త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Adluri Laxman| సామాజిక న్యాయ స్ఫూర్తిని కేంద్రం విస్మరించింది

ప్రత్యేకంగా ఎస్సీ–ఎస్టీలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, గురుకులాలు, ఉపాధి పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలకు కేంద్రం నుంచి గట్టి మద్దతు లభిస్తుందని ఆశించామని, కానీ తాజా బడ్జెట్‌లో ఆ వర్గాల ఆశలన్నింటినీ నిరాశగా మార్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

a

News | Published On Feb 1, 2026, 9.29 pm IST

Minister Adluri Laxman| సామాజిక న్యాయ స్ఫూర్తిని కేంద్రం విస్మరించింది
Advertisement

ఎస్సీ–ఎస్టీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం

*కేంద్ర మొండివైఖరిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం*

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీ–ఎస్టీ సంక్షేమానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం సామాజిక న్యాయ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసినట్టేనని రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.

బడ్జెట్ మొత్తాన్ని పరిశీలిస్తే దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతిపై కేంద్ర ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి కూడా లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఉపాధి, విద్య, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వర్గాల భవిష్యత్తును పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇతర మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ అభివృద్ధి, సామాజిక సంక్షేమ అంశాలపై విన్నవించినా, కేంద్రం మాత్రం మొండివైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్రానికి కనీస స్పందన కూడా ఇవ్వకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ప్రత్యేకంగా ఎస్సీ–ఎస్టీలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, గురుకులాలు, ఉపాధి పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలకు కేంద్రం నుంచి గట్టి మద్దతు లభిస్తుందని ఆశించామని, కానీ తాజా బడ్జెట్‌లో ఆ వర్గాల ఆశలన్నింటినీ నిరాశగా మార్చారని అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని దళితులు, ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని హెచ్చరించారు. ఇది పేదల జీవన భద్రతను బలహీనపరిచే ప్రమాదకర విధానమని మంత్రి అడ్లూరి వ్యాఖ్యానించారు.

*తెలంగాణ రైజింగ్ – 2047పై కేంద్ర నిర్లక్ష్యం*

రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు. ఆ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని అర్బన్ కోర్ – పెరి అర్బన్ – గ్రామీణ తెలంగాణగా మూడు జోన్లుగా విభజించి సమాన, సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి టెక్నాలజీ, ఇన్నోవేషన్, R&D హబ్‌గా, పెరి అర్బన్ ప్రాంతాలను MSMEలు, లాజిస్టిక్ హబ్స్‌గా, గ్రామీణ తెలంగాణను సాంకేతిక వ్యవసాయం, హస్తకళ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాలకు కేంద్ర సహకారం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.

సెమీకండక్టర్ సిటీలు, ఎనర్జీ పార్కులు, ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లు, డ్రైపోర్టులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇందిరా మహిళా శక్తి మిషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

వ్యవసాయం, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, హరిత విద్యుత్తు వంటి రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తుంటే, ఆ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన బాధ్యతను విస్మరిస్తోందని అన్నారు.

కేంద్రం పై పోరాటం చేస్తాం
ఎస్సీ–ఎస్టీల హక్కులు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు ఉంచి ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ప్రశ్నిస్తామని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.

తెలంగాణకు జరుగుతున్న ఈ అన్యాయంపై మౌనం వహించబోమని, దళితులు–ఆదివాసీల భవిష్యత్తు కోసం అవసరమైతే మరింత తీవ్రమైన ఉద్యమాలకు కూడా సిద్ధమని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement