త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అర్హ‌త‌లే కొల‌మానం.. ప‌థ‌కాల్లో రాజ‌కీయాల‌కు తావివ్వం: పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రైతు డిక్ల‌రేష‌న్‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో అర్హ‌త‌లే కొల‌మాన‌మ‌ని, ఎటువంటి రాజ‌కీయాల‌కు తావుండ‌ద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరిగే అవసరం లేద‌న్నారు. ప్రజా దర్బార్ లో ఆయ‌న పాల్గొని విన‌తులు స్వీక‌రించి ప్ర‌సంగించారు.

S

News | Published On May 3, 2026, 5.35 pm IST

Ponguleti Srinivas Reddy |  అర్హ‌త‌లే కొల‌మానం.. ప‌థ‌కాల్లో రాజ‌కీయాల‌కు తావివ్వం: పొంగులేటి
Advertisement
  • రైతుల‌కు బేడీలు వేసిన చ‌రిత్ర బీఆర్ఎస్‌ది
  • కాంగ్రెస్ వారిని రాజులుగా చేసింది
  • రైతు డిక్ల‌రేష‌న్ హామీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు
  • ప్ర‌తిప‌క్షాలు అభివృద్ధిని చూసి క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకుంటున్నాయి
  • త్వరలోనే రెండో విడత 'ఇందిరమ్మ' ఇళ్ల మంజూరు
  • ప‌థ‌కాల్లో అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావుండ‌దు
  • మే 5, 6, 7 తేదీల్లో వరంగల్ లో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ
  • అధికారులే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కొచ్చి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
  • ప్ర‌జా ద‌ర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రైతు డిక్ల‌రేష‌న్‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో అర్హ‌త‌లే కొల‌మాన‌మ‌ని, ఎటువంటి రాజ‌కీయాల‌కు తావుండ‌ద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరిగే అవసరం లేద‌న్నారు. అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించడమే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (Praja Palana- Pragathi Pranalika) కార్యక్రమ లక్ష్యమ‌ని చెప్పారు. ఆదివారం కూసుమంచి(Kusumanchi)లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఆయ‌న పాల్గొని విన‌తులు స్వీక‌రించిన అనంత‌రం ప్ర‌సంగించారు.

రాజ‌కీయాల‌క‌తీతంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం..

99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను, ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజా దర్బార్ కార్యక్రమంలో తీసుకున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా తక్షణ చర్యలు చేపడుతున్నాం. ​పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్నఈ ప్రజా దర్బార్లలో అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును రాజకీయ పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తామని భరోసా కల్పించాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం ప్రజా ప్రభుత్వ బాధ్యత, ఇందులో ఎలాంటి జాప్యానికి తావులేదు అని పొంగులేటి చెప్పారు.

ఇందిర‌మ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తులే ఎక్కువ‌..

​ప్రజా దర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే పేదలకు ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో లబ్దిదారులను ఎంపిక చేసి, వారికి ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణ నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత ఇండ్లు సింహభాగం పూర్తయిన నేపథ్యంలో మే నెలాఖరు నుండి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కూడా అందిస్తాం. ప్రతిపక్షాలు ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల తీరును చూసి కళ్ల‌ల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి అని మంత్రి మండిప‌డ్డారు.

రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్, రైతులను రాజు చేసింది కాంగ్రెస్. ఎన్నికల వాగ్ధానంగా నాడు ఏఐసీసీ అగ్ర నాయకులు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ నుండి హామీలు ఇచ్చారు. వాటిని రైతన్నలకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రైతుపక్షపాతి ప్రభుత్వంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది.

రైత‌న్న‌ల మీద బీఆర్ఎస్‌ది క‌ప‌ట ప్రేమ‌..

వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నాం. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నాం. వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఇప్పటికే 25 లక్షల మందికి రుణమాఫీ చేశాం. రైతు భరోసాను ఎకరానికి 12 వేలకు పెంచి ఇస్తున్నాం. మద్ధతు ధర అడిగినందుకు రైతన్నలకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు రైతన్నల మీద కపట ప్రేమ వలకబోస్తున్నారు. గత ప్రభుత్వం 10 ఏండ్లు పాలించినప్ప‌టికీ రైతన్నలకు కనీసం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించలేదు అని శ్రీనివాస్‌రెడ్డి విమ‌ర్శించారు.

రేప‌టి నుంచి రైతు వారోత్స‌వాలు..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి రైతు వారోత్సవాలు నిర్వహిస్తూ మే 5, 6, 7 తేదీలలో వరంగల్ లో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రి సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement