త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | మ‌ళ్లీ పుంజుకుంటాం, బ‌లంగా తిరిగి వ‌స్తాం: సూర్య‌కుమార్ యాద‌వ్‌

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ప‌రాభ‌వం ఎదురైన అనంత‌రం టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఓట‌మిపై స్పందించాడు. తాము మళ్లీ పుంజుకుని రాణిస్తామ‌ని, త‌మ లోపాల‌ను స‌రిదిద్దుకుంటామ‌ని చెప్పాడు.

S

Sports | Published On Feb 23, 2026, 7.57 am IST

T20 World Cup 2026 | మ‌ళ్లీ పుంజుకుంటాం, బ‌లంగా తిరిగి వ‌స్తాం: సూర్య‌కుమార్ యాద‌వ్‌
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ప‌రాభ‌వం ఎదురైన అనంత‌రం టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఓట‌మిపై స్పందించాడు. తాము మళ్లీ పుంజుకుని రాణిస్తామ‌ని, త‌మ లోపాల‌ను స‌రిదిద్దుకుంటామ‌ని చెప్పాడు. మ్యాచ్ అనంత‌రం అత‌ను మాట్లాడుతూ మ్యాచ్ ప్రారంభం నుంచి ఆట‌లోనే ఉన్నామ‌ని అనిపించింద‌ని, ఆరంభంలో చాలా బాగా బౌలింగ్ చేశామ‌ని తెలిపాడు. 21 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌ను ప‌డ‌గొట్టామ‌ని, కానీ ఆ త‌రువాత 7 నుంచి 15 ఓవ‌ర్ల మ‌ధ్య సౌతాఫ్రికా బ్యాట‌ర్లు బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా చాలా బాగుంద‌ని అన్నాడు. అయిన‌ప్ప‌టికీ చివ‌రి ఓవ‌ర్ల‌లో తాము మళ్లీ ఆట‌లోకి వ‌చ్చామ‌ని, మొత్తం మీద చూస్తే త‌మ బౌలింగ్ బాగానే ఉంద‌ని, కానీ బ్యాటింగ్‌లో మాత్రం విఫ‌లం అయ్యామ‌ని అంగీక‌రించాడు.

బ‌లంగా తిరిగి వ‌స్తాం: సూర్య‌కుమార్ యాద‌వ్

ఒక జ‌ట్టు 180-185 ప‌రుగుల‌ను చేజ్ చేస్తున్న‌ప్పుడు ప‌వ‌ర్ ప్లేలోనే మ్యాచ్‌ను గెల‌వ‌లేదు, కానీ ప‌వ‌ర్‌ప్లేలోనే ఓడిపోయే చాన్స్‌లు ఉంటాయి. ప‌వ‌ర్ ప్లేలో మేం చాలా వికెట్ల‌ను కోల్పోయాం. భారీ ల‌క్ష్యాన్ని చేజ్ చేయ‌డంలో మేం చిన్న చిన్న పార్ట్‌న‌ర్‌షిప్‌ల‌ను నిర్మించ‌లేక‌పోయాం. ఇది ఆట‌లో భాగం. దీని నుంచి మేం నేర్చుకుంటాం. అంద‌రం క‌ల‌సి కూర్చుని విశ్లేషించుకుంటాం. మ‌రింత బ‌లంగా తిరిగి వ‌స్తాం.. అని సూర్య‌కుమార్ యాద‌వ్ స్పష్టం చేశాడు. బుమ్రా-అర్ష్‌దీప్ కాంబినేష‌న్ ప్రమాద‌క‌రం అని అంద‌రికీ తెలుసు. వీరిద్ద‌రూ చాలా కాలంగా క‌ల‌సి బౌలింగ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వీరు 8 ఓవ‌ర్లు బౌలింగ్ వేసి దాదాపు 5 వికెట్లు తీసి 45-50 ప‌రుగులు ఇచ్చారు. భాగ‌స్వామ్యంలో ఇద్ద‌రి బౌలింగ్ చాలా బాగుంది. జ‌ట్టు కూడా అదే ఆశిస్తోంది. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు చాలా అనుభ‌వం ఉన్న‌వారు. జ‌ట్టులో వీరు ఉండ‌డం మంచి విష‌యం.. అని సూర్య అన్నాడు. జింబాబ్వేతో జరిగే తదుపరి మ్యాచ్‌లో మంచి బ్యాటింగ్, మంచి బౌలింగ్, మంచి ఫీల్డింగ్ చేయాలని ఆశిస్తున్నాం. మేం అన్నింటినీ సింపుల్‌గా ఉంచుతాం. మేం ఆడాలనుకుంటున్న అదే బ్రాండ్ క్రికెట్‌ను ఆడతాం. ఏమీ మారదు. క‌చ్చితంగా బలంగా తిరిగి వస్తాం.. అని సూర్య కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశాడు.

కాగా ఆదివారం రాత్రి జ‌రిగిన భార‌త్‌-సౌతాఫ్రికా సూప‌ర్ 8 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రోటీస్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ మిల్ల‌ర్ 35 బంతుల్లో 63 ప‌రుగులు, దేవాల్డ్ డ్రెవిస్ 29 బంతుల్లో 45 ప‌రుగులు చేసి చ‌క్క‌ని పార్ట్‌న‌ర్ షిప్ నెల‌కొల్పారు. వీరు 4వ వికెట్‌కు 51 బంతుల్లోనే 97 ప‌రుగుల‌ను జోడించారు. జ‌ట్టు విజ‌యంలో వీరి భాగ‌స్వామ్యం కీల‌కం అయింది. బౌలింగ్‌లోనూ స‌ఫారిలు అద‌ర‌గొట్టారు. మార్కో యాన్సెన్ (4/22), కేశ‌వ్ మ‌హ‌రాజ్ (3/24), కార్బిన్ బోష్ (2/12) అద్భుతంగా రాణించారు. మ‌రో బౌల‌ర్ లుంగి ఎంగిడి 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

భార‌త ప్లేయ‌ర్లు త‌మ ఇన్నింగ్స్ లో ప్రారంభం నుంచే త‌డ‌బ‌డ్డారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క‌ర‌మ్ బౌలింగ్‌లో ఇషాన్ కిష‌న్ డ‌కౌట్ అవ‌గా, ఆ త‌రువాత ప‌వ‌ర్ ప్లేలోనే భారత్ అభిషేక్ శ‌ర్మ (15), తిల‌క్ వ‌ర్మ (1) వికెట్ల‌ను కోల్పోయింది. శివం దూబె 42 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 18 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మొత్తంగా భారత్ 18.5 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

Advertisement
Advertisement