త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aliens-Area 51 | నిజంగా ఏలియన్స్‌ ఉన్నారా..? ఏరియా-51లో ఏం జరుగుతోంది..?

Aliens-Area 51 | ప్రపంచవ్యాప్తంగా ఏలియన్స్‌ గురించి చర్చ జరుగుతూనే ఉన్నది. తాము యూఎఫ్‌వోలను చూశామంటూ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏలియన్స్‌పై ఏరియా 51లో పరిశోధనలు జరుపుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. తాజాగా మరోసారి ఏలియన్స్‌ అంశంపై వార్తల్లో నిలిచింది.

P

Science | Published On Feb 20, 2026, 5.03 pm IST

Aliens-Area 51 | నిజంగా ఏలియన్స్‌ ఉన్నారా..? ఏరియా-51లో ఏం జరుగుతోంది..?
Advertisement
  • ట్రంప్‌ ఆదేశాలతో రహస్యాలు వెల్లడయ్యేనా?

Aliens-Area 51 | ప్రపంచవ్యాప్తంగా ఏలియన్స్‌ గురించి చర్చ జరుగుతూనే ఉన్నది. తాము యూఎఫ్‌వోలను చూశామంటూ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏలియన్స్‌పై ఏరియా 51లో పరిశోధనలు జరుపుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. తాజాగా మరోసారి ఏలియన్స్‌ అంశంపై వార్తల్లో నిలిచింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఏలియన్స్‌ నిజంగా ఉన్నారని తెలిపారు. దాంతో ఏలియన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూఎఫ్‌వోలు, గ్రహాంతర జీవులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను విడుదల చేయాలని ఆదేశించారు.

ఒబమా వ్యాఖ్యలు.. ట్రంప్‌ ఆదేశాలు..

గతవారంలో ఓ పాడ్‌కాస్ట్‌లో బరాక్‌ ఒమామా పాల్గొన్నారు. ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ నిజంగా ఏలియన్స్‌ ఉన్నారు. కానీ, నేను చూడలేకపోయాను. ఎక్కడా రహస్యంగా ఉంచలేదు. భూగర్భంలో ఎలాంటి ఫెలిసిటీలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో సోషల్‌ మీడియా వేదికగా మరోసారి గ్రహాంతర జీవులపై చర్చ మొదలైంది. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. విశ్వంలో మరెక్కడైనా జీవం ఉండవచ్చని.. అధ్యక్ష పదవిలో గ్రహాంతర వాసులతో సంబంధాలు ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు కనిపించలేదని సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. తాజాగా గ్రహాంతర జీవులకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ట్రంప్‌ ఆదేశించారు. యూఎఫ్‌వోలు, ఏలియన్స్‌, ఇతర గ్రహాల జీవులకు సంబంధించిన ప్రభుత్వ డాక్యుమెంట్స్‌ను గుర్తించి, డేటాను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఒబామా చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. ఏలియన్స్‌కు సంబంధించిన వివరాలు బయటపెట్టారని ఆయన మండిపడ్డారు.

నిజంగా ఏలియన్స్‌ ఉన్నారా?

అమెరికా నెవాడలోని రహస్య ప్రాంతమైన ఏరియా 51లో అమెరికా ప్రభుత్వం గ్రహాంతర జీవులను దాచి ఉంచి.. వారిపై పరిశోధనలు చేస్తుందనే విమర్శలున్నాయి. గతంలోనూ ఏరియా 51కు సంబంధించి పలువురు కీలక విషయాలను సైతం బయటపెట్టారు. ఇందులో అమెరికన్‌ అధికారులు సైతం ఉన్నారు. దీనిపై ఎన్నో డాక్యుమెంటరీలు, సినిమాలు సైతం వచ్చాయి. ఏరియా 51 అనేది అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రహస్య ప్రాంతంగా అమెరికన్‌ అధికారులు పేర్కొంటున్నారు. Area 51ని మిలటరీ టెస్ట్‌ సెంటర్‌, ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ సెంటర్‌గా చెబుతారు. అయితే, ఇక్కడ ఇతర గ్రహాల జీవులపై రహస్య పరిశోధనలు జరుగతాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. వాస్తవానికి 1967లో ఏరియా 51 గురించి ప్రజలకు తెలిసింది. సీఐఏ డైరెక్టర్‌ మెమో లీక్‌ అయిన సందర్భంలో ఏరియా 51 గురించి ప్రస్తావన ఉంది. అమెరికా ప్రభుత్వం దీన్ని రహస్యంగా ఉంచుతూ వచ్చింది. సాదాసీదా ప్రజలకు దీని గురించి ఎలాంటి విషయా తెలియవు. 2013లో సీఐఏ దీని గురించి అధికారిక ప్రకటన చేసింది.

నెవాడలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో..

ఏరియా 51ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడ ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. గతంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌ యూ-2 నిఘా విమానాలను పరీక్షించారు. ఆ తర్వాత నుంచి పలు రహస్య ఫైటర్‌ జెట్ల పనితీరును కూడా ఇక్కడ అంచనా వేశారు. గతంలో ఇక్కడ శాటిలైట్‌ ఏమేజ్‌లు తీయడం నిషేధం ఉండేది. దాన్ని ప్రస్తుతం తొలగించారు. ఈ స్థావరం చుట్టూ మోషన్‌ సెన్సార్లు అమర్చి ఉంటాయి. గస్తీ బృందాలు ఎప్పుడూ పహారా కాస్తుంటాయి. సందర్శకులను హెచ్చరిస్తూ పలుచోట్ల బోర్డులు దర్శనమిస్తుంటాయి. న్లో ఫ్లయింగ్‌ జోన్‌, కొన్ని మార్గాల్లో ప్రయాణం నిషేధం అమలులో ఉంటుంది. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి వాటితో ఏరియా 51కు బలమైన సంబంధాలున్నాయని చాలా మంది నమ్ముతుంటారు.

తొలిసారిగా 1947లో చర్చ..

1947లో న్యూ మెక్సికోలోని రోస్‌వెల్ వద్ద అనుమానాస్పద వస్తువు కూలిపోయింది. ఇందులో అందులో గ్రహాంతర జీవులు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే, అమెరికా ప్రభుత్వం కూలిపోయింది వాతావరణ బెలూన్‌ మాత్రమేనని ప్రకటించింది. అయితే, రోస్‌వెల్‌, దానికి సమీపంలో యూఎఫ్‌వోలు కనపడినట్లుగా పలువురు పేర్కొన్నారు. మరికొందరు గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చారని, ఇక్కడ పరిశోధనలు చేస్తున్నట్లుగా ఆరోపించారు. 1989లో రాబర్ట్ లాజర్ అనే వ్యక్తి అతను ఏరియా 51 లోపల గ్రహాంతరవాసుల సాంకేతికతపై పనిచేశానని వెల్లడించాడు. అతను గ్రహాంతరవాసుల వైద్య ఛాయాచిత్రాలను పరిశీలించారని, యూఎఫ్‌వోలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ఫెలిసిలిటీని ఉపయోగించినట్లు పేర్కొనడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.

యూఎఫ్‌వోల ఉనికి..

వాస్తవానికి గతంలో చాలామంది తాము యూఎఫ్‌వోలను చూశామని వెల్లడించారు. 1947లోనే యూఎఫ్‌వోల ఉనికిపై వార్తలు వచ్చాయి. అయితే, గ్రహాంతర జీవులు ఉన్నారనేందుకు మాత్రం ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. భూమిలాంటి పరిస్థితులు సౌర కుటుంబానికి ఆవల ఉండే గ్రహాల్లో కనిపిస్తే అక్కడ జీవ ఆవిర్భావానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఖగోళశాస్త్రంపై ముఖ్యంగా బ్లాక్‌హోల్స్‌పై పుస్తకాలు రాసిన స్టీఫెన్‌హాకింగ్స్‌ సైతం గ్రహాంతరవాసులు ఉండొచ్చని తెలిపారు. అమెరికాలో 1947 నుంచి పలుమార్లు నేవీ, వైమానిక దళాలు సైతం యూఎఫ్‌వోలను చూశామని చెప్పినా 2019 నుంచి జరిగిన ఘటనలను మాత్రమే పెంటగాన్‌ నిర్ధారిస్తూ వచ్చింది. 2019లో పెంటగాన్‌ యూఎఫ్‌వోలకు సంబంధించిన మూడు వీడియోలను విడుదల చేసింది. 2019లో కెనడా పరిశోధకులు భారీ టెలిస్కోప్‌తో 13-ఫాస్ట్‌ రేడియో బస్టర్‌ తరంగాలు తరచూ భూమికి రావడాన్ని గుర్తించారు. 150 కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి వస్తున్నట్లు నిర్ధారించారు. గ్రహాంతర జీవులు గురించి నాసాకు సైతం తెలుసని.. అయినా ఈ విషయాన్ని గోఫ్యంగా ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. ట్రంప్‌ తాజా ప్రకటనతో గ్రహాంతర జీవుల ఉనికి.. ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న ఏరియా 51 గురించి కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement