త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NASA | 53 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ చంద్రుడి పైకి నాసా వ్యోమ‌గాముల ప్ర‌యాణం.. ఫిబ్ర‌వ‌రిలో మిష‌న్‌..?

NASA | అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా (NASA) అతి త్వ‌ర‌లోనే చంద్రుడిపైకి మాన‌వ స‌హిత మిష‌న్‌ను నిర్వ‌హించ‌నుంది. 1972 తర్వాత చంద్రుని వైపు వెళ్లే తొలి మానవ సహిత ప్రయాణమైన ఆర్టెమిస్-2 (Artemis II) మిషన్‌కు ఫిబ్రవరి 6నే తొలితేదీగా నిర్ణయించినట్లు నాసా వెల్లడించింది. నాసా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టెమిస్-2 అధికారిక ప్రయోగ విండో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వ తేదీ వరకు తెరిచి ఉంటుంది.

S

Science | Published On Jan 14, 2026, 12.05 pm IST

NASA | 53 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ చంద్రుడి పైకి నాసా వ్యోమ‌గాముల ప్ర‌యాణం.. ఫిబ్ర‌వ‌రిలో మిష‌న్‌..?
Advertisement

NASA | అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా (NASA) అతి త్వ‌ర‌లోనే చంద్రుడిపైకి మాన‌వ స‌హిత మిష‌న్‌ను నిర్వ‌హించ‌నుంది. 1972 తర్వాత చంద్రుని వైపు వెళ్లే తొలి మానవ సహిత ప్రయాణమైన ఆర్టెమిస్-2 (Artemis II) మిషన్‌కు ఫిబ్రవరి 6నే తొలితేదీగా నిర్ణయించినట్లు నాసా వెల్లడించింది. నాసా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టెమిస్-2 అధికారిక ప్రయోగ విండో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రయోగానికి అనుకూలంగా ఉండే పలు ప్రత్యామ్నాయ తేదీలను కూడా ఎంపిక చేశారు. అయితే ఆర్టెమిస్-2 ను ఎలాంటి రోజుల్లోనైనా ప్రయోగించ‌డానికి వీలులేదు. భూమి-చంద్రుని స్థానాలు, క‌చ్చితమైన ఆర్బిటల్ మెకానిక్స్, రాకెట్ పనితీరు, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ పరిసరాల్లోని వాతావరణ పరిస్థితులపై ఆ ప్రయోగ సమయం ఆధారపడి ఉంటుందని నాసా తెలియ‌జేసింది.

ఫిబ్ర‌వ‌రిలోనే..

ఫిబ్రవరి 7, 8, 10, 11 తేదీలను బ్యాకప్ లాంచ్ తేదీలుగా నిర్దారించారు. ఒకవేళ ఫిబ్రవరిలో ప్రయోగం సాధ్యంకాకపోతే, మార్చి ప్రారంభం లేదా ఏప్రిల్‌లో మరోసారి ప్రయత్నించేందుకు కూడా తేదీలను నాసా ఇప్ప‌టికే ఖరారు చేసింది. కాగా ఆర్టెమిస్-2 మిషన్ తక్కువ భూమి కక్ష్యను (లో ఎర్త్ ఆర్బిట్) దాటి మానవ బృందం ప్రయాణించనున్న తొలి అంతరిక్ష మిషన్‌గా నిలవనుంది. 53 ఏళ్ల తర్వాత చంద్రుని దిశగా మానవ సహితంగా వెళ్లే ఈ ప్రయాణంలో నాసా వ్యోమగాములు రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌తో పాటు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి జెరెమీ హాన్సన్ పాల్గొననున్నారు. వీరు సుమారు 10 రోజుల పాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి చేరుకుంటారు. అయితే ఈ మిషన్‌లో చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ ఉండదు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో తొలి చంద్రల్యాండింగ్‌ను ఆర్టెమిస్-3 మిషన్ ద్వారా నిర్వహించనుండగా, అది ప్రస్తుతం 2027లో జరగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న వ్యోమగాములు కేప్ కానవెరల్ నుంచి ఒరియన్ (Orion) అంతరిక్ష నౌకలో ప్రయాణం ప్రారంభిస్తారు. నాసా అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ ఈ నౌకను అంతరిక్షంలోకి మోస్తుంది.

అత్య‌వ‌స‌రం అయితే సుర‌క్షితంగా భూమికి వ‌చ్చే వీలు..

ప్రారంభ స‌మ‌యంలో భూమి చుట్టూ కొన్ని కక్ష్యలు తిరిగి లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను పరీక్షించిన అనంతరం, వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తారు. ఇది లూనార్ ఫ్లైబైగా పిలవబడే సమీప ప్రయాణం కానుండ‌డం విశేషం. ఇక చంద్రుని చుట్టూ కక్ష్యలోకి వెళ్లడం లేదా ల్యాండ్ కావడం ఉండదు. చంద్రుని గురుత్వాకర్షణను ఉపయోగించి ఫ్రీ-రిటర్న్ ట్రాజెక్టరీ ద్వారా నౌక తిరిగి భూమి వైపు మళ్లుతుంది. అంటే ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా, అదనపు ఇంధనం వినియోగించకుండా సురక్షితంగా భూమికి చేరుకునే వీలుంటుంద‌న్న‌మాట‌. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.. మనుషులతో కలిసి రాకెట్, అంతరిక్ష నౌక, ఇతర వ్యవస్థలు పనిచేస్తాయో లేదో నిరూపించడం. ఇది వచ్చే ఏడాది ఆర్టెమిస్-3 చంద్ర ల్యాండింగ్‌కు మార్గం సుగమం చేయ‌నుంద‌ని భావిస్తున్నారు.

జ‌న‌వ‌రి 17 నుంచి రోలౌట్‌..

ఈ చారిత్రక ఘట్టంలో తొలి దశగా పరిగణిస్తున్న రోలౌట్ కార్యక్రమం జనవరి 17న ప్రారంభం కానుంది. పూర్తిగా అమర్చిన SLS రాకెట్, ఒరియన్ నౌకలను నాసా వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ నుంచి కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్ 39Bకి తరలించనున్నారు. సుమారు నాలుగు మైళ్ల దూరం ఉన్న ఈ ప్రయాణాన్ని భారీ క్రాలర్-ట్రాన్స్‌పోర్టర్ ద్వారా నిర్వహిస్తారు. దీనికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. లాంచ్ ప్యాడ్‌కు చేరుకున్న తర్వాత విద్యుత్, ఇంధన లైన్లను అనుసంధానం చేసి, తుది దశ రాకెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వ్యోమగాములు ఫ్లైట్ వాక్‌త్రూ ప్రారంభిస్తారు. ఆర్టెమిస్-2 లాంచ్ ప్యాడ్‌పై సిద్ధమైన తర్వాత వెట్ డ్రస్ రిహార్సల్, ట్యాంకింగ్ ప్రక్రియలను నాసా సిబ్బంది చేపడతారు. ఇందులో SLS రాకెట్‌లో 7 లక్షల గ్యాలన్లకు పైగా అత్యంత చల్లని ద్రవ హైడ్రోజన్, ఆక్సిజన్‌ను ఇంధనంగా నింపుతారు.

చంద్రుడిపై దీర్ఘ‌కాలిక మాన‌వ ఉనికే ల‌క్ష్యం..

ఈ ప్రక్రియలో నకిలీ కౌంట్‌డౌన్, హోల్డ్స్, రీస్టార్ట్స్ అన్నీ సాధన చేస్తారు. అనంతరం నిజమైన ప్రయోగానికి ముందు ఇంధనాన్ని సురక్షితంగా బయటకు తీస్తారు. ఈ రిహార్సల్ ద్వారా ఇంధన నింపే విధానాలను పరీక్షించడంతో పాటు, ట్యాంకులు లేదా వాల్వుల్లో లీకులు వంటి సమస్యలు ఉన్నాయా లేదా అన్నది కూడా గుర్తిస్తారు. ఏవైనా లోపాలు తేలితే మరిన్ని రిహార్సల్స్ నిర్వహించాల్సి ఉండటంతో ప్రయోగం ఆలస్యం అయ్యే అవకాశమూ ఉంటుంది. ఇదిలా ఉండగా 2025 సెప్టెంబర్‌లో అప్పటి నాసా అడ్మినిస్ట్రేటర్ షాన్ డఫీ, ఆర్టెమిస్-2 మిషన్‌కు సుమారు ఏడాదిన్నర తర్వాత ఆర్టెమిస్-3 ద్వారా అమెరికా నేతృత్వంలో చంద్రునిపై ల్యాండ్ అయి దీర్ఘకాలిక మానవ ఉనికిని స్థాపించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement