త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ఐపీఎల్‌.. అయినా షెడ్యూల్ ప్ర‌క‌టించ‌ని బీసీసీఐ.. కారణాలు ఇవే..?

IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వారం వరకు కొనసాగుతుందనే విష‌యం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంకా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.

S

Sports | Published On Feb 14, 2026, 10.32 am IST

IPL 2026 | ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ఐపీఎల్‌.. అయినా షెడ్యూల్ ప్ర‌క‌టించ‌ని బీసీసీఐ.. కారణాలు ఇవే..?
Advertisement

IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వారం వరకు కొనసాగుతుందనే విష‌యం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంకా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా మ్యాచ్‌లు ప్రారంభమయ్యేలోపు ఫిక్చర్లు, వేదికలు, తేదీలు ఖరారు అవుతాయి. కానీ సీజన్ ప్రారంభానికి ఇంకా దాదాపుగా రెండు నెలల సమయం మాత్రమే ఉన్న‌ప్ప‌టికీ ఆయా విష‌యాల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రస్తుతం భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2026 నేప‌థ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యం కావడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఆలస్యానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది.

రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు..

నివేదికల ప్రకారం అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలే ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఐపీఎల్‌కు సంబంధించిన కీలక జట్లు, ముఖ్యమైన మ్యాచ్‌లు ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల హోం మ్యాచ్‌లు పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలతో క్లాష్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. చెన్నై, కోల్‌కతా నగరాలు ప్రతి సీజన్‌లోనూ అనేక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. ఎన్నికల సమయంలో భద్రతా బలగాలు పూర్తిగా పోలింగ్ విధుల్లో నిమగ్నమవుతాయి. అదే సమయంలో భారీగా ప్రేక్షకులు హాజరయ్యే క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారుతుంది. అందుకే ఎన్నికల తేదీలు ఖరారయ్యే వరకు బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని తెలుస్తోంది.

స్టేడియంల సంసిద్ధ‌త‌..

సరైన అవగాహన లేకుండా ఫిక్చర్లు విడుదల చేస్తే, తర్వాత అనూహ్య మార్పులు చేయాల్సి వస్తాయి. అలా జరిగితే జట్లు, అభిమానులు, ప్రసార సంస్థలు, ప్రయాణ ఏర్పాట్లు చేసే అన్ని వర్గాలపై ప్రభావం పడుతుంది. ఎన్నికల కారణంగా కొన్ని ప్రధాన స్టేడియాల లభ్యత కూడా సందిగ్ధంగా మారింది. ఈడెన్ గార్డెన్స్‌లో భద్రతా అవసరాలపై ఎన్నికల విధులు ప్రాధాన్యం పొందితే, అక్కడ మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారవచ్చు. గత సీజన్లలో కూడా ఇలాంటి పరిస్థితుల కారణంగా కొన్ని మ్యాచ్‌ల వేదికలు మార్చాల్సి వచ్చింది. ఈసారి ఒకేసారి అనేక రాష్ట్రాల్లో పోలింగ్ జరగడం వల్ల ప్రత్యామ్నాయ వేదికల ఎంపిక కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు విడతలుగా షెడ్యూల్ ప్రకటించే ఆలోచనలో ఉందని సమాచారం. మొదటి విడతలో ఖరారైన మ్యాచ్‌ల వివరాలు వెల్లడించి, ఎన్నికల తేదీలు స్పష్టమైన తర్వాత మిగతా ఫిక్చర్లు ప్రకటించే అవకాశం ఉంది. గతంలోనూ ఈ విధానాన్ని ప‌లుమార్లు అనుసరించారు.

ఆల‌స్యంగానే షెడ్యూల్‌..

ఎన్నికలతో పాటు మరికొన్ని ఆఫ్-ఫీల్డ్ సమస్యలు కూడా ఆలస్యానికి కారణమవుతున్నాయి. కొన్ని స్టేడియాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఐపీఎల్‌కు అవసరమైన ఏర్పాట్లకు సమయం కావాల్సి ఉంది. కొన్ని జట్ల హోం గ్రౌండ్ పరిస్థితులు కూడా స్పష్టంగా లేవు. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించిన పరిపాలనా సమస్యలు కొనసాగుతున్నాయి. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆడడంపై స్ప‌ష్ట‌త వ‌చ్చినా స్టేడియంలో ప్రేక్ష‌కుల భ‌ద్ర‌త కోసం అందులో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకు కూడా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అలాగే టికెట్ విక్రయాలు, ప్రసార హక్కుల ఏర్పాట్లు, జట్ల ప్రయాణ ప్రణాళికలు, ప్రాక్టీస్ షెడ్యూల్స్.. ఇలా ఇవ‌న్నీ సమయం తీసుకునే అంశాలే. ఈ అన్ని అంశాలను పరిగణన‌లోకి తీసుకుని బీసీసీఐ షెడ్యూల్ ప్రకటనలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుక‌నే ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ ఆల‌స్యం కానుంది. ఇందుకు గాను అభిమానులు ఇకపై మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement