త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wi vs Ita | ఇట‌లీని చిత్తు చేసిన విండీస్ – గ్రూప్‌సీలో టాప‌ర్‌ – ఇండియాతో మ్యాచ్ ఎప్పుడంటే?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో ఇట‌లీని 42 ప‌రుగుల తేడాతో వెస్టిండీస్ చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో షై హోప్ (75 ప‌రుగులు), బౌలింగ్‌లో ష‌మ‌ర్‌జోసెఫ్ (నాలుగు వికెట్లు) రాణించి విండీస్‌కు విజ‌యాన్ని అందించారు.

N

Sports | Published On Feb 19, 2026, 6.17 pm IST

Wi vs Ita | ఇట‌లీని చిత్తు చేసిన విండీస్ – గ్రూప్‌సీలో టాప‌ర్‌ – ఇండియాతో మ్యాచ్ ఎప్పుడంటే?
Advertisement

Wi vs Ita | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గ్రూప్‌సీలో వెస్టిండీస్ టాప‌ర్‌గా నిలిచింది. గ్రూప్ స్టేజ్‌లో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఇట‌లీని చిత్తు చేసింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా గురువారం జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 42 ప‌రుగుల తేడాతో ఇట‌లీపై వెస్టిండీస్ విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌లో షై హోప్‌, బౌలింగ్‌లో ష‌మ‌ర్ జోసెఫ్ రాణించి వెస్టిండీస్‌కు విజ‌యాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 165 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య‌చేధ‌న‌లో త‌డ‌బ‌డిన ఇట‌లీ 18 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

హై హోప్ ఒంట‌రిపోరాటం...

గ‌త మ్యాచుల్లో అద‌ర‌గొట్టిన విండీస్ బ్యాట‌ర్లు ఇట‌లీపై త‌డ‌బ‌డ్డారు. హై హోప్ మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ధాటిగా ఆడ‌లేక‌పోయారు. రెండో ఓవ‌ర్‌లోనే బ్రండ‌న్ కింగ్‌ను ఔట్ చేసి ఇట‌లీ బౌల‌ర్ అలీ హ‌స‌న్ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. హెట్‌మేయ‌ర్ కూడా సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్ చేయ‌డంతో 31 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి విండీస్ క‌ష్టాల్లో ప‌డింది. రోస్ట‌న్ ఛేజ్‌తో క‌లిసి వెస్టిండీస్‌ను షై హోప్ గ‌ట్టెక్కించాడు. ఇట‌లీ బౌల‌ర్ల‌పై ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు హోప్‌. 46 బాల్స్‌లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 75 ర‌న్స్ చేశాడు. మ‌రోవైపు రోస్ట‌న్ ఛేజ్ మాత్రం నెమ్మ‌దిగా ఆడ‌టంతో 13 ఓవ‌ర్ల‌కు వెస్టిండీస్ స్కోరు వంద ప‌రుగులు దాటింది. ధాటిగా ఆడే క్ర‌మంలో షై హోప్ ఔట‌య్యాడు. చివ‌ర‌లో రూథ‌ర్‌ఫోర్డ్ ప‌దిహేను బాల్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 25 ర‌న్స్, మాథ్యూ ఫోర్డ్ ఎనిమిది బాల్స్‌లో మూడు ఫోర్ల‌తో 16 ప‌రుగుల చేయ‌డంతో వెస్టిండీస్ 165 ప‌రుగుల చేసింది. ఇట‌లీ బౌల‌ర్ల‌లో కులుగ‌మాగే, మ‌నేంటి త‌లో రెండో వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నారు.

బౌల‌ర్ల విజృంభణ...

వెస్టిండీస్ బౌల‌ర్ల విజృంభణతో ఇట‌లీ ప‌ద్దెనిమిది ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. బెన్ మ‌నేంటి 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. స్మ‌ట్స్ 24, మోస్కా 19 ప‌రుగులు చేశారు. వీరు ముగ్గురు మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విండీస్ బౌల‌ర్ల ధాటికి విల‌విల‌లాడారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో ష‌మ‌ర్ జోసెఫ్ 4, మాథ్యూ ఫోర్డ్ 3, గుడ‌కేష్ మోథీ 2 రెండు వికెట్లు తీశారు.

గ్రూప్‌సీలో టాప‌ర్‌...

గ్రూప్ సీలో టాప‌ర్‌గా సూప‌ర్ 8లోకి వెస్టిండీస్ అడుగుపెట్టింది. సూప‌ర్ 8లో జింబాబ్వే, సౌతాఫ్రికా, ఇండియాల‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ మార్చి 1న జ‌రుగ‌నుంది.

 

Advertisement
Advertisement