త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భార‌త్‌ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్‌ పంచ్‌ అదుర్స్‌!

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగింది. లవ్లీనా బోర్గోహెయిన్, పర్వీన్‌ హుడా తర్వాత అంకుశ్‌ పంఘాల్‌ కూడా పసిడి పంచ్‌ విసిరాడు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్‌ స్వర్ణం సాధించాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ మిన్‌సియాంగ్‌పై 4–0తో ఘన విజయం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్‌ ప్రస్థానం 3 స్వర్ణాలు, 3 కాంస్యాలతో.. మొత్తం 6 పతకాలతో ముగిసింది.

P

Sports | Published On Oct 2, 2026, 5.12 pm IST

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భార‌త్‌ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్‌ పంచ్‌ అదుర్స్‌!
Advertisement

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగింది. లవ్లీనా బోర్గోహెయిన్, పర్వీన్‌ హుడా తర్వాత అంకుశ్‌ పంఘాల్‌ కూడా పసిడి పంచ్‌ విసిరాడు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్‌ స్వర్ణం సాధించాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ మిన్‌సియాంగ్‌పై 4–0తో ఘన విజయం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్‌ ప్రస్థానం 3 స్వర్ణాలు, 3 కాంస్యాలతో.. మొత్తం 6 పతకాలతో ముగిసింది.

ఆరంభం నుంచే దూకుడు

ఫైనల్లో అంకుశ్‌ తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా ఆడాడు. వేగంగా, కచ్చితంగా పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. తొలి రౌండ్‌ను 4–1తో సొంతం చేసుకున్నాడు. కిమ్‌కు హెచ్చరిక కారణంగా ఒక పాయింట్‌ కోత కూడా పడింది. రెండో రౌండ్‌లో అంకుశ్‌ మరింత చెలరేగాడు. వన్‌–టూ పంచ్‌లతో అవకాశాలు సృష్టిస్తూ.. ప్రత్యర్థి దాడులను కౌంటర్‌ పంచ్‌లతో తిప్పికొట్టాడు. ఐదుగురు జడ్జిలూ ఈ రౌండ్‌ను అంకుశ్‌కే కేటాయించారు. మూడో రౌండ్‌లోనూ అంకుశ్‌ అదే వ్యూహాన్ని కొనసాగించాడు. ప్రత్యర్థి పంచ్‌లను సమర్థంగా తప్పించుకుంటూ.. సరైన సమయంలో కౌంటర్‌ ఇచ్చాడు. ఈ రౌండ్‌ను 4–1తో గెలిచాడు. దీంతో 4–0 తేడాతో విజయం ఖాయమైంది. నలుగురు జడ్జిలు 30–26 స్కోరుతో అంకుశ్‌కు అనుకూలంగా తీర్పునివ్వగా.. మరో జడ్జి 28–28గా స్కోర్‌ చేశాడు.

80 కేజీల్లో ఇదే తొలి స్వర్ణం

అంకుశ్‌ విజయానికి మ‌రో ప్ర‌త్యేక‌త ఉన్న‌ది. ఆసియా క్రీడల్లో పురుషుల 80 కేజీల విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. డిఫెన్స్‌, వేగం, కౌంటర్‌ పంచ్‌లను సమన్వయం చేస్తూ అంకుశ్‌ ఫైనల్లో ఆకట్టుకున్నాడు. 2005 ఆగస్టు 13న హరియాణాలోని హిసార్‌లో జన్మించిన అంకుశ్‌.. తండ్రి సూచనతో బాక్సింగ్‌లోకి వచ్చాడు. అంతకుముందు మూడేళ్ల పాటు కబడ్డీ ఆడాడు. బాక్సింగ్‌లోకి మారిన తర్వాత డిఫెన్సివ్‌ టెక్నిక్‌, కౌంటర్‌ పంచ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది అంకుశ్‌కు కలిసొచ్చింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అతడు.. చెక్‌ రిపబ్లిక్‌లోని ఉస్తీ నాడ్‌ లాబెమ్‌ గ్రాండ్‌ప్రిలోనూ పసిడి కొల్లగొట్టాడు. 2025లో న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌ గ్లోబల్‌ ఫైనల్స్‌లో రజతం సాధించాడు.

ల‌వ్‌ల్లీనా, పర్వీన్‌కు స్వ‌ర్ణాలు..

అంకుశ్‌కు ముందు మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్‌ హుడా స్వర్ణం సాధించింది. చైనీస్‌ తైపీకి చెందిన చెన్‌ నిన్‌–చిన్‌ను 3–2తో ఓడించింది. తొలి రౌండ్‌ను 5–0తో గెలిచిన పర్వీన్‌కు రెండో రౌండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. అయితే నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో నిలకడగా ఆడి 3–2తో గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన మూడో భారత బాక్సర్‌గా పర్వీన్‌ నిలిచింది. అంతకుముందు మేరీకోమ్‌ (2014), లవ్లీనా బోర్గోహెయిన్‌ స్వర్ణాలు సాధించారు. ఇక నేడు (అక్టోబర్ 2న) 29వ పుట్టినరోజు జరుపుకున్న లవ్లీనా బోర్గోహెయిన్‌.. అదే రోజు గోల్డ్ మెడ‌ల్‌తో సంబరాలు జ‌రుపుకుంది. మహిళల 75 కేజీల ఫైనల్లో చైనాకు చెందిన బావో జియీని 5–0తో చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అయిన లవ్లీనా.. 2022 ఆసియా క్రీడల రజతాన్ని ఈసారి గోల్డ్‌గా మ‌లిచింది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి పసిడి ప‌త‌కం కావ‌డం విశేషం.

మూడు కాంస్యాలూ..

భారత బాక్సింగ్‌ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. పురుషుల 90 కేజీల విభాగంలో కపిల్‌ పోఖారియా, 90 కేజీలకు పైబడిన విభాగంలో నరేంద్ర బర్వాల్‌, మహిళల 60 కేజీల విభాగంలో ప్రియాంక ఘాంగాస్‌ కాంస్యాలు సాధించారు. ముగ్గురూ సెమీఫైనల్లో ఓడటంతో కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. ఆసియా క్రీడల బాక్సింగ్‌ పోటీల్లో భారత్‌ తరఫున మొత్తం 11 మంది బరిలోకి దిగారు. ఇందులో ఆరుగురు పతకాలు సాధించారు. సాక్షి చౌదరి, ప్రీతి పవార్‌, జాదుమణి సింగ్‌, సచిన్‌ శివాచ్‌, సుమిత్‌ కుందు వివిధ దశల్లోనే నిష్క్రమించారు. అంకుశ్‌, పర్వీన్‌, లవ్లీనా స్వర్ణాలు గెలువ‌గా.. కపిల్‌, నరేంద్ర, ప్రియాంక కాంస్యాలు సాధించారు. భారత బాక్సింగ్‌ జట్టు 3 స్వర్ణాలు, 3 కాంస్యాలతో మొత్తం ఆరు పతకాలతో ఆసియా క్రీడల్లో ప్రస్థానాన్ని ఘ‌నంగా ముగించింది.

Advertisement
Advertisement