త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డిని తరిమికొడతారు: కేటీఆర్

KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతోందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా జిల్లా నుంచి తరిమికొడతారని ఆయన వ్యాఖ్యానించారు.

P

Telangana | Published On Jun 14, 2026, 9.35 pm IST

KTR | మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డిని తరిమికొడతారు: కేటీఆర్
Advertisement

KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతోందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా జిల్లా నుంచి తరిమికొడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దాదాపు పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కాంట్రాక్టులు, కమిషన్ల కోసం లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్ బిడ్డనని చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం జిల్లాపై జరుగుతున్న ద్రోహమని పేర్కొన్న కేటీఆర్, గతంలో మాదిరిగానే కొడంగల్ నియోజకవర్గంలోనూ ప్రజలు రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రకటనలు, హామీలకే పరిమితమైన పాలన వల్ల జిల్లాకు ప్రయోజనం లేదని, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను పక్కనపెట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా కరువు, వలసల జిల్లాగా ఉండేదని గుర్తు చేసిన కేటీఆర్, ఆ పరిస్థితులను మార్చి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గుర్తుకు వస్తోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, గతంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ముఖ్యంగా పాలమూరు ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఎత్తిచూపాలని అన్నారు. ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను వెనుకబడిన జిల్లాగా ఉంచిన కాంగ్రెస్, ఇప్పుడు కూడా అదే ధోరణిని కొనసాగిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని నేతలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్‌కు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. జిల్లాలో బీఆర్ఎస్‌కు ఆదరణ పెరుగుతోందని, రానున్న ఎన్నికల్లో పార్టీ క్లీన్‌స్వీప్ సాధిస్తుందనే విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకునేలా కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు.

Advertisement
Advertisement