Hyderabad | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మూడు జిల్లాలుగా విభజించేందుకు తీవ్రమైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా, గందరగోళంగా ఉందని ఇటీవలే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ లోపాలను సరిదిద్దేందుకే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరాన్ని మూడు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. దీంతో జిల్లాల విభజనకు సంబంధించి భౌగోళిక దూరాలు, ప్రజల వినతులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించింది. ఈ క్రమంలో పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడి జిల్లాల స్వరూపాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భౌగోళిక అసమానతలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా చిన్నదిగా ఉండగా, మిగిలిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు చాలా విశాలంగా ఉన్నాయి. దీనికి తోడు.. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో, జీహెచ్ఎంసీ ఇప్పుడు 'మెగా హైదరాబాద్'గా మారింది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని కలుపుకొని.. మొత్తం మెగా హైదరాబాద్‌ను 3 సమాన స్థాయి జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ మార్పుల వల్ల ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతలు, మున్సిపల్ సేవలను మెరుగ్గా అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే, కేంద్రం చేపట్టబోయే జనగణన కోసం జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను అధికారులు డిసెంబర్ 31నే ఖరారు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం లేదా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు తలెత్తవచ్చని అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనుంది.