త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కివీస్‌పై విండీస్ ప్లేయ‌ర్ల అద్భుతం.. భారీ టార్గెట్ ఉన్నా అద్భుతంగా ఆడి టెస్టు మ్యాచ్‌ను డ్రా చేశారు..

S

Sports | Published On Dec 6, 2025, 6.54 am IST

కివీస్‌పై విండీస్ ప్లేయ‌ర్ల అద్భుతం.. భారీ టార్గెట్ ఉన్నా అద్భుతంగా ఆడి టెస్టు మ్యాచ్‌ను డ్రా చేశారు..
Advertisement

క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ప్లేయ‌ర్లు అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌రిచి మ్యాచ్‌ను డ్రా అయ్యేలా చేశారు. ఓ ద‌శ‌లో ఓట‌మి ఖాయం అని అంతా భావించారు. కానీ వెస్టిండీస్‌కు చెందిన షై హోప్‌, జ‌స్టీన్ గ్రీవ్స్ అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను కాపాడారు. భారీ ఓట‌మి నుంచి త‌ప్పించుకుని మ్యాచ్‌ను సునాయాసంగా డ్రా చేయ‌గ‌లిగారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కివీస్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో న్యూజిలాండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 231 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంత‌రం వెస్టిండీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 167 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 466 ప‌రుగుల భారీ స్కోరు చేసి 8 వికెట్ల వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఏకంగా ఒక‌టిన్న‌ర రోజుల‌ పాటు త‌మ రెండో ఇన్నింగ్స్‌లో ఆడింది. ఎట్ట‌కేల‌కు మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఏకంగా 163 ఓవ‌ర్ల పాటు ఆడ‌డం విశేషం. సుమారుగా 694 నిమిషాల పాటు ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు క్రీజులో నిలిచి మ్యాచ్ చేజారిపోకుండా డ్రా చేసుకున్నారు. ఈ క్ర‌మంలో విండీస్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 457 ప‌రుగుల వ‌ద్ద స్కోరు ఉన్న‌ప్పుడు 5వ రోజు ఆట కూడా ముగిసింది. దీంతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంటున్న‌ట్లు ఇరు జ‌ట్ల‌కు చెందిన కెప్టెన్లు అంగీక‌రించారు. కాగా విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీతో రాణించాడు. గ్రీవ్స్ మొత్తం 388 బంతులు ఆడి 202 ప‌రుగులు చేసి డ్రా అయ్యే స‌మ‌యానికి నాటౌట్‌గా నిలిచాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు ఉన్నాయి. మ‌రో ప్లేయ‌ర్ షై హోప్ 234 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 140 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నాడు.

ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ జేక‌బ్ డ‌ఫ్ఫీ ఏకంగా 5 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. మ‌రో బౌల‌ర్ మ్యాట్ హెన్రీకి 3 వికెట్లు ద‌క్కాయి. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బౌల‌ర్ కీమ‌ర్ రోచ్ 5 వికెట్లు తీశాడు. ఇక వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో జేక‌బ్ డ‌ఫ్ఫీకి మ‌రో 3 వికెట్లు ద‌క్క‌డం విశేషం. ఈ క్ర‌మంలో మొద‌టి టెస్టు డ్రా అవ‌గా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ డిసెంబ‌ర్ 10న వెల్లింగ్ట‌న్‌లో ప్రారంభం కానుంది. కాగా అంత‌కు ముందు వెస్టిండీస్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌లో తాము ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌ల‌లోనూ ఓట‌మి పాలైంది. అయిన‌ప్ప‌టికీ కివీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement