త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | కాంగ్రెస్‌తోనే సింగ‌రేణికి అన్యాయం

Kavitha | కాంగ్రెస్ అవినీతి కార‌ణంగానే సింగ‌రేణి సంస్థ భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమ‌ర్శించారు. రూ.33 వేల కోట్ల రెవెన్యూ ఇచ్చే సంస్థ కళ్లముందే పాడవుతుంటే చాలా బాధగా ఉంద‌న్నారు. కిష‌న్‌రెడ్డి ఈ గ‌డ్డ‌మీదే పుట్టివుంటే సింగ‌రేణికి ఎక్కువ బ్లాక్‌లు వ‌చ్చేలా చూడాల‌ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jun 15, 2026, 3.54 pm IST

Kavitha | కాంగ్రెస్‌తోనే సింగ‌రేణికి అన్యాయం
Advertisement
  • రూ.33 వేల కోట్ల రెవెన్యూ ఇచ్చే సంస్థ కళ్లముందే పాడవుతుంటే చాలా బాధేస్తుంది
  • ముందు సింగ‌రేణి అప్పులు మొత్తం క‌ట్టాలి
  • కిష‌న్‌రెడ్డి ఇక్క‌డే పుడితే సింగ‌రేణికి మేలు చేయాలి
  • లేబ‌ర్ కోడ్ చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌మ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్మానం చేయాలి
  • గుజరాత్ మినరల్స్ కార్పొరేషన్ మాదిరిగానే మ‌నం కూడా ఏర్పాటు చేసుకోవాలి
  • మంచిర్యాల కేంద్రంగానే రాజ‌కీయం చేస్తాం
  • ఇక్క‌డి అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండా ఎగ‌రేస్తాం
  • మీడియా స‌మావేశంలో టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌లు

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ అవినీతి కార‌ణంగానే సింగ‌రేణి సంస్థ భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమ‌ర్శించారు. రూ.33 వేల కోట్ల రెవెన్యూ ఇచ్చే సంస్థ కళ్లముందే పాడవుతుంటే చాలా బాధగా ఉంద‌న్నారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలో ఆమె సోమ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. గుజ‌రాత్‌లో గుజ‌రాత్ మిన‌ర‌ల్స్ అనే కార్పొరేష‌న్ ఉంద‌ని, మైనింగ్‌, మిన‌ర‌ల్స్ అన్ని కూడా దాని ద్వారానే న‌డుస్తాయ‌న్నారు. మనం కూడా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. కిష‌న్‌రెడ్డి ఈ గ‌డ్డ‌మీదే పుట్టివుంటే సింగ‌రేణికి ఎక్కువ బ్లాక్‌లు వ‌చ్చేలా చూడాల‌ని డిమాండ్ చేశారు.

ఎమ్మ‌ల్యే గారు.. గూండాగిరి బంజెయ్..

మంచిర్యాల ఎమ్మెల్యే గూండాగిరి బంద్ చెయ్. ఈ గడ్డ మీది నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేస్తుంది. ఈ ప్రాంత ప్రజల ప్రేమను పొంది అన్ని చోట్ల టీఆర్ఎస్ జెండా ఎగురేస్తాం. కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టపోతోంది. కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు. కిషన్ రెడ్డి గుంటనక్క మాయలో పడ్డాడు. ఆయన లేఖ రాయగానే ఈయన ఆరా తీస్తుండు. మేం సింగరేణికి వెళ్తున్నామని తెలిసే గుంటనక్క అక్కడకు వచ్చింది. సింగరేణి హక్కులను కాపాడేది హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మాత్రమే అని ఆమె స్ప‌ష్టం చేశారు.

జీఎం చేసే పనులను సీఎం, క్లర్క్ చేసే పనులను డిప్యూటీ సీఎం చేస్తున్నారు. న్యాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉండి ప్రతిపక్షాల మాదిరిగా కార్మికుల దగ్గరకు వస్తున్నారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి. కిషన్ రెడ్డి ఈ భూమి పుత్రుడైతే సింగరేణికి మేలు చేయాలి అని క‌విత సూచించారు.

కార్మికుల‌ను త‌గ్గించే కుట్ర జ‌రుగుతుంది..

మంచిర్యాల నుంచే బొగ్గుబాయి యాత్ర ప్రారంభించుకోవటం ఆనందంగా ఉంది. తెలంగాణలో మేం ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేనను ప్రారంభించాం. రైతులు, సింగరేణి కార్మికులు ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడుతున్నాం. ఇవ్వాళ సింగరేణిలో చాలా మంది కార్మికులను తగ్గించే కుట్ర చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ అంటూ కార్మికులను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా ఇంకా ఎక్కువ మైనింగ్ చేయవచ్చు. అదే విధంగా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చు. కానీ సింగరేణిలో కార్మికులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించటం లేదు. ఆఫీసర్లకు ఒక న్యాయం, కార్మికుడికి ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంచెం లేట్ అయిన సరే అటెండెన్స్ వేయమంటూ వేధిస్తున్నారు అని టీఆర్ఎస్ చీఫ్ ఆరోపించారు.

డిప్యూటీ సీఎం క‌నుస‌న్న‌ల్లోనే..

సింగరేణిలో ప్రతి శనివారం ఉద్యోగాల జాతర జరగాలి. కానీ ఇక్కడ ఎంత మంది సస్పెండ్ చేద్దామా అని లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు అన్ని ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. డిప్యూటూ సీఎం భట్టి గారు అంతా తన కనుసన్నల్లోనే జరగాలనే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల హక్కులను హరిస్తూ వారిపై శాడిజం చూపిస్తున్నారు అని విమ‌ర్శించారు.

ఎండీవో పద్ధతిని ర‌ద్దు చేయాలి..

సింగరేణి కార్మికులకు సరైన వసతులు కల్పిస్తే బంగారం పండిస్తారు. మేం ప్రతి గనిలో పరిస్థితిని గమినించాం. కార్మికులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించటం సరికాదు. మేం కచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చాక గుజరాత్‌లో మాదిరిగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. సింగరేణిలో మైన్ డెవలప్‌మెంట్ విధానం తెస్తే అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే ఎండీవో సిస్టమ్‌ను పూర్తిగా రద్దు చేయాలి అని క‌విత డిమాండ్ చేశారు.

స‌త్తుప‌ల్లి కోల్ మైన్స్ పోతే సింగ‌రేణికి న‌ష్ట‌మే..

సింగరేణి విషయంలో నిజాం రాజు చాలా గొప్ప పని చేశారు. తెలంగాణలో గోదావరి పరీవాహ‌కంలో ఉన్న బొగ్గు అంతా కూడా సింగరేణికే రాసిచ్చారు. కానీ కాంగ్రెస్ చేసిన స్కాం కారణంగా మనకు నష్టం వచ్చింది. ఆ బొగ్గు కుంభకోణాన్ని సాకుగా చూపి బీజేపీ అధికారంలోకి వచ్చాక 250 బ్లాక్స్ ను జాతీయం చేసింది. మన సత్తుపల్లిలో కోల్ మైన్స్ పోతే సింగరేణి కూడా నష్టపోవాల్సి ఉంటుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే మన తెలంగాణకు ఎక్కువ బ్లాక్ లు వచ్చేలా ప్రయత్నం చేయాలి.

బీజేపీ గెల‌వ‌డం క‌లే..

మన కార్మికులకు ఐటీ తీసేయాలని మేం డిమాండ్ చేస్తే.. అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నాడు. అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కల్ల. కానీ బీజేపీ విధానం ఏ విధంగా ఉందో కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తెలంగాణలో అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కిషన్ రెడ్డి కూడా గుంటనక్క మాయలో పడ్డారు. గుంటనక్క లేఖ రాయగానే ఆయన కూడా లేఖ రాశారు.

జీఎం చేయాల్సిన ప‌నులు సీఎం చేస్తుండు..

పెన్షన్ రివిజన్ చేయాలి. మన కార్మికులు కష్టాల్లో ఉంటే ఏఐటీయూసీ దొంగ సమ్మెకు దిగింది. కార్మికుల ఐక్యతను, సమ్మె స్ఫూర్తిని దెబ్బ తీసేలా సమ్మె చేయాలని నిర్ణయించటం కార్మికులకు అన్యాయం చేయటమే. ముఖ్యంగా మనం డిపెండెంట్ ఉద్యోగాలను సాధించుకోవాల్సిన అవసరముంది. దాని కోసం మనం, బీఆర్ఎస్ విపక్షాలుగా వచ్చాం. కానీ ప్రభుత్వం కూడా వచ్చి దొంగ నాటకాలు ఆడుతోంది. గతంలో సింగరేణిలో వచ్చే పోస్టులను జీఎం ఇచ్చే వారు కానీ ఇప్పుడు వాటిని సీఎం ఇస్తున్నాడు. జీఎం చేయాల్సిన పనులను సీఎం చేస్తుంటే.. క్లర్క్ చేయాల్సిన పనులను డిప్యూటీ సీఎం చేస్తున్నాడు అని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ మండిప‌డ్డారు.

250 గ‌జాల స్థ‌లం ఇవ్వాలి..

ఈ ప్రభుత్వం ముందు సింగరేణికి బకాయి ఉన్న మొత్తం అప్పు కట్టాలి. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి. కానీ ప్రతిపక్షాల మాదిరిగా మీరే కార్మికుల వద్దకు తిరుగుతామంటే కుదరదు. అదే విధంగా కార్మికులకు గతంలో హెయ్యెస్ట్ వాటా ఎప్పుడు ఇచ్చారో దాని మీద రూ.10 వేలు ఎక్కువగా ఇవ్వాలి. సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన విద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. అలియాస్ నేమ్స్ విషయంలో కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వారికి మంచి చేయాలి. అదే విధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వం వారికి 250 గజాల స్థలం ఇవ్వాలి అని కల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు.

సింగ‌రేణిలో చ‌దువు ప్రామాణికం కాదు..

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇళ్లు కట్టుకునేందుకు 250 గజాల స్థలం ఇస్తాం. సింగరేణిలో విజిలెన్స్ అనేది జోక్ గా మారింది. పదో తరగతి పాసయ్యారో లేదో విజిలెన్స్ చూస్తుందంట. అసలు సింగరేణి కార్మికులు పదో తరగతి పాస్ కావాలన్న నిబంధన ఎక్కడ ఉంది. సింగరేణిలో చదువు ప్రామాణికం కాదు. మ్యాన్ పవర్ తగ్గించేందుకు ఈ కుట్ర చేస్తున్నారు. డిస్మిసల్ కార్మికులు డిపెంట్ వాళ్లు పెండింగ్ లో ఉన్నారు. ఇవ్వాల్సిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి అని క‌విత కోరారు.

రూ.20 కోట్ల వ‌ర‌కు రుణాలు ఇస్తాం..

సూపర్ వైజర్లను ఈ2 లోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్లు ఈ5 వరకు వెళ్తారు. అదే విధంగా జనరల్ అసిస్టెంట్ సిస్టమ్‌ను తేవాలి. క్లర్క్ పోస్టులకు 9 నెలల క్రితం నోటిఫికేషన్ వేసి ఇప్పటి కూడా ఎగ్జామ్ పెట్టలేదు. సింగరేణిలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. వెంటనే ఎగ్జామ్‌ను నిర్వహించాలి. మెషీన్స్ రిపేర్ చేసేందుకు యువతకు అవకాశం ఇవ్వాలి. వారికి లోన్లు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. మేం అధికారంలోకి వచ్చాక యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి సింగరేణిలో మెషీన్లు రిపేర్ చేసే పరిశ్రమ పెట్టుకునేలా చేస్తాం.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కారణంగానే సింగరేణి సంస్థకు నష్టం జరుగుతోంది. గతంలో నైనీ బ్లాక్‌ను ఏదో చేద్దామని చూస్తే మనందరం పోరాటం చేస్తే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్‌లో నష్టాల్లో ఉన్న సంస్థతో కలిసి సోలార్ ప్లాంట్ పెడుతున్నారు. అదే సోలార్ ప్లాంట్‌ను మన దగ్గర పెట్టవచ్చు కదా? రాజస్థాన్‌లో పెట్టాలని భావిస్తున్న సోలార్ ప్లాంట్‌ను వెంటనే విరమించుకోవాలి అని టీఆర్ఎస్ అధినేత్రి డిమాండ్ చేశారు.

లిథియం ఆయాన్ బ్యాట‌రీ సంస్థ ఒప్పందాన్ని ర‌ద్దు చేయాలి..

ఇప్పటికే మేం డీజిల్ కుంభకోణం గురించి చెప్పాం. పేపర్లు కూడా రాసి రాసి అలసిపోయాం. కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు. 10 లక్షల విలువ లేని సంస్థతో లిథియం ఆయాన్ బ్యాటరీ సంస్థ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేం వ్యతిరేకించటంతో అది ఆగింది. కానీ క్యాన్సల్ కాలేదు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. సింగరేణి సొమ్మును సీఎం సరాదాల‌ కోసం ఫుట్ బాల్ మ్యాచ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఆ నిధులను కనీసం కొడంగల్ కూడా కాకుండా తన సరదాలకు ఖర్చు చేస్తున్నాడు అని ఆమె ఆరోపించారు.

వాళ్లు సొక్క‌మైన‌వాళ్లు కాదు..

మంచిర్యాల‌లో ఓసీపీలో కాంట్రాక్ట్ కార్మికులకు 20 వేలు మాత్రమే వస్తున్నాయి. గోదావరిఖని, రామగుండంలో మాత్రం రూ. 25 వేలు ఇస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యేలు కొట్లాడి 25 వేలు ఇప్పిస్తున్నారు. అలా అని వాళ్లు సొక్కమైన వాళ్లు కాదు. వాళ్ల చేసే భారీ అవినీతి గురించి కూడా త్వరలోనే బయటపెడతా. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని ఇక్కడి ఎంపీని డిమాండ్ చేస్తున్నా. తాళ్లపల్లిలో సింగరేణి కోసం భూములు ఇచ్చిన ప్రజలకు పరిహారం ఇవ్వలేదు. సింగరేణికి భూమి ఇచ్చిన కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. కానీ వాళ్లకు ఏమీ ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాల్లో మన కన్నా కూడా కార్మికులకు ఎక్కువ జీతాలు ఉన్నాయి అని క‌విత తెలిపారు.

అయ్య‌ప్ప‌ల కోసం రైలు ఆగాలి..

అయ్యప్పల కోసం మన దగ్గర రైలు ఆగే పరిస్థితి లేదు. రైలు ఇక్కడ ఆగే విధంగా ఎంపీ ప్రయత్నం చేయాలి. సింగరేణి ప్రాంతంలో ప్రజలు మొత్తం కాంగ్రెస్‌నే గెలిపించారు. కానీ వాళ్లకు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ మేలు చేయలేదు. గోదావరి లో కరకట్ట కట్టలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గూండాగిరి చేస్తానంటే ఊరుకునేది లేదు. మీ గూండాగిరి బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నోళ్లం మీ గూండాగిరికి బయపడతామా? ఎమ్మెల్యే గారు గూండాగిరి బంద్ చెయ్. మీ గుండాగిరి నడవదు. మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతోంది. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొంది ఇక్కడి అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం అని టీఆర్ఎస్ చీఫ్ క‌విత స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement