త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Artemis 2 | చంద్రుడి పైకి మీ పేరును కూడా పంపుతారా..? నాసా అద్భుత అవ‌కాశం..

Artemis 2 | చంద్రుని చుట్టూ జరగనున్న చారిత్రాత్మ‌క‌ అంతరిక్ష ప్రయాణంలో తమ పేరు కూడా ఉండాలనుకునే వారికో అరుదైన అవకాశం కల్పిస్తూ నాసా ఓ వినూత్న కార్య‌క్ర‌మం చేపట్టింది. 50 ఏళ్ల తర్వాత మళ్లీ మనుషులతో జరగనున్న తొలి చంద్రయానమైన ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పంపిన పేర్లను మెమొరీ కార్డులో భద్రపరిచి, ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో తీసుకెళ్లనున్నట్లు నాసా ప్రకటించింది.

S

Science | Published On Jan 20, 2026, 8.31 am IST

Artemis 2 | చంద్రుడి పైకి మీ పేరును కూడా పంపుతారా..? నాసా అద్భుత అవ‌కాశం..
Advertisement

Artemis 2 | చంద్రుని చుట్టూ జరగనున్న చారిత్రాత్మ‌క‌ అంతరిక్ష ప్రయాణంలో తమ పేరు కూడా ఉండాలనుకునే వారికో అరుదైన అవకాశం కల్పిస్తూ నాసా ఓ వినూత్న కార్య‌క్ర‌మం చేపట్టింది. 50 ఏళ్ల తర్వాత మళ్లీ మనుషులతో జరగనున్న తొలి చంద్రయానమైన ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పంపిన పేర్లను మెమొరీ కార్డులో భద్రపరిచి, ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో తీసుకెళ్లనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ పేర్లను పంపేందుకు జ‌న‌వ‌రి 21వ తేదీ వరకు గ‌డువు ఉండగా, నాసా నిర్వహించే ప్రత్యేక వెబ్‌సైట్ (https://www3.nasa.gov/send-your-name-with-artemis/) ద్వారా ఎవరైనా అందులో నమోదు చేసుకోవచ్చు. ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగమైన ఈ మిషన్ ద్వారా చంద్రునిపై మళ్లీ మానవ ప్ర‌యాణాన్ని స్థిరంగా ప్రారంభించాలన్నది నాసా లక్ష్యం. గతంలో జరిగిన ఆర్టెమిస్-1 మిషన్ మానవరహితంగా సాగగా, ఇప్పుడు జరగనున్న ఆర్టెమిస్-2లో నలుగురు వ్యోమగాములు చంద్రుని కక్ష్యలోకి ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణంలో ప్రజల పేర్లు కలిగిన మైక్రో ఎస్‌డీ కార్డును కూడా స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉంచనున్నారు.

ఎస్‌డీ కార్డులో భ‌ద్ర ప‌రిచి..

కాగా ఈ ప్రక్రియ చాలా సులభమని నాసా తెలిపింది. ఆన్‌లైన్ ఫాం ద్వారా ఇంగ్లిష్ లేదా స్పానిష్ భాషల్లో పేరు నమోదు చేయవచ్చు. పేర్లు నమోదు చేసిన వారికి ప్రత్యేక డిజిటల్ బోర్డింగ్ పాస్ కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని నాసా వెల్లడించింది. సేకరించిన పేర్లన్నింటినీ ఎస్‌డీ కార్డులో భద్రపరిచి ప్రయోగానికి ముందు ఒరియన్ యానంలో ఉంచుతారు. దీనివల్ల ప్రజలు కూడా ఈ మిషన్‌లో భాగమైన అనుభూతిని పొందగలుగుతారు అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. అపోలో-17 మిషన్ తర్వాత 1972లో చివరిసారిగా మానవులు చంద్రుని దిశగా ప్రయాణించారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ అలాంటి ప్రయాణం జరగనుండటంతో ఆర్టెమిస్-2పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

సామాన్యుల‌కు చేరువ అయ్యేందుకే..

క‌లెక్ట్ స్పేస్ ఎడిటర్ రాబర్ట్ పెర్ల్‌మన్ మాట్లాడుతూ, ప్రేక్షకులుగా మాత్రమే కాకుండా, ప్రజలు ఈ మిషన్‌కు కొంత దగ్గరగా ఉన్నట్టు భావించేందుకు ఇది మంచి మార్గం అని అభిప్రాయపడ్డారు. నాసా దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఆర్టెమిస్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. 2022లో విజయవంతంగా జరిగిన ఆర్టెమిస్-1 ద్వారా స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్, ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్ పనితీరును పరీక్షించారు. ఇప్పుడు ఆర్టెమిస్-2 ద్వారా మానవులతో కూడిన ప్రయాణం నిర్వహించి, భద్రతా వ్యవస్థలు, జీవన సహాయక సాంకేతికతలు, డీప్ స్పేస్ ఆపరేషన్లను పరీక్షించనున్నారు. అనంతరం ఆర్టెమిస్-3 మిషన్‌లో చంద్రునిపై మళ్లీ అడుగుపెట్టే లక్ష్యంతో నాసా ముందుకెళ్తోంది. ఇటీవలే పూర్తిగా సిద్ధమైన ఆర్టెమిస్-2 రాకెట్‌ను ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ ప్రయోగ వేదికకు తరలించారు. అమెరికా చంద్ర అన్వేషణలో ఇది కీలక మలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల పేర్లను కూడా ఈ ప్రయాణంలో భాగం చేయడం ద్వారా అంతరిక్ష అన్వేషణలో సామాన్యుల భాగస్వామ్యాన్ని నాసా మరింత విస్తృతం చేస్తోంది.

ఇదివరకు కూడా నాసా మార్స్‌కు పంపిన రోవర్లలో ప్రజల పేర్లను చేర్చిన అనుభవం ఉంది. అయితే చంద్రుని చుట్టూ జరగనున్న ఈ ప్రయాణానికి ఉన్న భావోద్వేగ ప్రాధాన్యత దృష్ట్యా, ఆర్టెమిస్-2 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉచితంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవకాశం కల్పించడం ద్వారా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకే కాకుండా సామాన్య ప్రజల్లోనూ అంతరిక్షంపై ఆసక్తిని పెంచాలన్నదే నాసా లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement