‌ అలరించనుంది.

P

Sports | Published On Mar 28, 2026, 7.56 am IST

IPL 2026 | టీ20 సంగ్రామం స్టార్ట్.. క్రికెట్ అభిమానులకు రెండు నెలలు నాన్‌స్టాప్ పండగ!
Advertisement

IPL 2026 | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్‌ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మండు వేసవిలో అలసిపోయే వారికి మైదానంలో బంతికి, బ్యాట్‌కి మధ్య జరిగే పోరును ఎంజాయ్‌ చేస్తూ సేద తీరే సమయం రానే వచ్చేసింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ని ఎంజాయ్‌ చేసిన అభిమానులు మరోసారి రెండునెలల పాటు ఐపీఎల్‌ అలరించనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 19వ సీజన్‌ శనివారం నుంచి మొదలుకానుంది. బ్యాట్‌తో బ్యాట్స్‌మెన్స్‌ సిక్సర్ల వర్షం కురిసించేందుకు.. బంతితో నిప్పులు చెరిగేందుకు బౌలర్ల సన్నద్ధం కాగా.. ఉత్కంఠ పోరును చూసి అభిమానులు కేరింతలు కొట్టనున్నారు.

70 లీగ్‌ మ్యాచ్‌లు..

ఐపీఎల్‌ 19వ సీజన్‌ శనివారం ప్రారంభం కానుంది. బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాధ్ మధ్య తొలి మ్యాచ్‌లో జరుగనుంది. తొలి మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. ఐపీఎల్‌ను స్టార్‌ స్పోర్స్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉటుంది. మార్చి 28న మొదలయ్యే లీగ్‌ దశ.. మే 24 వరకు కొనసాగుతుంది. ఈ సీజన్‌లోనూ మొత్తం 74 మ్యాచులు జరుగనుండగా.. 70 లీగ్‌ మ్యాచులకు సంబంధించిన వేదికలను బీసీసీఐ ప్రకటించింది.

రెండు దశల్లో ఐపీఎల్‌..

ఈ సారి ఐపీఎల్‌ను రెండుదశల్లో బీసీసీఐ నిర్వహించనుంది. ఈ సారి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ఎన్నికలు జరిగే విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి విడత లీగ్‌ మ్యాచ్‌లను 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు షెడ్యూల్‌ను బీసీసీఐ గతంలో విడుదల చేసింది. గురువారం మిగతా 50 మ్యాచుల షెడ్యూల్‌ను సైతం బీసీసీఐ రిలీజ్‌ చేసింది. రెండో దశ లీగ్‌ మ్యాచులను ఏప్రిల్‌ 13 మే 23 వరకు 12 వేదికల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. బెంగళూరులో శనివారం జరిగే లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతాయని, ఫైనల్‌ మే 31న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

మ్యాచ్‌ వేదికలు..

రెండుదశల్లో మ్యాచులు బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, లక్నో, జైపూర్‌, ధర్మశాల, రాయ్‌పూర్‌, న్యూ చండీగఢ్‌లో జరుగుతాయి. ఇక హైదరాబాద్‌ జట్టు మ్యాచులు తొలి దశలో ఒకటే ఉండగా.. లక్నోతో తలపడుతుంది. ఇక రెండో దశలోనే ఆరు మ్యాచులు ఆడుతుంది. రెండుదశల్లో కలిపి మొత్తం 10 డబుల్‌ హెడర్‌ మ్యాచులు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్‌ 7.30 గంటలకు ఉంటుంది. పంజాబ్‌ కింగ్స్‌ తమ స్వస్థల మ్యాచ్‌లను న్యూచండీగఢ్‌, ధర్మశాలలో ఆడనుంది. అలాగే, ఆర్‌సీబీ హోంగ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచులు, మిగతా రెండు మ్యాచులు రాయ్‌పూర్‌లో ఆడుతుంది. ఇక ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.

టైటిల్‌ గెలువలేకపోయిన మూడు జట్లు..

ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తూ వస్తోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటివరకు పలు జట్లు టైటిల్‌ను సొంతం చేసుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. తొలి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ విజేతగా నిలిచింది. 2009లో డెక్కన్‌ చార్జెస్‌ ట్రోఫీని సాధించింది. 2010, 2011 సీజన్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలిసారిగా టైటిల్‌ను నెగ్గాయి. 2013 నుంచి ముంబయి ఆధిపత్యం కొనసాగింది. ఈ జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐదు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకుని అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇదే సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం 2018, 2021, 2023లోనూ గెలిచి ఐదుసార్లు టైటిల్‌ గెలిచిన జట్టుగా ఘనత సాధించింది. కేకేఆర్‌ 2012, 2014, 2024లో విజయం సాధించి మూడు టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉంది. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, 2022లో గుజరాత్‌ టైటిల్స్‌ను గెలిచాయి. గత సీజన్‌లో ఆర్‌సీబీ తొలిసారిగా టైటిల్‌ను సాధించింది. 18వ సీజన్లలో కేవలం మూడు జట్లు ఇప్పటి వరకు టైటిల్‌ను గెలవలేకపోయాయి. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ ఉన్నాయి. ఈ సారైనా టైటిల్‌ కలను సాకారం చేసుకోవాలని కసితో ఉన్నాయి.

ఈ సారి ప్రారంభోత్సవ వేడుకలు లేకుండానే..

ఐపీఎల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అట్టహాసంగా వేడుకలు నిర్వహించే విషయం తెలిసిందే. ఈ సారి బీసీసీఐ వేడుకలను రద్దు చేసింది. గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగే మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. సాధారణంగా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ తారలు, ప్రముఖ గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ సారి అలాంటి వేడుకలు సైతం ఉండవని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్‌ ఫైనల్‌ సైతం బెంగళూరులోనే జరుగనుంది. ముగింపు వేడుకలైనా నిర్వహిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement