త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gautam Gambhir | గౌత‌మ్ గంభీర్ కోచ్ ప‌ద‌వికి ఎస‌రు..? టెస్టుల‌కు త‌ప్పించే అవ‌కాశం..?

Gautam Gambhir | భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రాక‌ముందు ఆయ‌న కోచింగ్‌పై ఎవ‌రికీ ఎలాంటి అనుమాలు లేవు. ఎందుకంటే ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను విజ‌య‌ప‌థంలో నిలిపిన వ్య‌క్తి ఆయ‌న‌. అలాగే టీమిండియా వ‌ర‌ల్డ్ కప్ లు సాధించిన జ‌ట్ల‌లోనూ ఉన్నారు.

S

Cricket | Published On Dec 27, 2025, 7.25 pm IST

Gautam Gambhir | గౌత‌మ్ గంభీర్ కోచ్ ప‌ద‌వికి ఎస‌రు..? టెస్టుల‌కు త‌ప్పించే అవ‌కాశం..?
Advertisement

Gautam Gambhir | భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రాక‌ముందు ఆయ‌న కోచింగ్‌పై ఎవ‌రికీ ఎలాంటి అనుమాలు లేవు. ఎందుకంటే ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను విజ‌య‌ప‌థంలో నిలిపిన వ్య‌క్తి ఆయ‌న‌. అలాగే టీమిండియా వ‌ర‌ల్డ్ కప్ లు సాధించిన జ‌ట్ల‌లోనూ ఉన్నారు. పైగా అధికార పార్టీ బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కూడా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు బీసీసీఐలో ప్ర‌ముఖుల అండ‌దండ‌లు సైతం పుష్క‌లంగా ఉన్నాయి. దీంతో ఆయ‌న‌ను కోచ్ గా నియ‌మించేందుకు బీసీసీఐకి నిమిషం ప‌ట్ట‌లేదు. అయితే ఆయ‌న కోచ్ అయిన త‌రువాతి నుంచి టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా ఆయ‌న కోచింగ్ పై అంద‌రూ విమ‌ర్శ‌లు వ్యక్తం చేస్తూ వ‌స్తున్నారు. వాస్త‌వానికి వైట్ బాల్ క్రికెట్‌లో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో టీమిండియా చాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకుంది. మొన్నీ మ‌ధ్యే ఆసియా క‌ప్‌లో కూడా విజ‌యం సాధించింది. అయిన‌ప్ప‌టికీ రెడ్ బాల్ క్రికెట్‌.. అంటే.. టెస్టు క్రికెట్‌లో మాత్రం భార‌త్ స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను టెస్టు జ‌ట్టుకు కోచ్‌గా త‌ప్పిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టెస్టుల‌కు కోచ్‌గా ల‌క్ష్మ‌ణ్‌..?

బీసీసీఐకి చెందిన ఉన్న‌తాధికారి ఒక‌రు టెస్టు జ‌ట్టు కోచింగ్‌పై గౌత‌మ్ గంభీర్‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. టెస్టు జ‌ట్టుకు కోచ్‌గా ఉండ‌డంపై గంభీర్‌ను అడిగార‌ట‌. అయితే దీనిపై పూర్తి వివ‌రాలు తెలియ‌వు. కానీ గంభీర్‌ను టెస్టు జ‌ట్టు కోచ్‌గా త‌ప్పించ‌బోతున్న‌ట్లు మాత్రం బ‌య‌ట‌కు తెలిసింది. దీంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గంభీర్ స్థానంలో మాజీ బ్యాట్స్‌మ‌న్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తార‌ని తెలుస్తోంది. దీనిపై లక్ష్మ‌ణ్‌ను కూడా బీసీసీఐ ఇప్ప‌టికే సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం ల‌క్ష్మ‌ణ్ బెంగ‌ళూరులోని బీసీసీఐకి చెందిన సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ హెడ్‌గా ఉన్నారు. దీంతో ఆయ‌నను భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు కోచ్‌గా ఎంపిక చేస్తార‌ని వార్త‌లు గుప్పుమంటున్నాయి.

ప్లేయ‌ర్ల‌లో ఆందోళ‌న‌..?

వాస్త‌వానికి గంభీర్ కోచ్ అయిన త‌రువాత టెస్టు క్రికెట్‌లో టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న ఏమీ బాగాలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2 తేడాతో డ్రా చేసుకున్నా సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాల‌తో జ‌రిగిన సిరీస్‌ల‌లో మాత్రం క్లీన్ స్వీప్ అయ్యారు. దీంతో ఎన్నో ఏళ్ల పాటు ఉన్న రికార్డులు కూడా చెదిరిపోయాయి. ఈ క్ర‌మంలో ఫ్యాన్స్ సైతం పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక మాజీలు అయితే ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌ను తెచ్చి టెస్టుల్లో ఆడించార‌ని కోచ్, సెలెక్ట‌ర్ల‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు. ఇక ప్లేయ‌ర్లు సైతం గంభీర్ కోచ్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో అసంతృప్తిగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక మ్యాచ్‌లో స‌రైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన‌ప్ప‌టికీ మ‌రుస‌టి మ్యాచ్‌లో ఉంటామో లేదో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని, అలాగే బ్యాటింగ్ ఆర్డ‌ర్ కూడా మ్యాచ్ మ్యాచ్‌కీ మారిపోతుంద‌ని ప్లేయ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బీసీసీఐ కేవ‌లం టెస్టు జ‌ట్టుకు మాత్రం కోచ్‌గా గంభీర్‌ను త‌ప్పిస్తుంద‌ని తెలుస్తోంది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాతే..?

టీ20లు, వ‌న్డేలలో కోచ్‌గా గంభీర్ ప్ర‌ద‌ర్శ‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న కోచింగ్‌, నైపుణ్యం టెస్టు జ‌ట్టుకు స‌రిపోవ‌డం లేద‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అనంత‌రం అందులో ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ గంభీర్‌ను టెస్టు జ‌ట్టు కోచ్‌గా తొల‌గిస్తార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది శ్రీ‌లంక‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల‌తో టెస్టు సిరీస్‌లు ఉన్నందున అంత‌కు ముందే బీసీసీఐ ఆ విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే టెస్టు చాంపియ‌న్ షిప్ నుంచి దాదాపుగా నిష్క్ర‌మించే ద‌శ‌లో ఉన్న భార‌త్ క‌నీసం వ‌చ్చే సిరీస్‌ల‌లో అయినా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ఫ్యాన్స్ సైతం ఆశిస్తున్నారు. మ‌రి బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement