త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs WI | టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌.. కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన సంజు శాంసన్‌

IND Vs WI | టీమిండియా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టీమిండియాకు ఎంతో కలిసి వచ్చిన కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టీండిస్‌ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలోనే ఛేదించింది.

P

Sports | Published On Mar 1, 2026, 11.02 pm IST

IND Vs WI | టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌.. కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన సంజు శాంసన్‌
Advertisement

IND Vs WI | టీమిండియా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టీమిండియాకు ఎంతో కలిసి వచ్చిన కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టీండిస్‌ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలోనే ఛేదించింది. కేరళ కుర్రాడు సంజు శాంసన్‌ తన సత్తా చాటాడు. కీలక మ్యాచ్‌లో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సెమీస్‌లో ఈ నెల 5న ముంబయి వేదికగా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనున్నది.

రాణించిన సంజు శాంసన్‌

గత రెండు మ్యాచుల్లో పెద్దగా స్కోర్‌ చేయలేకపోయిన ఓపెనర్‌ సంజు శాంసన్‌ కోల్‌కతా మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్‌ సైతం పది పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఒక దశలో 4.3 ఓవర్లలో 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను శాంసన్‌ అదుకున్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మూడు వికెట్‌కు 35 బంతుల్లో 58 పరుగులు జోడించారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోర్‌ బోర్డు పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సూర్య కుమార్‌ అవుట్‌ అయినా తిలక్‌ వర్మ (27)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తెలుగు కుర్రాడు తిలక్‌ సైతం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పాటు వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశాడు. ఈ క్రమంలో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించి హోల్డర్‌ బౌలింగ్‌లో హెట్‌మెయర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా (17) పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. చివరగా శుభమ్‌ దూబే (8)తో కలిసి టీమిండియాను గెలుపుబాటలో నడిపించాడు. శాంసన్‌ చివరకు వరకు క్రీజులో నిలిచి టీమిండియాను గెలుపుబాటలో నడిపించాడు. శాంసన్‌ 50 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అజేయంగా 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఫీల్డర్లు కీలక క్యాచులు జారవిడిచి నిరాశ పరిచారు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ప్రారంభం నుంచే టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతూ వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ (32), రోస్టన్‌ ఛేజ్‌ (40) శుభారంభం అందించారు. ఆ తర్వాత షిమ్రోన్‌ హెట్‌మెయర్‌ 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. 12వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో హెట్‌మెయర్‌, రోస్టన్‌ ఛేజ్‌ ఇద్దరూ అవుట్‌ అయ్యాడు. ఒక దశలో నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రోవ్‌మన్‌ పావెల్‌, జేసన్‌ హోల్డర్‌ జోడీ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈ జోడీ ఐదో అజేయంగా 76 పరుగులు చేయడంతో కరేబియన్‌ జట్టు భారీ స్కోర్‌ చేయగలిగింది. హోలర్డ్‌ 22 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. పావెల్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరు చివరి ఓవర్లలో అర్ష్‌దీప్‌, హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో చితక్కొట్టారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌కు చెరో వికెట్‌ దక్కింది. అర్ష్‌దీప్‌ నాలుగు ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

వెస్టిండీస్‌పై తిరుగులేని భారత్..

టీ20ల్లో కరేబియన్‌ జట్టుపై టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉన్నది. ఇప్పటి వరకు 31 సార్లు రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ 19 సార్లు గెలిచింది. పది సార్లు వెస్టిండీస్‌ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇదిలా ఉండగా.. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో భారత్‌కు అచ్చొచ్చిన మైదానం. 2011 అక్టోబర్‌లో ఇంగ్లండ్ చేతిలో ఒక్కసారి మాత్రమే ఓటమిపాలైంది. ఎనిమిది టీ20 మ్యాచుల్లో భారత్ వరుస విజయాలు సాధించింది. 2016 నుంచి ఇప్పటివరకు భారత్ ఈడెన్‌లో ఓడిపోలేదు. ఇక్కడ విండీస్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌లను క్లీన్ స్వీప్ చేసింది. చివరగా, 2022 ఫిబ్రవరిలో ఇక్కడ కరేబియన్‌ జట్టును మట్టి కరిపించింది. తాజాగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచులోనూ మరోసారి విజయాన్ని నమోదు చేసి.. రికార్డును కొనసాగించింది.

Advertisement
Advertisement