త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జ‌ట్టుకు షాక్‌.. ప్లేయ‌ర్ల కిట్స్ చోరీ..

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026 కోసం అమెరికాలో ఉన్న ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్ల బూట్లు, శిక్షణ సామగ్రి, మ్యాచ్ బాల్స్ సహా పలు విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. టోర్నీ ఆరంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో జట్టులో కలకలం రేగింది.

P

Sports | Published On Jun 13, 2026, 6.22 pm IST

FIFA 2026 | ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జ‌ట్టుకు షాక్‌.. ప్లేయ‌ర్ల కిట్స్ చోరీ..
Advertisement

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026 కోసం అమెరికాలో ఉన్న ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్ల బూట్లు, శిక్షణ సామగ్రి, మ్యాచ్ బాల్స్ సహా పలు విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. టోర్నీ ఆరంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో జట్టులో కలకలం రేగింది. ఇంగ్లండ్ జట్టు ఫ్లోరిడాలోని శిక్షణ శిబిరం నుంచి మిస్సోరిలోని స్వోప్ సాకర్ విలేజ్‌కు సామగ్రిని తరలిస్తుండగా ఈ చోరీ జరిగినట్లు అధికారులు తెలిపారు. క్రీడా సామగ్రిని తీసుకెళ్తున్న వ్యాన్ తాళాలు పగులగొట్టి దుండగులు లోపల ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆశ్చర్యకరంగా వ్యాన్‌లో ఒక ఫుట్‌బాల్‌ను మాత్రం వదిలివెళ్లినట్లు సమాచారం. దొంగిలించిన వస్తువుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌కు చెందిన వ్యక్తిగత మ్యాచ్ బూట్లు, స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ ఉపయోగించే బూట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు శిక్షణ పరికరాలు, మ్యాచ్‌ల కోసం సిద్ధం చేసిన పలు ఫుట్‌బాల్స్ కూడా మాయమైనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు జూన్ 18న తమ తొలి మ్యాచ్‌లో క్రొయేషియాను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో శనివారం కాన్సాస్ సిటీలో నిర్వహించనున్న తొలి శిక్షణ సెషన్‌కు ఆటగాళ్లు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న కాన్సాస్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. టోర్నీ ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న ఈ ఘటన ఇంగ్లండ్ జట్టు సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ.. మ్యాచ్ సన్నాహకాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement