త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | టీమిండియాకు బీసీసీఐ భారీ న‌జ‌రానా.. రూ.131 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి..

BCCI | టీ20 ప్రపంచకప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటిస్తూ మరోసారి రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.

S

Sports | Published On Mar 10, 2026, 12.52 pm IST

BCCI | టీమిండియాకు బీసీసీఐ భారీ న‌జ‌రానా.. రూ.131 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి..
Advertisement

BCCI | టీ20 ప్రపంచకప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటిస్తూ మరోసారి రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 2024లో బార్బడోస్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు బోర్డు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఇప్పుడు అహ్మదాబాద్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవడంతో బీసీసీఐ మరింత పెద్ద బహుమతిని ప్రకటించింది. ఈ మేర‌కు బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌ విడుదల చేసింది.

బ‌ల‌మైన జ‌ట్టుగా భార‌త్‌..

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో విజయం సాధించిన భారత జట్టుకు రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నాం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది. ఈ విజయంతో భారత్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న తొలి జట్టుగా నిల‌వ‌డం మాత్రమే కాకుండా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ను మూడు సార్లు గెలిచిన తొలి జట్టుగా కూడా నిలిచింది. దీంతో ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా భారత్ తన స్థానాన్ని మరింత బ‌లంగా చాటిచెప్పింది.. అని బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఐసీసీ నుంచి రూ.27.48 కోట్లు..

ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లను బోర్డు మరోసారి అభినందిస్తోంది. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.. అని బీసీసీఐ పేర్కొంది. ఇక టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ కూడా భారీ నగదు బహుమతిని అందించింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలిచినందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు మొత్తం 3 మిలియన్ అమెరికన్ డాలర్లు బహుమతిగా లభించాయి. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.27.48 కోట్లకు సమానం. ఈ మొత్తం టోర్నమెంట్ కోసం ఐసీసీ ప్రకటించిన బహుమతి నిధి 13.5 మిలియన్ అమెరికన్ డాలర్లు కాగా ఇది గత ఎడిషన్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువ కావ‌డం విశేషం.

ఫైనల్ విజేతగా అందుకున్న ఈ భారీ బహుమతితో పాటు టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్ గెలిచినందుకు కూడా భారత జట్టుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందాయి. గ్రూప్ దశ, సూపర్ 8 దశల్లో ప్రతి మ్యాచ్ విజయానికి 31,154 అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ.28.6 లక్షల చొప్పున బోనస్‌గా జట్టుకు అందింది.

Advertisement
Advertisement