త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌

RS Praveen Kumar | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు నోటీసులు పంపి, సాయి భగీరథ్ (Sai Bhagirath) ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయాల‌ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు.

S

News | Published On May 11, 2026, 5.48 pm IST

RS Praveen Kumar | బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌
Advertisement
  • అమిత్ షా, మోదీతో మాట్లాడి బండి సంజయ్ ను బ‌ర్తరఫ్ చేయాలి
  • ముఖ్యమంత్రి,హోం మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్
  • సీఎం రేవంత్‌ కేంద్ర ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డుతున్నారు
  • కేంద్ర‌మంత్రి బేటీ బచావో అని చెప్పి బేటా బచావో అమ‌లు చేస్తున్న‌డు
  • బండి సంజయ్ ఎ2, సంగప్ప ఎ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి
  • సంజ‌య్‌ను ప‌క్క‌న కూర్చోబెట్టుకున్న మోదీ క్ష‌మాప‌ణ చెప్పాలి
  • బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్‌

Lookout notices | త్రినేత్ర‌.న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు నోటీసులు పంపి, సాయి భగీరథ్ (Sai Bhagirath) ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయాల‌ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించాలన్నారు. సోమ‌వారం కాగజ్ నగర్ లోని ప్రాణ హిత నిలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

సాయి భగీరథ్ పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి, కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదని, నిందితునికే పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదని ప్ర‌శ్నించారు. బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని నిల‌దీశారు.

పోలీసులను వెంట‌నే స‌స్పెండ్ చేయాలి..

నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్, ఏసీపీలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ విష‌యంలో రాష్ట్ర డీజీపీకి విన్న‌విస్తున్నం. పోలీసులు సాయి భగీరథ్ పై ఉద్దేశ‌పూర్వ‌కంగా సెక్షన్ 11, 12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదు చేశారు. వాస్తవానికి సెక్షన్ 7, 8 ప్రకారం అతనిపై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట్టాలి. నిందితునిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలి.

సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు. నిందితున్ని ఎందుకు పట్టుకోవడం లేదు. బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీలకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలి. బండి సంజయ్ కూడా బాధిత కుటుంబాన్ని బెదిరించారు. ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉంటే కేసును ప్రభావితం చేస్తారు. అందుకే దేశ హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీతో మాట్లాడి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి బ‌ర్తరఫ్ చేయాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

త‌మ ప్రియ మిత్రుడు అని సంబోధించారు..

గతంలో V6 రిపోర్టర్ గా పనిచేసి, ఇపుడు బీజేపి అధికార ప్రతినిధిగా ఉన్న సంగప్ప కూడా బాధితులను తీసుకొచ్చి బండి సంజయ్ తో కలిపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే బండి సంజయ్ ఏ2, సంగప్ప ఏ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ప్రధాని కార్యక్రమంలో బండి సంజయ్ తమ ప్రియ మిత్రుడని చెప్పుకున్నారు. అందుకే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడం లేదు. హైదరాబాద్ లో మాజీ డీజీపీ భార్యను హత్య చేసినా అడిగే నాథుడే లేడు. తెలంగాణలో శాంతి భధ్రతలు ప్రమాదంలో ఉన్నాయి అని ప్ర‌వీణ్‌కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

భ‌గీర‌థ్‌ను కాపాడేందుకు రేవంత్ డ్రామాలు..

రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి కింద లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయి. ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదు. అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు విజిట్ చేయలేదు అని నిల‌దీశారు. బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు.. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారని ఆర్ఎస్పీ ఆరోపించారు.

కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాళ్లు ఏమ‌య్యారు?

రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. గృహ లక్ష్మి, మహా లక్ష్మి పేరుతో పథకాలు పెట్టి మహిళల గురించి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయడం లేదు. కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాళ్లు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదు అని ఆయ‌న ప్రశ్నించారు.

త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌వారిపై కేసులు పెట్టాలి..

శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. బాధిత అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉంది. కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయం తెలుసుకోవాలి. బీజేపీ సోషల్ మీడియాలో అమ్మాయి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదు. గతంలో జర్నలిస్ట్ రేవతిని అర్ధ‌రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసినట్టు, క్రిశాంక్ పై 35 కేసులు పెట్టినట్టు బీజేపీ కార్యకర్తలపై ఎందుకు పెట్టడం లేదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మాకు తెలుసన‌డం శుద్ధ అబ‌ద్దం..

సాయి భగీరథ్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేసులు పెట్టించారని బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది శుద్ధ అబ‌ద్దం. నిందితుడు మైనర్ అమ్మాయిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాతనే మాకు తెలిసింది. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి.

మ‌హిళ‌ల‌కు మోదీ ఇచ్చే గౌర‌వం ఇదేనా?

బీజేపీ అగ్రనాయకత్వం బేటీ బచావో అని చెప్పి, కేంద్ర మంత్రి బేటా బచావో అమలు చేస్తుంది. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మహిళలకు మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఫైర‌య్యారు. బండి సంజయ్ నిన్నటి సభలో ఏబీవీపీ, యువ మోర్చా, బీజేపీలో పని చేశానని కన్నీరు పెట్టుకుంటూ డ్రామాలు చేశారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలి. గత మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుంది అని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆవేదన వ్యక్తం చేశారు.

బండి సంజ‌య్‌ని కాపాడుకుంటామ‌న‌డం దారుణం..

మైనర్ అమ్మాయికి వ్యతిరేకంగా కుల సంఘాలు మాట్లాడడం, బండి సంజయ్ ని కాపాడుకుంటామనడం దారుణం. అమ్మాయి కూడా బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే. కుల సంఘాల నాయకులు అమ్మాయికి ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఈ ఘటనపై సామాజిక ఉద్యమకారులు మందకృష్ణ మాదిగ, ఇతర ప్రజా సంఘాల నాయకులు, యువత కూడా స్పందించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలి. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అమ్మాయికి న్యాయం చేయాలి అని ఆయ‌న కోరారు.

ఈ మీడియా స‌మావేశంలో మహిళా కన్వీనర్ లలిత, సిర్పూర్ మాజీ ఎంపీపీ మాలతీ, మహిళా నాయకురాలు వరలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement