త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Belgium Vs Senegal | చెదిరిన సెనెగల్‌ కల

Belgium Vs Senegal | ప్రపంచకప్‌లో మరో సంచలన విజయానికి అడుగుదూరంలో నిలిచిన సెనగల్‌కు వీఆర్‌ఏ రూపంలో భారీ షాక్ తగిలింది. రెండు గోల్స్ ఆధిక్యాన్ని కోల్పోయిన ఆ జట్టు.. అదనపు సమయంలో లభించిన వివాదాస్పద పెనాల్టీతో బెల్జియం చేతిలో 3-2 తేడాతో ఓటమిపాలైంది. దీంతో బెల్జియం ప్రీక్వార్టర్‌కు దూసుకెళ్లగా.. అద్భుత పోరాటం చేసిన సెనెగల్ నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

P

Sports | Published On Jul 2, 2026, 7.47 am IST

Belgium Vs Senegal | చెదిరిన సెనెగల్‌ కల
Advertisement
  • వీఏఆర్‌ పెనాల్టీతో ఆశలు ఆవిరి
  • 3-2 తేడాతో బెల్జియం విజయం
  • ప్రీక్వార్టర్స్‌కు బెల్జియం
  • టోర్నీ నుంచి నిష్క్రమించిన సెనెగల్‌

Belgium Vs Senegal | ప్రపంచకప్‌లో మరో సంచలన విజయానికి అడుగుదూరంలో నిలిచిన సెనగల్‌కు వీఆర్‌ఏ రూపంలో భారీ షాక్ తగిలింది. రెండు గోల్స్ ఆధిక్యాన్ని కోల్పోయిన ఆ జట్టు.. అదనపు సమయంలో లభించిన వివాదాస్పద పెనాల్టీతో బెల్జియం చేతిలో 3-2 తేడాతో ఓటమిపాలైంది. దీంతో బెల్జియం ప్రీక్వార్టర్‌కు దూసుకెళ్లగా.. అద్భుత పోరాటం చేసిన సెనెగల్ నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదనపు సమయం చివరి నిమిషాల్లో యూరీ టీలెమాన్స్‌పై లామిన్ కమారా ఫౌల్ చేశాడని వీఏఆర్‌ పరిశీలన తర్వాత రిఫరీ పెనాల్టీ ప్రకటించాడు. 125వ నిమిషంలో టీలెమాన్స్ ఆ అవకాశాన్ని గోల్‌గా మలిచి బెల్జియంకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్-16లో బెల్జియం.. అమెరికా లేదంటే బోస్నియా అండ్ హెర్జెగోవినా జట్టుతో తలపడే అవకాశం ఉంది.

సెనెగల్ ఆధిపత్యం

స్కోర్‌బోర్డు బెల్జియం విజయాన్ని చూపించినా.. మ్యాచ్‌లో ఎక్కువ భాగం సెనెగల్‌దే ఆధిపత్యం. తొలి నుంచే దూకుడుగా ఆడిన ఆఫ్రికా జట్టు బెల్జియం డిఫెన్స్‌ను ఇబ్బందులు పెట్టింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇస్మాయిల్ జాకబ్స్ ఇచ్చిన క్రాస్‌ను బెల్జియం గోల్‌కీపర్ థిబౌట్ కుర్టోయిస్ సరిగా అందుకోలేకపోయాడు. రీబౌండ్‌ను ఇస్మాయిలా సార్ గోల్‌గా మలిచే ప్రయత్నం చేసినా బంతి పోస్ట్‌ను తాకింది. అయితే, 25వ నిమిషంలో సెనెగల్‌కు ఫలితం దక్కింది. సాడియో మానే ఇచ్చిన క్రాస్‌పై సార్ హెడ్డర్ మళ్లీ పోస్ట్‌ను తాకగా.. రీబౌండ్‌పై వేగంగా స్పందించిన హబీబ్ డియారా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి జట్టుకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగంలో బెల్జియంకు చెప్పుకోదగ్గ అవకాశం ఒక్కటే వచ్చింది. మాక్సిమ్ డి కుయ్పర్ కొట్టిన షాట్‌ను సెనెగల్ గోల్‌కీపర్ మోరీ డియావ్ అద్భుతంగా అడ్డుకోవడంతో తొలి అర్ధభాగం 1-0తో ముగిసింది. రెండో అర్ధభాగం ప్రారంభమైన ఆరు నిమిషాలకే సెనెగల్ మరో అద్భుత గోల్ సాధించింది. మౌస్సా నియాఖటే ఇచ్చిన పొడవాటి పాస్‌ను ఇస్మాయిలా సార్ చక్కగా నియంత్రించి ఇద్దరు డిఫెండర్లను తప్పించుకుని శక్తివంతమైన షాట్‌తో గోల్ చేశాడు. 2-0 ఆధిక్యంలో నిలిచిన సెనెగల్ విజయం ఖాయమనే పరిస్థితి కనిపించింది. బెల్జియం బంతిపై ఆధిపత్యం సాధించినప్పటికీ, సెనెగల్ డిఫెన్స్‌ పటిష్ఠంగా నిలిచి ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వలేదు.

లుకాకు ఎంట్రీతో మారిన మ్యాచ్..

రెండో అర్ధభాగం ప్రారంభంలోనే బెల్జియం కోచ్ రూడీ గార్సియా రొమెలు లుకాకును బరిలోకి దించాడు. చాలా సేపు ఆ మార్పు ప్రభావం కనిపించకపోయినా.. చివరి నిమిషాల్లో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 86వ నిమిషంలో థామస్ మ్యూనియర్ ఇచ్చిన క్రాస్‌ను లుకాకు గోల్‌గా మలిచి బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఆ గోల్‌తో జట్టులో ఉత్సాహం పెరిగింది. మూడు నిమిషాలకే లియాండ్రో ట్రోసార్డ్ ఇచ్చిన క్రాస్‌పై యూరీ టీలెమాన్స్ అద్భుత హెడ్డర్‌తో మరో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది.

వివాదాస్పద పెనాల్టీ

అదనపు సమయంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లేలా కనిపించింది. అయితే, చివరి క్షణాల్లో జరిగిన సంఘటన మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. గోల్‌ముందు వచ్చిన లూజ్ బాల్‌ను అందుకునే క్రమంలో టీలెమాన్స్, లామిన్ కమారా ఛాలెంజ్‌కు గురై కిందపడిపోయాడు. రిఫరీ తొలుత ఆటను కొనసాగించినా, వీఏఆర్ సూచనతో వీడియో పరిశీలించిన అనంతరం పెనాల్టీ ప్రకటించాడు. దీనిపై సెనెగల్ ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. 125వ నిమిషంలో టీలెమాన్స్ పెనాల్టీని గోల్‌గా మలిచి బెల్జియంకు 3-2 విజయాన్ని ఖాయం చేశాడు.

గుండెల్ని పిండేసిన ఓటమి

ఈ మ్యాచ్‌లో సెనెగల్ మెరుగైన ఆటనే ప్రదర్శించింది. రెండుసార్లు పోస్ట్‌ను తాకిన షాట్లు, పటిష్టమైన డిఫెన్స్‌, బలమైన ఎటాకింగ్‌తో టోర్నీలోని బలమైన జట్లలో ఒకటైన బెల్జియాన్ని చాలా సేపు నిలువరించింది. కానీ, చివరి నిమిషాల్లో జరిగిన పరిణామాలు ఆ జట్టు కలలను ఛిద్రమయ్యేలా చేశాయి. వీఏఆర్ నిర్ణయంపై మ్యాచ్ అనంతరం పెద్దఎత్తున చర్చ సాగుతున్నప్పటికీ.. బెల్జియం చివరి వరకు పోరాడి మ్యాచ్‌ను మలుపు తిప్పిన తీరు ప్రశంసలు అందుకుంది. మరోవైపు, చారిత్రక విజయానికి అతి చేరువలో నిలిచిన సెనెగల్ మాత్రం మరోసారి దురదృష్టం వెంటాడడంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

Advertisement
Advertisement