త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | సంజు శాంస‌న్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారా..? ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయి..?

Sanju Samson | భారత జట్టును టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌కు చేర్చిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంస‌న్ ఇప్పుడు మరో కారణంతో చర్చకు కేంద్రబిందువయ్యాడు. వెస్టిండీస్‌పై కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు విజయం అందించిన తర్వాత అత‌ను చేసిన చ‌ర్య‌ల‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సమీక్ష జరుపుతున్నట్టు తెలుస్తోంది.

S

Sports | Published On Mar 4, 2026, 2.45 pm IST

Sanju Samson | సంజు శాంస‌న్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారా..? ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయి..?
Advertisement

Sanju Samson | భారత జట్టును టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌కు చేర్చిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంస‌న్ ఇప్పుడు మరో కారణంతో చర్చకు కేంద్రబిందువయ్యాడు. వెస్టిండీస్‌పై కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు విజయం అందించిన తర్వాత అత‌ను చేసిన చ‌ర్య‌ల‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సమీక్ష జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో జరగబోయే సెమీఫైనల్‌కు ముందు అత‌నిపై నిషేధం విధిస్తారా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. 196 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విజయం కోసం బౌండరీ కొట్టిన తర్వాత శాంసన్ భావోద్వేగానికి లోనయ్యాడు. అత‌ను త‌న‌ హెల్మెట్ తీసి నేలపైకి విసిరి, తరువాత మోకాళ్లపై కూర్చొని దేవుడికి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రార్థించాడు. ఈ క్ర‌మంలో సంజు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నాకు దేవుడిపై న‌మ్మ‌కం ఉంది: స‌ంజు శాంస‌న్

కాగా నెటిజన్లు ఆ సెల‌బ్రేష‌న్‌ను ట్రూ కేరళ స్టోరీగా పేర్కొన్నారు. కొందరు అభిమానుల అభిప్రాయం ప్రకారం, శాంసన్ మొదట చేతులు విప్పి ఇస్లామిక్ శైలిలో ప్రార్థన చేసినట్టు, తరువాత క్రైస్తవ సంప్రదాయంలో క్రాస్ గుర్తు చేసినట్టు, చివరగా హిందూ పద్ధతిలో నమస్కారం చేసినట్టు కనిపించిందని పేర్కొన్నారు. అయితే త‌న సెల‌బ్రేష‌న్‌పై జియో హాట్ స్టార్‌లో మాజీ క్రికెటర్ పార్థివ్ ప‌టేల్‌తో సంజు మాట్లాడుతూ.. నేను దేవుడిపై చాలా నమ్మకం ఉన్న వ్యక్తిని. అయితే నా విశ్వాసాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలనుకుంటాను. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం.. అని అన్నాడు.

రూల్స్ ఏమంటున్నాయి..?

ఐసీసీ దృష్టిలో ప్రధానంగా పరిశీలిస్తున్న అంశం మత భావ వ్యక్తీకరణ కాదు, హెల్మెట్‌ను నేలపైకి విసిరిన చర్య. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ సామగ్రిని దుర్వినియోగం చేయడం నిషేధం. హెల్మెట్, బ్యాట్ లేదా స్టంప్స్ వంటి వస్తువులను కోపంతోనైనా, ఉత్సాహంతోనైనా విసరడం ఈ నియమానికి వ్యతిరేకం. సెలబ్రేషన్ సమయంలో జరిగే ఇలాంటి ఘటనల‌ను సాధారణంగా లెవల్ 1 నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, 1-2 డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంది. ఈ స్థాయిలో మ్యాచ్ నిషేధం చాలా అరుదుగా ఉంటుంది. ఇక మ్యాచ్ రిఫరీ ఈ ఘటనను లెవల్ 2గా అప్‌గ్రేడ్ చేస్తే లేదా 24 నెలల్లో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే మాత్రమే మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గతంలో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. ఆమె సామగ్రిని దుర్వినియోగం చేయడమే కాకుండా అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించింది. అందుక‌ని అప్ప‌ట్లో ఆ నిర్ణ‌యం తీసుకున్నారు.

లెవ‌ల్ 3 లేదా 4 అయితేనే..

ఈ టోర్నమెంట్‌లోనే ఫిబ్రవరి 18న స్కాట్లాండ్ ఆటగాడు జార్జ్ మున్సే ఔట్ అయిన తర్వాత హెల్మెట్ విసిరినందుకు 1 డీమెరిట్ పాయింట్ పొందాడు. ఐసీసీ సాధారణంగా మైదానంలో సానుకూల భావ వ్యక్తీకరణను అనుమతిస్తుంది. అయితే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కు విరుద్ధంగా, ఏ మతాన్ని అవమానించేలా లేదా ప్రేరేపించేలా చేసే సంకేతాలు ఉంటే అవి యాంటీ-రేసిజం కోడ్ కింద లెవల్ 3 లేదా లెవల్ 4 నేరాలుగా పరిగణించబడతాయి. అలాంటి సందర్భాల్లో కఠినమైన నిషేధాలు విధించే అవకాశం ఉంటుంది. అయితే శాంసన్ చేసిన చర్య కృతజ్ఞతా భావంతో కూడినదిగా ఉండటంతో అది ఎలాంటి మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదని భావిస్తున్నారు. అందువల్ల ఆ కోణంలో చర్య తీసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

ఐసీసీ నుంచి రాని ప్ర‌క‌ట‌న..

భారత్ మార్చి 5న ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్ ఆడనుంది. శాంసన్ ఇప్పటికే జట్టుతో కలిసి ముంబై చేరుకున్నాడు. అయితే ఇప్పటివరకు మ్యాచ్ రిఫరీ నుంచి అధికారికంగా ఎలాంటి చర్యను ప్రకటించలేదు. భారత జట్టు వర్గాలు మాత్రం శిక్ష ఉంటే అది జరిమానా లేదా డీమెరిట్ పాయింట్లకే పరిమితమవుతుందని చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం శాంసన్ మంచి ఫామ్‌లో ఉండటంతోపాటు సూర్య‌కుమార్ యాద‌వ్ తో కలిసి మిడిలార్డ‌ర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందువల్ల అత‌ను ఒక‌వేళ మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటే భారత్ ట్రోఫీ లక్ష్యానికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఐసీసీ నుంచి అధికారికంగా ఆ విష‌యంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Advertisement
Advertisement