త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆ 102 ఎక‌రాలు ప్ర‌భుత్వానివే

వ‌న‌స్థ‌లిపురం స‌మీపంలోని సాహెబ్‌న‌గ‌ర్ క‌లాన్ వ‌ద్ద ఉన్న 102 ఎక‌రాల భూమి విలువ దాదాపు ప‌దివేల కోట్ల‌కు పైగా ఉంటుంది. దానిపై సుప్రీం కోర్టులో వివాదం న‌డుస్తూ ఉన్న‌ది.

a

News | Published On Dec 18, 2025, 8.17 pm IST

ఆ 102 ఎక‌రాలు ప్ర‌భుత్వానివే
Advertisement

ఆ 102 ఎక‌రాలు ప్ర‌భుత్వానివే
సాహెబ్‌నగర్ కలాన్–గుర్రంగూడ అటవీ భూమిపై రాష్ట్రానికే హక్కుంది
సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు

త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లా సాహెబ్‌నగర్ కలాన్ గ్రామ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించిన కీలక కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ భూమిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరినే సమర్థిస్తూ, గతంలో ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులను కోర్టు రద్దు చేసిందని రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ రోహిత్ గోపిడి ఒక ప్రకటనలో తెలిపారు..

మూడు రోజుల పాటు సాగిన విచారణ అనంతరం, సర్వే నెం.201/1లో ఉన్న సుమారు 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమేనని, అది రాష్ట్రప్రభుత్వ అటవీ భూమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రైవేటు హక్కుల పేరిట దాఖలు చేసే దావాలు చట్టబద్ధంగా లేవని కూడా కోర్టు తేల్చిచెప్పింది.

అటవీ భూములు జాతీయ సంపదని ఈ సందర్భంగా కోర్టు మరోసారి గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48ఏ, 51ఏ(జి) ప్రకారం అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతని పేర్కొంది. అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఈ తీర్పుతో రిజర్వ్ ఫారెస్ట్ భూములను అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ హక్కుల నుంచి కాపాడే విషయంలో అటవీ శాఖకు మరింత బలం చేకూరింది. అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇది బలమైన మద్దతుగా నిలిచింది.

ఈ కేసులో రాష్ట్ర తరఫున సమర్థంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, జస్టిస్ (రిటైర్డ్) చల్ల కొడండరామ్, అదనపు సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ కర్ణం శ్రావణ్ కుమార్‌లకు అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ అటవీ అధికారులు, రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అనేక సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ కీలక తీర్పు సాధ్యమైందని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement