త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup 2030 | మూడు ఖండాలు.. ఆరు దేశాల్లో 2030 ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌.. భార‌త్‌కు ఆడే ఛాన్స్ ద‌క్కుతుందా?

FIFA World Cup 2030 | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ముగిసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఫైన‌ల్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విశ్వ‌విజేత‌గా నిలిచింది. తొలిసారిగా సాక‌ర్ సంగ్రామంలో 48 జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కేప్‌వెర్డే, కుర‌కావో జ‌ట్టు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. కేవ‌లం రెండోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడిన కాంగో సైతం అత్యుత్త‌మ ఆట‌తీరుతో ప్ర‌శంస‌లు అందుకుంది.

P

Sports | Published On Jul 21, 2026, 6.28 pm IST

FIFA World Cup 2030 | మూడు ఖండాలు.. ఆరు దేశాల్లో 2030 ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌.. భార‌త్‌కు ఆడే ఛాన్స్ ద‌క్కుతుందా?
Advertisement
  • ఫిఫా మొద‌లై 100వ సంవ‌త్స‌రం
  • మూడుదేశాల్లో స్పెష‌ల్ మ్యాచులు
  • ఆతిథ్యం ఇవ్వ‌నున్న స్పెయిన్‌, పోర్చుగ‌ల్‌, మొరాకోలో నిర్వ‌హ‌ణ‌

FIFA World Cup 2030 | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ముగిసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఫైన‌ల్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విశ్వ‌విజేత‌గా నిలిచింది. తొలిసారిగా సాక‌ర్ సంగ్రామంలో 48 జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కేప్‌వెర్డే, కుర‌కావో జ‌ట్టు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. కేవ‌లం రెండోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడిన కాంగో సైతం అత్యుత్త‌మ ఆట‌తీరుతో ప్ర‌శంస‌లు అందుకుంది. తాజాగా అంద‌రి దృష్టి 2030 ప్ర‌పంచ‌క‌ప్‌పై ప‌డింది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌కు ప్ర‌త్యేక ఉన్న‌ది. వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లై 100 సంవ‌త్స‌రాలు కావ‌డం విశేషం. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జ‌ట్ల‌ను 64కి పెంచాల‌ని ఫిఫా భావిస్తోంది. అధ్య‌క్షుడు జియానీ ఇన్ఫాంటినో సైతం ఆస‌క్తిని వ్య‌క్తం చేశారు. దీనిపై ఫిఫా స‌మావేశంలోనే తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మూడు ఖండాలు.. ఆరుదేశాల్లో..

2030 ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోతుంది. తొలిసారిగా టోర్నీని మూడు ఖండాలు, ఆరు దేశాల్లో నిర్వ‌హించ‌నున్నారు. టోర్నీని రెండు భాగాల్లో నిర్వ‌హిస్తారు. 1930లో తొలి ప్రపంచకప్ దక్షిణ అమెరికాలో జరిగిన నేపథ్యంలో 100వ సంవ‌త్స‌రాలు అవుతున్న నేప‌థ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు అక్కడే నిర్వహించనున్నారు. తొలి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆతిథ్యం ఇచ్చి విజేత‌గా నిలిచిన ఉరుగ్వేలోని మాంటివీడియోలో ఉన్న చారిత్రక ఎస్టాడియో సెంటెనారియో స్టేడియంలో ప్రత్యేక మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు. అలాగే, తొలి ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఐరెస్ ఎస్టాడియో మోనుమెంటల్‌లో మరో మ్యాచ్ నిర్వహిస్తారు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య (కాన్‌మెబోల్) ప్రధాన కార్యాలయం ఉన్న అసున్సియోన్‌లోని ఎస్టాడియో ఓస్వాల్డో డొమింగ్వేజ్ డిబ్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరుగుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల అనంతరం టోర్నీ పూర్తిగా స్పెయిన్, పోర్చుగల్, మొరాకో వేదిక‌గా జ‌రుగుతుంది. ప్లేయ‌ర్ల ప్ర‌యాణ అల‌స‌ట‌ను త‌గ్గించేందుకు జ‌ట్ల‌కు విశ్రాంతి కోసం అద‌నంగా బ్రేక్ ఇవ్వాల‌ని సైతం ప్ర‌తిపాదించారు. అయితే, ప్రపంచకప్‌లోని మెజారిటీ మ్యాచ్‌లు ఈ మూడు దేశాల్లోనే జరుగుతాయి. స్పెయిన్‌లో ఎనిమిది నగరాల్లోని 10 స్టేడియాలు మ్యాచుల‌కు వేదిక కానుంది. ఫైనల్ కూడా అక్కడే నిర్వహించే అవకాశాలున్నాయి. పోర్చుగల్‌లో రెండు నగరాల్లోని మూడు స్టేడియాలు, మొరాకోలో ఆరు నగరాల్లోని ఆరు స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ప్రతిపాదిత షెడ్యూల్ ఇదే..

2030 ప్రపంచకప్‌ను జూన్ 8 నుంచి జూలై 21 వరకు నిర్వహించాలని ప్రతిపాదించారు. మొత్తం 44 రోజుల పాటు సాగే ఈ టోర్నీ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా నిలవనుంది. జూన్ 8, 9 తేదీల్లో ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వేలో 100 సంవ‌త్స‌రాల వేడుక‌లు, ప్రారంభ మ్యాచులు నిర్వ‌హిస్తారు. జూన్ 13, 14 తేదీల మ‌ధ్య స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో అధికారికంగా ప్రారంభోత్స‌వ వేడుక‌లు, తొలి మ్యాచులు జ‌రుగుతాయి. జూన్ 15, 16 తేదీల్లో గ్రూప్ మ్యాచులు జ‌రుగుతాయి. జూలై 21న ఫైన‌ల్ ఉంటుంది. జ‌ర్నీ, రెస్ట్ ఇచ్చేందుకు ఈ షెడ్యూల్‌ను ప్ర‌తిపాదించినా.. తుది షెడ్యూల్‌ను ఫిఫా తుది ఆమోదం పొందిన త‌ర్వాత ప్ర‌క‌టిస్తుంది.

ఎన్ని జ‌ట్ల‌కు అవ‌కాశం..?

ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రణాళిక ప్రకారం.. 2026లో ఆడిన 48 జట్ల ఫార్మాట్‌నే 2030లో కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే, 2025 ఏప్రిల్‌లో దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రపంచకప్‌లో 64 జట్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అధికారికంగా ప్ర‌తిపాదించింది. 2026 ప్రపంచకప్ అనంతరం ఈ అంశంపై సమగ్ర చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో తెలిపారు. అయితే, 64 జ‌ట్ల‌కు అనుమ‌తి ఇస్తే.. టోర్నీలో నాలుగేసి జ‌ట్ల‌ను 16 గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే నాకౌట్ దశ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధిస్తాయి. దీంతో మూడో స్థానంలో నిలిచిన జట్లకు అవకాశం ఉండదు. గ్రూప్ దశ మ్యాచ్‌ల సంఖ్య 72 నుంచి 96కి పెరుగుతుంది. దాంతో టోర్నీ దాదాపుగా ఆరువారాలు సాగుతుంది. దీంతో ప్రయాణం, నిర్వహణ, ఆటగాళ్ల విశ్రాంతి త‌దిత‌ర అంశాలు స‌వాల్‌గా మార‌నున్నాయి. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధిక సంఖ్యలో జట్లను చేర్చడం వల్ల ప్రపంచకప్ స్థాయి, పోటీ తీవ్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని బైచుంగ్ భూటియా సహా పలువురు అభిప్రాయపడుతున్నారు. యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ), ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ), ఉత్తర-మధ్య అమెరికా, కరేబియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (కాన్‌కాకాఫ్) సైతం ఈ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తున్నాయి.

ఇప్పటికే అర్హత సాధించిన ఆరు జట్లు

2030 ప్రపంచకప్‌కు ఇప్పటివరకు మొత్తం ఆరు జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య దేశాలు, 100 సంవ‌త్స‌రాల వేడుక‌లకు సంబంధించిన భాగస్వామ్య దేశాలుగా ఉండడంతో వీటికి నేరుగా ఎంట్రీ ల‌భించ‌నుంది. మిగ‌తా 42 జట్లను వివిధ ఖండాల అర్హత పోటీల ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. యూరప్, కాన్‌కాకాఫ్ సమాఖ్యలు కొత్త అర్హ‌త విధానాన్ని తీసుకువ‌చ్చాయి. యూర‌ప్‌లో 2028-29 నేషన్స్ లీగ్ ర్యాంకింగ్స్ ఆధారంగా అగ్రశ్రేణి 36 జట్లను టాప్ డివిజన్‌లో ఉంచి గ్రూపులుగా విభజిస్తారు. అత్యుత్తమ జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన స్థానాలను ప్లేఆఫ్‌ల ద్వారా భర్తీ చేస్తారు. తక్కువ ర్యాంకు జట్లు రెండో డివిజన్‌లో పోటీ పడతాయి. అక్కడి నుంచి మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ప్లేఆఫ్‌ల ద్వారా ప్రపంచకప్‌లో ఆడే అవ‌కాశాన్ని ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది. కాన్‌కాకాఫ్‌లో మూడు దశల్లో జ‌రుగుతుంది. మొదట ప్లేఆఫ్ దశ నిర్వహిస్తారు. అనంతరం గ్రూప్ దశకు చేరిన జట్లు టాప్ జట్లతో పోటీపడతాయి. చివరి దశలో 12 జట్లు ప్రపంచకప్ బెర్త్‌ల కోసం తలపడతాయి. గ్రూప్ విజేతలు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన స్థానాలు ప్లేఆఫ్‌తో భ‌ర్తీ చేస్తారు.

భారత్‌కు ఆడే అవ‌కాశం ఉందా?

2030 ప్రపంచకప్‌లో భారత్ ఆడే అవకాశాలు టోర్నీలో ఆడే జ‌ట్ల సంఖ్య‌, దేశీయ ఫుట్‌బాల్‌లో జరిగే సంస్కరణలపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. 64 జట్ల ప్రతిపాదన ఆమోదం పొందితే భారత్ అవకాశాలు మెరుగవుతాయని మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా వెల్ల‌డించారు. అయితే జట్ల సంఖ్య పెరగడం మాత్రమే సరిపోదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం భారత్ ఫిఫా ర్యాంకింగ్‌లో 139వ స్థానంలో ఉంది. 2026 ప్రపంచకప్ ఆసియా అర్హత పోటీల రెండో దశలోనే నిష్క్రమించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) పరిపాలనా వివాదాలు, దేశీయ ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లతో పోలిస్తే తక్కువ మ్యాచ్‌లు ఆడడం, జాతీయ జట్టుకు ఆటగాళ్లను క్లబ్‌లు సకాలంలో విడుదల చేయకపోవడం వంటి సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయని జాతీయ జట్టు ప్రధాన కోచ్ ఖలీద్ జమీల్ పేర్కొన్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్రపంచకప్‌పై నేరుగా అర్హ‌త సాధించే విష‌యంపై దృష్టి పెట్టడం కంటే ముందుగా అండర్-17, అండర్-20 ప్రపంచకప్‌లకు క్రమం తప్పకుండా ఆడుతూ టోర్నీకి అర్హత సాధించే స్థాయికి భారత్ ఎదగాలని బైచుంగ్ భూటియా సూచించాడు. మొరాకో, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు అనుసరిస్తున్న మార్గంలో వెళ్లాల‌ని తెలిపాడు. మాజీ ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ 2030 నాటికి ప్రపంచకప్‌కు అర్హత సాధించడమే లక్ష్యమని గతంలో ప్ర‌క‌టించినా యువ ఆట‌గాళ్ల‌ను వెలికి తీయ‌డం.. అంతర్జాతీయ స్థాయిలో అనుభ‌వం, స్థిరమైన దేశీయ లీగ్ క్యాలెండర్ లేక‌పోవ‌డం కార‌ణంగా ల‌క్ష్యం చేర‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Advertisement
Advertisement