త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cooperative Societies | స‌హ‌కార సంఘాల్లో నామినేటెడ్ విధానం ఎందుకు?: కాంగ్రెస్ నిర్ణ‌యాన్ని ఖండించిన ప్ర‌తినిధులు

Cooperative Societies | ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గాలను తొలగించి నామినేటెడ్ విధానాన్ని (Nominated System) తీసుకురావాల్సిన అవసరం ఏముందని స‌హ‌కార సంఘాల ప్ర‌తినిధులు కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

S

News | Published On Apr 30, 2026, 1.09 pm IST

Cooperative Societies | స‌హ‌కార సంఘాల్లో నామినేటెడ్ విధానం ఎందుకు?: కాంగ్రెస్ నిర్ణ‌యాన్ని ఖండించిన ప్ర‌తినిధులు
Advertisement
  • జీవో 597 ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
  • హైకోర్టు తీర్పును అమ‌లు చేయాలి
  • నాలుగు నెల‌లుగా కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం చేస్తోంది
  • ఈ ధ‌రోణిని తీవ్రంగా ఖండిస్తున్నం
  • మీడియాతో స‌హ‌కార సంఘాల రాష్ట్ర ప్ర‌తినిధులు

త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గాలను తొలగించి నామినేటెడ్ విధానాన్ని (Nominated System) తీసుకురావాల్సిన అవసరం ఏముందని స‌హ‌కార సంఘాల ప్ర‌తినిధులు కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ద్వారా పాలక వర్గాలను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

సహకార సంఘాల పాలక వర్గాల రద్దుపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. గత పాలక వర్గాలను తిరిగి కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే నాలుగు నెలలుగా ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. నామినేటెడ్ విధానాన్ని తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ‌న్నారు.

అక్క‌డ ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించాలి..

ఈ సందర్భంగా కొండూరు రవీందర్ రావు (Konduri Ravindar Rao) మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 330 సహకార సంఘాలు కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఈ సంఘాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా ప్రధానంగా రైతులే సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సభ్యులతో 60 వేల కోట్ల రూపాయల వ్యాపారం ఈ వ్యవస్థతో నడుస్తోందని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగిన చోటనే ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. కానీ మొత్తం వ్యవస్థను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని తీసుకురావడం సరైంది కాదన్నారు.

వెంట‌నే ఎన్నికలు నిర్వ‌హించాలి...

ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే అప్పటి వరకు గత పాలక వర్గాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. సహకార సంఘాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రస్తుతం రైతులు పంట కొనుగోళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘ సభ్యులు రైతులకు అండగా నిలవాలి అని వారు పిలుపునిచ్చారు.

కేసీఆర్ హ‌యాంలో పూర్తి స్వేచ్ఛ‌..

దివంగ‌త మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రొఫెషనల్ బ్యాంకర్లకు సహకార వ్యవస్థలో అవకాశం కల్పించారని చెప్పారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థ బలోపేతానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకార వ్యవస్థకు స్వతంత్రత కల్పించాల‌ని కోరారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు (TSCAB) మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావుతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు ఆశోక్, మంజులా రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, రాజేందర్, పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement