త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | కోహ్లీ, రోహిత్‌ల‌ను వెన‌క్కి నెట్టి.. స‌రికొత్త రికార్డును నెల‌కొల్పిన కేఎల్ రాహుల్‌..!

IPL 2026 | ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 75 పరుగుల ఇన్నింగ్స్‌తో ఓపెనర్‌గా 200 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు.

P

Sports | Published On May 2, 2026, 5.00 pm IST

IPL 2026 | కోహ్లీ, రోహిత్‌ల‌ను వెన‌క్కి నెట్టి.. స‌రికొత్త రికార్డును నెల‌కొల్పిన కేఎల్ రాహుల్‌..!
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. భారీ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. శుక్రవారం జైపూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాహుల్ కేవ‌లం 40 బంతుల్లోనే 75 ప‌రుగులు చేశాడు. ఇందులో ఐదు భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో స్పెష‌ల్ క్ల‌బ్‌లో చేరాడు.

200 సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్‌గా..

ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా 200 సిక్సర్లు బాదిన తొలి భార‌తీయ బ్యాట్స్‌మన్‌గా రాహుల్ ఘ‌న‌త సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను వెన‌క్కి నెట్టాడు. రాహుల్ ఇప్పటివరకు ఓపెనర్‌గా 201 సిక్సర్లు బాదాడు. కోహ్లీ 192, రోహిత్ 148 సిక్సర్లతో ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాజీ బ్యాట్స్‌మెన్ శిఖ‌ర్ ధావ‌న్ 143 సిక్స‌ర్ల‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. మొత్తం ఐపీఎల్ ఓపెనర్ల జాబితాలో రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 326 సిక్స‌ర్ల‌టో అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. డేవిడ్ వార్న‌ర్ (210) ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు.

జోరుమీదున్న రాహుల్

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 433 పరుగులు చేశాడు. ఇందులో సెంచ‌రీ, మూడు హాఫ్ సెంచ‌రీలున్నాయి. ఇందులో 24 సిక్స‌ర్లు, 42 ఫోర్లు ఉన్నాయి. ఇదే సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌పై 67 బంతుల్లోనే అజేయంగా 152 ప‌రుగులు చేసి రికార్డు నెల‌కొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొమ్మిది సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఐపీఎల్ చ‌రిత్ర‌లో మూడో అత్యధిక స్కోరు కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా.. కేఎల్ రాహుల్ 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఓపెన‌ర్‌గానే కాకుండా మిడిల్ ఆర్డ‌ర్‌లోనూ ఆయా జ‌ట్ల‌కు సేవ‌లందించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 154 మ్యాచులు ఆడి మొత్తం 5655 ప‌రుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచ‌రీలు, 43 హాఫ్ సెంచ‌రీలున్నాయి. మొత్తం 232 సిక్సర్లు, 494 ఫోర్లు బాదాడు.

Advertisement
Advertisement