త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament | మహిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేషన్‌ బిల్లులపై డిసెంబర్‌ 1న ఓటింగ్‌..!

Parliament | మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లులపై పార్లమెంట్‌లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రెండు బిల్లులపై లోక్‌సభలో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. అవసరమైతే చర్చా సమయాన్ని మరింత పొడిగించనున్నారు.

P

National | Published On Nov 27, 2026, 8.13 pm IST

Parliament | మహిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేషన్‌ బిల్లులపై డిసెంబర్‌ 1న ఓటింగ్‌..!
Advertisement
  • లోక్‌సభలో 12 గంటల పాటు వాడీవేడిగా చర్చ 
  • అవసరమైతే చర్చా సమయం పొడిగింపు ఛాన్స్‌
  • నవంబర్‌ 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు
  • 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కేంద్రం కొత్త ప్రతిపాదనలు

Parliament | మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లులపై పార్లమెంట్‌లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రెండు బిల్లులపై లోక్‌సభలో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. అవసరమైతే చర్చా సమయాన్ని మరింత పొడిగించనున్నారు. అనంతరం డిసెంబర్‌ 1న సాయంత్రం ఓటింగ్‌ నిర్వహించనున్నట్లు జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఓటింగ్‌ ప్రక్రియ కూడా సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండనుంది. ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రానికి ఉభయ సభల్లో అవసరమైన మద్దతు కూడగట్టడం కీలకం కానుంది.

నవంబర్‌ 30 నుంచి ప్రత్యేక సమావేశాలు

మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు డీలిమిటేషన్‌ చేపట్టేందుకు కేంద్రం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై చర్చించేందుకు నవంబర్‌ 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్ర‌వారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లు, 2026కు ఆమోదం లభించింది. లోక్‌సభ సమావేశాలు నవంబర్‌ 30న ప్రారంభం కాగా, రాజ్యసభ డిసెంబర్‌ 2 నుంచి సమావేశం కానుంది. డిసెంబర్‌ 3 వరకు ప్రత్యేక భేటీ కొనసాగే అవకాశం ఉంది.

50 శాతం పెరగనున్న లోక్‌సభ స్థానాలు?

కొత్త ప్రతిపాదనల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీంతో లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850కి చేరే అవకాశం ఛాన్స్ ఉన్న‌ది. పెరిగిన స్థానాలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తిని 2051 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా మార్పులు చేసే వరకు, అంటే మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని ప్రతిపాదించినట్లు నివేదికలు వెల్లడించాయి.

మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం

రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి సాధారణ మెజారిటీ సరిపోదు. లోక్‌సభ, రాజ్యసభల్లో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలి. అంతేకాకుండా సభ మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి పైగా మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి అధికార పక్షానికి విపక్షాల మద్దతు కీలకం కానుంది. గత ఏప్రిల్‌లో ఇదే తరహా రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మద్దతు లభించకపోవడంతో కేంద్రం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్‌ కోరుతోంది. మహిళా కోటా అమలుకు నియోజకవర్గాల పునర్విభజనను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

డీలిమిటేషన్‌ కారణంగా జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్య వాటాపై స్పష్టత కోరుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకే కూడా ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న ప్రతిపాదనతో ఈ ఆందోళనలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపు, రాష్ట్రాల ప్రాతినిధ్యంపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిసెంబర్‌ 1న జరగనున్న ఓటింగ్‌లో బిల్లుల భవితవ్యం తేలనుంది.

Advertisement