త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

త్రీ లైన్‌ విప్‌ అంటే ఏమిటి? దాన్ని ధిక్కరిస్తే ఎంపీ పదవి పోతుందా?

త్రీ లైన్ విప్ ను ధిక్కరించి ఎంపీ పదవులు కోల్పోయిన వారున్నారు. అసలు త్రీ లైన్‌ విప్‌కు అంతటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం ఏం చెబుతోంది? Defying a three-line whip can cost an MP their parliamentary seat. Explore the constitutional rules, consequences of whip violations and historical cases of MPs losing their membership.

C

News | Published On Nov 27, 2026, 4.08 pm IST

త్రీ లైన్‌ విప్‌ అంటే ఏమిటి? దాన్ని ధిక్కరిస్తే ఎంపీ పదవి పోతుందా?

పార్లమెంట్‌ సమావేశాల్లో లోక్‌సభ దృశ్యం.. త్రీ లైన్‌ విప్‌, ఎంపీల అనర్హతపై రాజ్యాంగ నిబంధనల విశ్లేషణ.

సంక్షిప్త సారాంశం

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల అంశాల నేపథ్యంలో త్రీ లైన్‌ విప్‌ తెరపైకి వచ్చింది. విప్‌ జారీకి పార్టీలకు ఉండాల్సిన అర్హతలేమిటి? ధిక్కరిస్తే ఎంపీ పదవి పోతుందా? మందా జగన్నాథం సహా గతంలో పదవులు కోల్పోయిన ఎంపీల ఉదంతాలు, త్రినేత్ర న్యూస్‌ మీ కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం. What is a three-line whip in Parliament? Can MPs lose their seats for defying party orders? Trinetra News explains the constitutional provisions, the Anti-Defection Law, the 15-day exemption rule and historical cases of MP disqualification, including that of former Nagarkurnool MP Manda Jagannatham

Advertisement

త్రీ లైన్‌ విప్‌ అంటే ఏమిటి? దాన్ని ధిక్కరిస్తే ఎంపీ పదవి పోతుందా?

  •  బిల్లుల వేళ పార్టీల చేతిలో కీలకమైన అస్త్రం

  • వ్యతిరేకంగా ఓటేసినా.. ఓటింగ్‌కు దూరంగా ఉన్నా అనర్హతకు అవకాశం

  • విప్‌ను ధిక్కరించిన సభ్యులకు 15 రోజుల వెసులుబాటు

  • పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎంపీ పదవి పోతుందా?

  • గతంలో విప్‌ను ధిక్కరించి పదవులు కోల్పోయిన ఎంపీలు ఎవరు?

త్రినేత్ర న్యూస్‌ ప్రత్యేక కథనం: డీలిమిటేషన్‌ (Delimitation), మహిళా రిజర్వేషన్ల (Women Reservation) వంటి రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు జారీ చేసే త్రీ లైన్‌ విప్‌పై ఆసక్తి నెలకొంటుంది. అసలు త్రీ లైన్‌ విప్‌ (Three-Line Whip) అంటే ఏమిటి? పార్టీ ఆదేశాలను కాదని ఓటేస్తే పదవినే కోల్పోయే ప్రమాదం ఉంటుందా? విప్‌ ఉల్లంఘనపై భారత రాజ్యాంగం (Indian Constitution) ఏం చెబుతోంది? గతంలో విప్‌ను ధిక్కరించిన ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తెలుసుకుందాం. A comprehensive explainer on the three-line whip, its constitutional significance and the consequences of defying party orders in Indian Parliament.

నవంబర్‌ 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. తెరపైకి త్రీ లైన్‌ విప్‌

రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చ, ఓటింగ్ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబరు 30 నుంచి 4 రోజుల పాటు జరగనున్నాయి.  నవంబర్‌ 30న లోక్‌సభ, డిసెంబర్‌ 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)  గురువారం (2026 నవంబరు 26న) విషయాన్ని వెల్లడించారు. డీలిమిటేషన్‌తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం మరోసారి తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP-SP) తన ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేక సమావేశాలకు సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించింది. అయితే బిల్లుపై ఏ విధంగా ఓటు వేయాలనే విషయంలో పార్టీ తుది వైఖరి ఇంకా స్పష్టం కాలేదు.

విప్‌ అంటే ఏమిటి?

పార్లమెంట్‌లో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలో, ఏ బిల్లుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటేయాలో నిర్దేశిస్తూ రాజకీయ పార్టీలు జారీ చేసే ఆదేశాలను విప్‌ (Whip) అంటారు. పార్టీ తరఫున ఈ ఆదేశాలు జారీ చేసే వ్యక్తిని కూడా విప్‌గా వ్యవహరిస్తారు. ఈ వ్యవస్థ బ్రిటిష్‌ పార్లమెంటరీ సంప్రదాయం నుంచి వచ్చింది. సభలో జరిగే చర్చలు, కీలక బిల్లులు, ఓటింగ్‌ వంటి సందర్భాల్లో పార్టీ సభ్యుల మధ్య సమన్వయం కుదర్చడం చీఫ్‌ విప్‌ (Chief Whip) ప్రధాన బాధ్యత. పార్టీ జారీ చేసే ఆదేశాల ప్రాధాన్యాన్ని బట్టి సాధారణంగా విప్‌లను మూడు రకాలుగా వ్యవహరిస్తారు.

  • వన్‌ లైన్‌ విప్‌ (One-Line Whip): సభలో ముఖ్యమైన కార్యక్రమం లేదా ఓటింగ్‌ ఉన్నదని సభ్యులకు సమాచారం ఇవ్వడం.

  • టూ లైన్‌ విప్‌ (Two-Line Whip): సభ్యులు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని నిర్దేశించడం.

  • త్రీ లైన్‌ విప్‌ (Three-Line Whip): సభ్యులకు జారీ చేసే అత్యంత కఠినమైన ఆదేశం. సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, నిర్దేశించిన మేరకు ఓటింగ్‌లో వ్యవహరించాలని ఆదేశించడం.

ఈ మూడు రకాల విప్‌లకు రాజ్యాంగంలో ప్రత్యేక నిర్వచనాలు లేవు. ఇవి పార్లమెంటరీ సంప్రదాయంలో భాగం. విప్‌లో పేర్కొన్న నిర్దిష్ట ఆదేశాలే చట్టపరంగా కీలకం.

విప్‌ జారీ చేసే అధికారం అసలు ఎవరిది?

విప్‌ను నియమించే అధికారం రాజకీయ పార్టీకే ఉంటుంది. సభలోని ఎమ్మెల్యేలు లేదా ఎంపీలతో కూడిన లెజిస్లేచర్‌ పార్టీకి మెజారిటీ ఉన్నంత మాత్రాన ఆ సభ్యులు తమంతట తాముగా విప్‌ను నియమించుకోలేరని 2023 మే 11న సుభాష్‌ దేశాయ్‌ కేసులో (Subhash Desai v. Principal Secretary, Governor of Maharashtra) ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజకీయ పార్టీ లేదా అది అధికారం కల్పించిన వ్యక్తి జారీ చేసే ఆదేశాలే విప్ కు అర్హత కల్పిస్తాయని స్పష్టం చేసింది.

త్రీ లైన్‌ విప్‌ ధిక్కరిస్తే..

పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(b) ప్రకారం రాజకీయ పార్టీ జారీ చేసిన చట్టబద్ధమైన ఓటింగ్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా, ఆదేశాలకు విరుద్ధంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా సభ్యత్వంపై అనర్హత వేటు (Disqualification) పడవచ్చు. దేశంలో రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని (Anti-Defection Law) తీసుకొచ్చారు. రాజ్యాంగంలో పదో షెడ్యూల్‌ను చేర్చారు. పార్లమెంట్‌ సభ్యులకు ఆర్టికల్‌ 102(2), రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఆర్టికల్‌ 191(2) వర్తిస్తాయి.

వ్యతిరేకంగా ఓటేయకున్నా.. సభకు రాకపోతే వేటు పడుతుందా?

ఒక కీలక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసిందనుకుందాం. ఆ ఎంపీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే కాదు.. అనుమతి లేకుండా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది.

 

విప్ పాటిస్తే/ఉల్లంఘిస్తే తీసుకునే చర్య
                             పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఓటేస్తే ఏ చర్యా ఉండదు
                             పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హతకు అవకాశం ఉంటుంది
                           అనుమతి లేకుండా ఓటింగ్‌కు గైర్హాజరైతే అనర్హతకు అవకాశం ఉంటుంది
                         సభలో ఉండి ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయకపోతే అనర్హతకు అవకాశం ఉంటుంది
                           ముందుగానే పార్టీ అనుమతి తీసుకుంటే ఏ చర్యా ఉండదు
                             15 రోజుల్లో పార్టీ క్షమిస్తే ఏ చర్యా ఉండదు

 

అయితే ఓటింగ్‌ జరగని సమయంలో కేవలం సభకు హాజరుకాకపోతే పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(b) కింద అనర్హత విధించలేరు. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు మాత్రం తీసుకోవచ్చు.

పార్టీ క్షమిస్తే.. అనర్హత ఉండదు 

విప్‌ను ఉల్లంఘించిన ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా పదవి కోల్పోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్‌లో పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించేందుకు ముందస్తు అనుమతి పొందవచ్చు. ఒకవేళ ముందస్తు అనుమతి లేకుండా విప్‌ను ధిక్కరించినా, ఓటింగ్‌ జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా పార్టీ లేదా సభ్యుడిని క్షమించి వదిలేయవచ్చు.  దీనిని కాండొనేషన్‌ (Condonation) అంటారు. ఈ వెసులుబాటును రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కల్పించింది.

పార్టీ బహిష్కరిస్తే ఎంపీ పదవి పోయినట్టేనా?

రాజకీయ పార్టీకి తన సభ్యుడిని పార్టీ నుంచి బహిష్కరించే అధికారం ఉండవచ్చు. కానీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం పార్టీకి లేదు. లోక్‌సభ సభ్యుడి అనర్హతపై స్పీకర్‌ (Lok Sabha Speaker), రాజ్యసభ సభ్యుడి అనర్హతపై చైర్మన్‌ (Rajya Sabha Chairman) నిర్ణయం తీసుకుంటారు. విప్‌ ఉల్లంఘనకు సంబంధించి అనర్హత పిటిషన్‌ (Disqualification Petition) దాఖలైతే సంబంధిత సభ్యుడి వివరణ తీసుకొని, వర్తించే నిబంధనల మేరకు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు.

2008లో మన్మోహన్‌ సర్కార్‌ విశ్వాస పరీక్ష.. 8 మంది ఎంపీలపై బీజేపీ వేటు!

అమెరికాతో పౌర అణు ఒప్పందం (India-US Civil Nuclear Deal) విషయంలో విభేదాల కారణంగా 2008లో మన్మోహన్‌సింగ్‌ (Manmohan Singh) నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి.

దీంతో జూలై 22న లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ప్రభుత్వానికి అనుకూలంగా 275 ఓట్లు, వ్యతిరేకంగా 256 ఓట్లు వచ్చాయి. దీంతో మన్మోహన్‌ ప్రభుత్వం గట్టెక్కింది.

అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న బీజేపీ ఆదేశాలను పలువురు ఎంపీలు ధిక్కరించారు. కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయగా, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజే బీజేపీ ఎనిమిది మంది ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించింది.

విప్‌ను ధిక్కరించి ఎంపీ పదవులు పోగొట్టుకున్నారు!

హెచ్‌టీ సాంగ్లియానా (H.T. Sangliana)

కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర నియోజకవర్గం (Bangalore North) నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన సాంగ్లియానా పార్టీ విప్‌ను ధిక్కరించి యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. పార్టీ ఆయనను బహిష్కరించింది. అనంతరం 2008 అక్టోబర్‌లో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ ఆయనపై అనర్హత వేటు వేశారు.

రామ్‌స్వరూప్‌ ప్రసాద్‌ (Ram Swarup Prasad)

బీహార్‌లోని నలంద నియోజకవర్గం (Nalanda) నుంచి జేడీయూ (JD-U) తరఫున ఎన్నికైన ఆయన కూడా పార్టీ ఆదేశాలను ధిక్కరించి మన్మోహన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. సాంగ్లియానాతోపాటు ఆయనపైనా స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. ఇద్దరూ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. పార్లమెంట్‌ అధికారిక జర్నల్‌ ప్రకారం ఈ అనర్హత నిర్ణయాలు అక్టోబర్‌ 3న తీసుకున్నారు.

మందా జగన్నాథం 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం (Nagarkurnool Lok Sabha Constituency) నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన మందా జగన్నాథం (Manda Jagannath) కూడా 2008 విశ్వాస పరీక్షలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతొ  తెలుగుదేశం పార్టీ ఆయనను బహిష్కరించింది. అంతటితో ఆగలేదు. 2008 డిసెంబర్‌ 15న లోక్‌సభ స్పీకర్‌ ఆయనపై పదో షెడ్యూల్‌ కింద అనర్హత వేటు వేశారు.

లోక్‌సభ స్పీకర్‌కు విప్‌ నుంచి మినహాయింపు.. సోమ్‌నాథ్‌ ఛటర్జీ ఉదంతం!

2008 విశ్వాస పరీక్ష సమయంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మన్మోహన్‌ ప్రభుత్వానికి సీపీఎం (CPI-M) మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభ స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలని సోమ్‌నాథ్‌ ఛటర్జీని (Somnath Chatterjee) పార్టీ కోరింది. అయితే స్పీకర్‌ పదవి పార్టీ రాజకీయాలకు అతీతమైనదని భావించిన ఛటర్జీ రాజీనామా చేసేందుకు నిరాకరించారు. దీంతో జూలై 23న సీపీఎం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ ఆయన స్పీకర్‌గా పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగారు. విశ్వాస పరీక్ష సందర్భంగా సీపీఎం తన ఎంపీలకు జారీ చేసిన త్రీ లైన్‌ విప్‌ నుంచి సోమ్‌నాథ్‌ ఛటర్జీని మినహాయించింది.

విప్‌ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు 

సంబంధిత రాజకీయ పార్టీ నియమావళిని బట్టి విప్‌ ఉల్లంఘనకు పాల్పడిన సభ్యులపై పలు రకాల క్రమశిక్షణ చర్యలు (Disciplinary Action) తీసుకోవచ్చు. షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ తీసుకోవచ్చు. ఆ తర్వాత వారి వివరణతో సంతృప్తి చెందకపోతే పార్టీ పదవుల నుంచి తొలగించవచ్చు. సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేయవచ్చు. పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్‌ను కూడా నిరాకరించవచ్చు. అయితే కేవలం విప్‌ను ధిక్కరించడం నేరం కాదు. దానికోసం జైలు శిక్ష లేదా క్రిమినల్‌ కేసు ఉండదు.

స్పీకర్‌ వేటు వేస్తే కోర్టుకు వెళ్లవచ్చా?

రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినా, దురుద్దేశంతో నిర్ణయం తీసుకున్నా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.అనర్హతకు దారితీసే విప్‌ల పరిధిపై కూడా న్యాయస్థానాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. ప్రభుత్వం మనుగడకు సంబంధించిన అంశాలు, ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన ప్రధాన విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన ఓటింగ్‌ ఆదేశాల ప్రాధాన్యాన్ని వివరించాయి. 1992లో కిహోటో హోలోహన్‌ వర్సెస్‌ జాచిల్హు (Kihoto Hollohan v. Zachillhu) కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూనే, అనర్హత విషయంలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు (Judicial Review) లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

విప్‌ను ధిక్కరించిన ఎంపీ ఓటు చెల్లుతుందా?

పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన వ్యక్తి తన సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఆయన వేసిన ఓటు కేవలం విప్‌ ఉల్లంఘన కారణంగానే చెల్లకుండా పోదు. ఓటింగ్ లో ఆ ఓటును పరిగణిస్తారు. ఆ తర్వాత పార్టీ చర్యలు తీసుకుంటుంది. 2008లో మన్మోహన్‌ ప్రభుత్వ విశ్వాస పరీక్ష దీనికి మంచి ఉదాహరణ. పార్టీ ఆదేశాలను ధిక్కరించి వేసిన ఓట్లు కూడా విశ్వాస పరీక్ష లో పరిగణించారు. ఆ తర్వాతే కొందరు సభ్యులపై అనర్హత వేటు పడింది.

మూడింట రెండొంతుల మంది విప్‌ను ధిక్కరిస్తే వేటు పడదా?

పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది సభ్యులు ఒకేసారి తిరుగుబాటు చేస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే అది సరైనది కాదు. పదో షెడ్యూల్‌లోని పేరా 4లో పార్టీల విలీనానికి (Political Party Merger) సంబంధించిన మినహాయింపు ఉంది. సంబంధిత లెజిస్లేచర్‌ పార్టీలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యుల అంగీకారంతోపాటు విలీనానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు నెరవేరాలి. 2003లో చేసిన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో మూడో వంతు సభ్యుల చీలికకు ఉన్న మినహాయింపును తొలగించారు. కేవలం మూడింట రెండొంతుల మంది సభ్యులు కలిసి విప్‌ను ధిక్కరించినంత మాత్రాన అనర్హత నుంచి రక్షణ లభించదు.

రాజ్యాంగ సవరణ బిల్లుల వేళ త్రీ లైన్‌ విప్‌ ఎందుకంత కీలకం?

రాజ్యాంగ సవరణ బిల్లులను (Constitutional Amendment Bills) ఆమోదించేందుకు సాధారణ మెజారిటీ సరిపోదు. ఆర్టికల్‌ 368 ప్రకారం ప్రత్యేక మెజారిటీ (Special Majority) అవసరం.

ఇందుకు రెండు నిబంధనలు వర్తిస్తాయి. సభ మొత్తం సభ్యత్వంలో సగానికి మించిన సంఖ్య మద్దతు ఉండాలి. అదే సమయంలో సభలో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు ఉండాలి.

ఉదాహరణకు 543 మంది సభ్యత్వం కలిగిన లోక్‌సభలో రాజ్యాంగ సవరణకు కనీసం 272 మంది మద్దతు తప్పనిసరి. సభ్యులందరూ ఓటింగ్‌లో పాల్గొంటే 362 మంది అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

 

లోక్ సభలో
సభ్యుల హాజరు
బిల్లు ఆమోదానికి
అవసరమైన ఓట్లు
                       543                 362
                       540                 360
                       525                 350
                       510                 340
                       500                 334
                       480                 320
                       450                 300
                       400                 272

 

ఈ ప్రత్యేక మెజారిటీని పార్లమెంట్‌ ఉభయ సభల్లో విడివిడిగా సాధించాల్సి ఉంటుంది. కొన్ని రకాల రాజ్యాంగ సవరణలకు కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా అవసరం.

ఇలాంటి సందర్భాల్లో ఎంపీల హాజరు అత్యంత కీలకంగా మారుతుంది. కొందరు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరైనా, ఓటింగ్‌లో తటస్థంగా ఉన్నా అవసరమైన ప్రత్యేక మెజారిటీ లెక్కలు మారవచ్చు. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక బిల్లుల సందర్భంగా త్రీ లైన్‌ విప్‌ జారీ చేస్తుంటాయి.

రాష్ట్రపతి, రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ ధిక్కరిస్తే అనర్హత ఉంటుందా?

పార్లమెంట్‌లో బిల్లులపై జరిగే ఓటింగ్‌కు, రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) జరిగే ఓటింగ్‌కు తేడా ఉంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో జరిగే ఓటింగ్‌కు పదో షెడ్యూల్‌లోని విప్‌ ఉల్లంఘన నిబంధన అదే విధంగా వర్తించదు. ఈ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓటు వేసినందుకు మాత్రమే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యత్వాన్ని రద్దు చేయలేరు.

అయితే చట్టబద్ధంగా అనుమతించే పార్టీ అంతర్గత క్రమశిక్షణ చర్యలు వేరుగా ఉండవచ్చు.

త్రీ లైన్‌ విప్‌ అంటే ఏమిటి?

సభకు తప్పనిసరిగా హాజరై పార్టీ నిర్దేశించిన విధంగా ఓటింగ్‌లో వ్యవహరించాలని రాజకీయ పార్టీ జారీ చేసే కఠినమైన ఆదేశం.

ఒక్క ఎంపీ ఉన్న పార్టీ కూడా విప్‌ జారీ చేయవచ్చా?

అవును. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కనీస సభ్యుల సంఖ్యను నిర్దేశించలేదు.

విప్‌ను ధిక్కరిస్తే ఎంపీ పదవి పోతుందా?

చట్టబద్ధమైన ఓటింగ్‌ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హత వేటు పడవచ్చు. అయితే సభ్యత్వం తక్షణమే రద్దు కాదు.

విప్‌ను ధిక్కరించిన సభ్యుడిని పార్టీ క్షమించవచ్చా?

అవును. ఓటింగ్‌ జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా ఆ ఉల్లంఘనను పార్టీ క్షమించవచ్చు.

విప్‌ను ధిక్కరించిన ఎంపీ వేసిన ఓటు చెల్లుతుందా?

కేవలం విప్‌ ఉల్లంఘన కారణంగా ఆ ఓటు చెల్లకుండా పోదు.

ఎంపీలపై అనర్హత వేటు వేసే అధికారం ఎవరిది?

లోక్‌సభ సభ్యుల విషయంలో స్పీకర్‌కు, రాజ్యసభ సభ్యుల విషయంలో చైర్మన్‌కు ఉంటుంది.

Advertisement
Advertisement