త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాకిస్థాన్‌కు క‌ష్ట‌మైన టాస్క్‌.. సెమీస్‌కు చేరాలంటే వీరోచిత పోరాటం చేయాల్సిందే..

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌కు సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ అవకాశానికి ఇంగ్లండ్‌కు ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

S

Sports | Published On Feb 28, 2026, 7.23 am IST

T20 World Cup 2026 | పాకిస్థాన్‌కు క‌ష్ట‌మైన టాస్క్‌.. సెమీస్‌కు చేరాలంటే వీరోచిత పోరాటం చేయాల్సిందే..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌కు సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ అవకాశానికి ఇంగ్లండ్‌కు ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరేందుకు మ‌రో అవ‌కాశం ల‌భించిన‌ట్లు అయింది. ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్ సూప‌ర్ 8 గ్రూప్ 2లో 3 విజ‌యాల‌తో అగ్ర స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్థాన్ పోటీ ప‌డుతున్నాయి. అయితే ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ గెలిచి ఉంటే నేరుగా సెమీఫైన‌ల్‌కు చేరి ఉండేది. పాకిస్థాన్ ఎలిమినేట్ అయ్యేది. కానీ మ్యాచ్‌లో ఓడిన కార‌ణంగా న్యూజిలాండ్ ఇప్పుడు పాకిస్థాన్ మ్యాచ్ వ‌ర‌కు ఆగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

పాక్‌కు చాన్స్ వ‌చ్చినా.. గట్టిగా పోరాటం చేయాల్సిందే..

సూప‌ర్ 8 గ్రూప్ 2లో శ్రీ‌లంక ఇప్ప‌టికే 2 ఓట‌ముల‌తో టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌గా, క‌నీసం ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి సొంత గ‌డ్డ‌పై ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని చూస్తోంది. మ‌రోవైపు పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం ఒక్క‌టే స‌రిపోదు, నెట్ ర‌న్ రేట్‌ను కూడా మెరుగు ప‌రుచుకునేట్లు విజ‌యం సాధించాలి. అందువ‌ల్ల ఈ మ్యాచ్ పాక్‌కు క‌ఠిన స‌వాల్ విస‌ర‌నుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్ 3 పాయింట్ల‌తో +1.390 నెట్ ర‌న్‌రేట్‌తో ఉంది. పాకిస్థాన్ 1 పాయింట్‌తో -0.461 నెట్ ర‌న్ రేట్‌తో ఉంది. అయితే శ్రీ‌లంక‌తో జ‌రిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే అప్పుడు న్యూజిలాండ్‌, పాక్ జ‌ట్ల‌కు పాయింట్లు సమం (3) అవుతాయి. దీంతో నెట్ ర‌న్ రేట్ కీల‌క పాత్ర పోషిస్తుంది. అప్పుడు న్యూజిలాండ్‌కు అధికంగా ర‌న్ రేట్ ఉంటే పాక్ ఎలిమినేట్ అవుతుంది. క‌నుక కివీస్ ర‌న్ రేట్‌ను పాక్ అధిగ‌మించాల్సి ఉంటుంది. అందుకు గాను శ్రీ‌లంక‌తో జ‌రిగే మ్యాచ్ లో పాకిస్థాన్ ముందు బ్యాటింగ్ చేస్తే ఆ జ‌ట్టుపై క‌నీసం 64 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించాలి. అదే ల‌క్ష్యాన్ని ఛేదించాల్సి వ‌స్తే 13.1 ఓవ‌ర్ల‌లో టార్గెట్ పూర్తి చేయాలి. వాస్త‌వానికి ఇది చాలా క‌ష్ట‌మైన ప‌నే అని చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ సెమీస్ బెర్త్ ఖాయం అవ్వాలంటే పాక్ క‌చ్చితంగా వీరోచిత లెవ‌ల్‌లో పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

రెండో స్థానాల‌కు పోటీ..

సూప‌ర్ 8 గ్రూప్‌లో అంత‌కు ముందు పాకిస్థాన్‌-న్యూజిలాండ్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు ఒక్కో పాయింట్‌ను ఇచ్చారు. అనంత‌రం శ్రీలంక‌పై విజ‌యం సాధించిన న్యూజిలాండ్ మరో రెండు పాయింట్ల‌ను పొందింది. దీంతో ఆ జట్టు మెరుగైన ర‌న్ రేట్‌తో 3 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచింది. కానీ పాకిస్థాన్ ఇంగ్లండ్ చేతిలో ఓట‌మి పాలైంది. దీంతో వారికి మ‌రో మ్యాచ్‌లు విజ‌యం త‌ప్ప‌నిసరి అయింది. అలాగే పాజిటివ్ ఉన్న కివీస్ నెట్‌ ర‌న్ రేట్‌ను దాటాలంటే శ్రీ‌లంక‌పై పాకిస్థాన్ అద్భుత‌మైన పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే శ‌నివారం ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ప‌ల్లెకెలెలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌పైనే పాకిస్థాన్ ఆశ‌లు పెట్టుకుంది. ఇక సూప‌ర్ 8 గ్రూప్ 1లో ప‌రిస్థితి చాలా క్లియ‌ర్‌గా ఉంది. వెస్టిండీస్‌, భార‌త్‌లు ఆదివారం కీల‌క‌మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుండ‌గా అందులో విజ‌యం సాధించిన వారే సెమీస్‌కు వెళ్తారు. అక్క‌డ నెట్ ర‌న్ రేట్‌తో ప‌నిలేదు. కానీ వ‌ర్షం ప‌డితే మాత్రం భార‌త్‌కు ఇబ్బందే. అయితే ప్ర‌స్తుతానికి కోల్‌క‌తాలో వాతావ‌ర‌ణం మాత్రం పొడిగానే ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచిస్తోంది. ఈ క్ర‌మంలో రెండు సూప‌ర్ 8 గ్రూపుల నుంచి రెండో స్థానంలో ఏయే జ‌ట్లు నిలుస్తాయి, సెమీ ఫైన‌ల్‌లో ఏయే టీమ్స్ బెర్తుల‌ను ఖ‌రారు చేసుకుంటాయి.. అన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement