త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jatara | మేడారం జాత‌ర‌లో నేడు కీల‌క ఘ‌ట్టం.. గ‌ద్దెపైకి స‌మ్మ‌క్క త‌ల్లి

Medaram Jatara | దేశంలో అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌, తెలంగాణ కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర‌లో (Medaram Jatara) మ‌రో కీల‌క ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఎదురుచూస్తున్న స‌మ‌యం రానేవ‌చ్చింది. సార‌ల‌మ్మ బుధ‌వారం గద్దెపైకి చేరుకోగా.. మాఘ‌శుద్ధ పున్న‌మి వెలుగుల్లో స‌మ్మ‌క్క (Sammakka Saralamma) గద్దెనెక్కనున్నారు.

G

News | Published On Jan 29, 2026, 11.49 am IST

Medaram Jatara | మేడారం జాత‌ర‌లో నేడు కీల‌క ఘ‌ట్టం.. గ‌ద్దెపైకి స‌మ్మ‌క్క త‌ల్లి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌, తెలంగాణ కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర‌లో (Medaram Jatara) మ‌రో కీల‌క ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఎదురుచూస్తున్న స‌మ‌యం రానేవ‌చ్చింది. సార‌ల‌మ్మ బుధ‌వారం గద్దెపైకి చేరుకోగా.. మాఘ‌శుద్ధ పున్న‌మి వెలుగుల్లో స‌మ్మ‌క్క (Sammakka Saralamma) గద్దెనెక్కనున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గురువారం రాత్రి గద్దెపైకి తీసుకొచ్చి ప్ర‌తిష్ఠిస్తారు.

సార‌ల‌మ్మ‌ను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా, సంమ్మ‌క్క‌ను సిద్ద‌బోయిన వంశీయుల చేతుల మీదుగా గ‌ద్దెల‌పైకి తీసుకొస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో చందా వంశీయులు, ఐదు వంశ‌స్తులు, మేడారం గ్రామ‌ప్ర‌జ‌ల‌తోపాటు ఆదివాసీలు పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్ర‌దాయాల న‌డుమ స‌మ్మ‌క్క‌ను ఊరేగింపుగా తీసుకొస్తారు. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క త‌ల్లి రాకతో జాతర పరిపూర్ణం కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వ‌న‌దేవ‌త‌ల‌ను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. శనివారం దేవతల వన ప్రవేశంతో రెండేండ్ల‌కు ఒక‌సారి జ‌రిగే ఈ మ‌హా జాతర ముగియ‌నుంది.

కాగా, ఉప‌ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం మేడారం రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాత‌ర‌కు చేరుకుంటారు. ఈ జాతర ఏర్పాట్లు, భక్తుల కోసం సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి కూడా వనదేవతలను దర్శించుకోనున్నారు.

మ‌రోవైపు స్థానిక మంత్రి సీత‌క్క మేడారంలోనే ఉండి జాత‌ర‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మ‌రో ఇంద్ద‌రు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కూడా గురువారం ఉదయం మేడారం జాత‌ర మొత్తం క‌లియ‌తిరిగారు. ఇద్ద‌రు కూడా బైక్‌ల‌పై ప‌ర్య‌టిస్తూ, భ‌క్తుల‌ను ప‌లుక‌రిస్తూ.. జాత‌ర ఏర్పాట్ల‌పై ఆరా తీశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement