త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2027 | ముంబ‌యి ఇండియ‌న్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌ బై?

IPL 2027 | ఐపీఎల్‌ 2027కు ముందే స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టు మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదు నెలలుగా ముంబ‌యిని పాండ్యా వీడతాడంటూ ప్రచారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా పంజాబ్ కింగ్స్ జ‌ట్టులో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

P

Sports | Published On Nov 3, 2026, 3.54 pm IST

IPL 2027 | ముంబ‌యి ఇండియ‌న్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌ బై?
Advertisement
  • పంజాబ్‌తో భారీ ట్రేడ్ డీల్‌..
  • అర్ష్‌దీప్‌ సింగ్‌, విష్ణు వినోద్ ముంబ‌యి జ‌ట్టుకు
  • ఈ నెల 17లోగా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం

IPL 2027 | ఐపీఎల్‌ 2027కు ముందే స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టు మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదు నెలలుగా ముంబ‌యిని పాండ్యా వీడతాడంటూ ప్రచారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా పంజాబ్ కింగ్స్ జ‌ట్టులో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు బ‌దులుగా టీమిండియా స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌, వికెట్ కీప‌ర్ కం బ్యాట‌ర్ విష్ణు వినోద్‌ను ముంబ‌యికి ఇచ్చేందుకు రెండు ఫ్రాంచైజీల మ‌ధ్య చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌కు సంబంధించి రెండు జట్ల కీలక ప్రతినిధులు దాదాపు ఓ అంగీకారానికి వచ్చినట్లు స్పోర్ట్‌స్టార్‌ కథనం పేర్కొంది. అయితే దీనిపై రెండు ఫ్రాంచైజీలు, ఐపీఎల్ యాజ‌మాన్యం స్పందించ‌లేదు.

ఆల్‌రౌండ‌ర్‌పై పంజాబ్ దృష్టి

పంజాబ్‌ కింగ్స్‌ తమ జట్టులో మ్యాచ్‌ విన్నింగ్‌ ఆల్‌రౌండర్‌ను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముంబ‌యి ఇండియన్స్‌ నుంచి వచ్చిన ప్రతిపాదనతో ట్రేడ్‌ చర్చలు మొదలయ్యాయని తెలుస్తోంది. హార్దిక్‌ పంజాబ్‌ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం సైతం బ‌లోపేతం కానుంది. మరోవైపు అర్ష్‌దీప్‌ రూపంలో ముంబ‌యికి కీల‌క‌మైన ఎడమచేతి వాటం పేసర్‌ అందుబాటులోకి వస్తాడు. విష్ణు వినోద్‌ వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాడు. అయితే, అర్ష్‌దీప్‌ జట్టును వీడితే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు పంజాబ్‌ మరో ట్రేడ్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు చెందిన మోహ్సిన్‌ ఖాన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

కేకేఆర్‌తోనూ చర్చలు.. సీఎస్‌కే పేరు కూడా..

ఐపీఎల్‌ 2026లో ముంయి ఇండియన్స్‌ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో జట్టులో మార్పులపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో హార్దిక్‌ ట్రేడ్‌ వ్యవహారంలో తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) పేర్లు వినిపించాయి. హార్దిక్‌ కోసం శివమ్‌ దూబే, డెవాల్డ్‌ బ్రెవిస్‌లను ఇచ్చేందుకు సీఎస్‌కే సిద్ధమవుతోందంటూ ప్రచారం జరిగింది. అయితే, అలాంటి చర్చలేవీ జరగలేదని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. కొత్త కోచ్‌ నియామకం తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కేకేఆర్‌తో ముంబ‌యి చర్చలు జరిపినట్లు కథనాలు వ‌చ్చాయి. హర్షిత్‌ రాణా, అంగ్‌క్రిష్‌ రఘువంశీ వంటి యువ ఆటగాళ్ల పేర్లు కూడా ప్రతిపాదనల్లో ఉన్నట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు కోల్‌కతా ఆసక్తి చూపకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదని సమాచారం. హార్దిక్‌కు కేకేఆర్‌ కెప్టెన్సీ ఆఫర్‌ చేయనున్నట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

రోహిత్‌ కెప్టెన్సీలో ఆడేందుకు ఓకేనా?

ముంబ‌యి ఇండియన్స్‌లోనూ నాయకత్వ మార్పులపై చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌ 2027కు ముందు కోచింగ్‌ బృందంలో మార్పులు చేస్తూ.. మహేల జయవర్ధనే స్థానంలో కీరన్‌ పొలార్డ్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించినట్లు సమాచారం. మరోవైపు రోహిత్‌ శర్మ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇతర జట్టుతో ట్రేడ్‌ కుదరకపోతే రోహిత్‌ నాయకత్వంలో ముంబ‌యి తరఫున ఆడేందుకు హార్దిక్‌ కూడా సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. పంజాబ్‌తో తాజా చర్చలు ఈ సమీకరణాలు మారేలా క‌నిపిస్తున్నాయి.

గుజ‌రాత్ నుంచి వ‌చ్చి పంజాబ్‌కు..?

2024 ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ఆల్‌క్యాష్‌ ట్రేడ్‌ ద్వారా హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌కు తిరిగొచ్చాడు. అంతకుముందు గుజరాత్‌ కెప్టెన్‌గా 2022లో జట్టుకు టైటిల్‌ అందించాడు. ముంబ‌యి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాడు. గత మూడు సీజన్లలో రెండుసార్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది. ఇక అర్ష్‌దీప్‌ సింగ్‌ను పంజాబ్‌ 2025 మెగా వేలానికి ముందు విడుదల చేసినప్పటికీ.. ఆర్‌టీఎం కార్డు ఉపయోగించి రూ.18 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది. అలాంటి కీలక బౌలర్‌ను ట్రేడ్‌లో భాగంగా వదులుకోవడం పంజాబ్‌కు క‌ఠిన నిర్ణ‌య‌మే. నవంబర్‌ 17 రిటెన్షన్‌ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ట్రేడ్‌ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. ఒప్పందం ఖరారైతే ఐపీఎల్‌ 2027కు ముందు ముంబ‌యి, పంజాబ్‌ జట్ల కూర్పులో భారీ మార్పులు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ట్యాగ్స్:

Arshdeep SinghChennai Super KingsCricket NewsHardik PandyaHardik Pandya TradeIPL 2027IPL 2027 RetentionIPL Retention DeadlineIPL TradeKkrMarcus StoinisMohsin KhanMumbai IndiansPunjab KingsRohit SharmaTelugu NewsVishnu Vinod
Advertisement
Advertisement