లోడ్ అవుతోంది...


Anaganaga Oka Raju Review | జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బ్లాక్‌బస్టర్స్ తర్వాత మూడేళ్ల గ్యాప్ అనంతరం అనగనగా ఒక రాజుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు నవీన్ పొలిశెట్టి. ఫన్ విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ రిలీజైంది. అనగనగా ఒక రాజు ఎలా ఉంది? ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి హ్యాట్రిక్ హిట్ దక్కిందా? లేదా? అంటే?
గౌరవపురం జమీందారు గోపరాజు తన ఆస్తులన్నీ జల్సాల కోసం కరిగించేస్తాడు. మనవడు రాజుకు (నవీన్ పొలిశెట్టి)జమీందారు వారసుడు అనే పేరు తప్ప చిల్లి గవ్వా దక్కదు. లోపల ఎన్ని కష్టాలు ఉన్నా పైకి మాత్రం జమీందారు వంశం పేరు చెప్పుకుంటూ బడాయిగా బతికేస్తుంటాడు. గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. పెద్దిపాలెం భూపతి రాజు (రావు రమేష్) కూమార్తె చారులతను (మీనాక్షి చౌదరి) ఓ గుడిలో చూసి మనసు పారేసుకుంటాడు రాజు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు చూసి బాగానే ఆస్తులు ఉన్నాయని ఫిక్సైపోయిన రాజు ఆమెను ముగ్గులోకి దించడానికి ఆపరేషన్ చారు పేరుతో ప్లాన్ వేస్తాడు. రాజు, చారుల పెళ్లిని భూపతి రాజు గ్రాండ్‌గా జరిపిస్తాడు. కానీ ఫస్ట్ నైట్ రోజే భూపతి రాజు ఆస్తులకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ రాజుకు తెలుస్తుంది? అదేమిటి? పెద్దిపాలెం ఎలెక్షన్‌లో రాజు ఎందుకు నిలబడాల్సివచ్చింది? ఎర్రిబాబును (తారక్ పొన్నప్ప)ఎదురించి ఎలెక్షన్స్‌లో గెలిచాడా? రాజుకు చారు ఆస్తులు దక్కాయా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సాధారణంగా హిట్టు కోసం దర్శకులు రెండే రూట్లను ఫాలో అవుతుంటారు. కొత్త కథను ఆడియెన్స్‌కు చెప్పడం...లేదంటే పాత కథనే ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ కొత్తగా చెప్పడం. అనగనగా ఒక రాజు రెండో కోవకు చెందిన మూవీ. పాత కథను నవ్యరీతిలో చెప్పడం ఓ ఆర్ట్. ఇందులో పాస్ కావాలంటే మంచి ఇమేజ్ ఉన్న హీరో కావాలి. అనగనగా ఒక రాజుకు అదే ప్లస్ పాయింట్ అయ్యింది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను నిలబెట్టారు. నవీన్ వేసే పంచ్‌లు, ప్రాసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వులను పంచుతూనే ఉంటాయి. ప్రతి సీన్ నుంచి ఫన్ జనరేట్ అయ్యేలా రాసుకున్నారు డైరెక్టర్ మారి. వాటికి నవీన్ ఎనర్టీ తోడవ్వడంతో బుల్లెట్లలా పేలాయి. కథ, కథనాల గురించి ఆడియెన్స్‌కు ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వలేదు. నవ్విస్తూనే వెళ్లారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా పండుగ సినిమాల అనగనగా ఒక రాజు ఉంటుంది. జేబులో చిల్లిగవ్వలేకపోయినా తాను జమీందారు వారసుడు అంటూ నవీన్ ఇచ్చే బిల్డప్‌లు ఫస్ట్ హాఫ్‌లో టైమ్‌పాస్ చేస్తాయి. చారులత ప్రేమలో పడేయటానికి అతడు వేసే ప్లాన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సెకండాఫ్ విలేజ్ ఎలెక్షన్స్, ప్రచారంలో నవీన్ పొలిశెట్టి చేసే సందడి ఆకట్టుకుంటాయి. ఈ ఎలెక్షన్స్ ఎపిసోడ్స్ హిలేరియస్‌గా నవ్విస్తాయి. కామెడీని కొత్తగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో నవ్వుల జోరుకు బ్రేకులు వేసి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఎండింగ్ సరదాగా ఉంటుంది.
ఈ సినిమాకు మైనస్ అంటే ముందే చెప్పినట్లే స్టోరీనే. ఈ పాయింట్‌తో చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. నవీన్ పోటీగా కామెడీని పండించే పాత్రలు ఉండుంటే బాగుండేది.
నవీన్ పొలిశెట్టి వన్ మెన్ షోగా అనగనగా ఒక రాజు నిలుస్తుంది. నవీన్ డైలాగ్ డెలివరీ, మాడ్యూలేషన్‌తో వల్ల రొటీన్ పంచ్‌లు కూడా నవ్వించాయి. హీరోగానే కాకుండా ఈ సినిమా కథ, డైలాగ్స్ కూడా నవీన్ అందించారు. తన బలం కామెడీనే అని నవీన్‌కు తెలుసు. ఆ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే వన్ లైనర్స్ బాగా రాసుకున్నారు. అవన్నీ వర్కవుట్ అయ్యాయి. చారులత పాత్రలో మీనాక్షి నటన ఓకే. రావు రమేష్ పాత్ర లెంగ్త్ తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. విలన్‌గా తారక్ పొన్నప్పది రెగ్యులర్ క్యారెక్టర్లే. స్పెషల్ సాంగ్‌లో శాన్వీ మేఘన ఆకట్టుకుంది.
ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే అనగనగా ఒక రాజు నచ్చుతుంది. కంప్లీట్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్.
రేటింగ్ : 2.5/5





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam