త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సాగునీటి హ‌క్కుల సంర‌క్ష‌ణ‌కు కేసీఆర్ మ‌రో ఉద్య‌మం

పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఇటీవ‌ల కేంద్రం ఓ కొర్రీ పెట్టింది. బీఆర్ ఎస్ హ‌యాంలో ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించ‌గా ఇప్పుడు కేంద్రం మాత్రం 45 టీఎంసీలే చాలంటూ కేంద్ర జ‌ల‌వ‌న‌రుల క‌మిష‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది.

a

News | Published On Dec 14, 2025, 3.36 pm IST

సాగునీటి హ‌క్కుల సంర‌క్ష‌ణ‌కు కేసీఆర్ మ‌రో ఉద్య‌మం

తెలంగాణ‌కు మ‌రోసారి జ‌రుగుతున్న అన్యాయానికి వ్య‌తిరేకంగా క‌దం తొక్క‌నున్న కేసీఆర్

Advertisement

సాగునీటి హ‌క్కుల సంర‌క్ష‌ణ‌కు కేసీఆర్ మ‌రో ఉద్య‌మం

త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రైతుల సాగునీటి హ‌క్కుల‌ను కాపాడుకునేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మ‌రో ఉద్య‌మానికి రూప‌క‌ల్ప‌న చేయ‌నున్నారు. కృష్ణ‌, గోదావరి జలాల విషయంలో, ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌పు ఎడ‌తెగ‌ని నిర్ల‌క్ష్యం, నిర్లిప్త‌త‌పై స‌మ‌ర‌శంఖం పూరించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు..సాగునీటి హ‌క్కుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం తెలంగాణ‌కు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఇందుకోసం ఈ నెల (2025 డిసెంబ‌రు) 19న బీఆర్ ఎస్ పార్టీ కార్యాల‌యం తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

పాల‌మూరు-రంగారెడ్డికి..90 టీఎంసీలు పోయి 45 టీఎంసీలు

పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఇటీవ‌ల కేంద్రం ఓ కొర్రీ పెట్టింది. బీఆర్ ఎస్ హ‌యాంలో ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించ‌గా ఇప్పుడు కేంద్రం మాత్రం 45 టీఎంసీలే చాలంటూ కేంద్ర జ‌ల‌వ‌న‌రుల క‌మిష‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. మైన‌ర్ ఇరిగేష‌న్‌లో ఆదా చేసిన నీటి లెక్క‌లు స‌రిగా లేవ‌న్న సాకుతో ఈ ప్రాజెక్టును కేంద్ర జ‌ల వ‌న‌రుల క‌మిష‌న్ అప్రైజ‌ల్ జాబితా నుంచి త‌ప్పించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగి తెలంగాణ‌కు 90 టీఎంసీలు ఇవ్వాల్సిందేనంటూ ద‌ర‌ఖాస్తు చేసుకోగా అందుకు కేంద్రం ఒప్పుకోలేదు. వాస్త‌వానికి 90 టీఎంసీల్లో .. పోల‌వ‌రం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ డెల్టాకు మ‌ళ్లించే 45 టీఎంసీల‌కు బ‌దులుగా ... తెలంగాణ‌కు వ‌చ్చే కృష్ణా జ‌లాలు 45 టీఎంసీలు, మైన‌ర్ ఇరిగేష‌న్ ద్వారా ఆదా చేసిన మ‌రో 45 టీఎంసీలు క‌లుపుకొని మొత్తం 90 టీఎంసీలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం విన్న‌వించింది. కానీ కేవ‌లం స‌గం వాటాకు అంగీక‌రించి మ‌రో సగం వాటా ..ట్రిబ్యున‌ల్లో వాద‌న‌లు పూర్త‌య్యాక తీసుకోవాల‌ని సీడ‌బ్ల్యుసీ ఉచిత స‌ల‌హానిచ్చింది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ డెల్టాకు గోదావ‌రి జ‌లాల‌ను మ‌ళ్లిస్తే..ఆ మేర‌కు తెలంగాణ‌కు హ‌క్కుగా వ‌చ్చే 45 టీఎంసీల వాటాపై ట్రిబ్యున‌ల్లో వాద‌న‌లు న‌డుస్తున్నాయి. తెలంగాణ వాద‌న‌లు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాద‌న‌లు వినిపిస్తున్న‌ది. అయితే.. ఈ నీటివాటాపై దూకుడుగా ఉండాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. సీడ‌బ్ల్యుసీ సూచించిన స‌ల‌హాకు త‌ల‌వంచే ప‌రిస్థితి నెల‌కొన‌డంతో తీవ్ర ఆందోళ‌న నెల‌కొన్న‌ది. దీనిపై బీఆర్ ఎస్ పార్టీ ఇప్ప‌టికే తీవ్రంగా స్పందించింది. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు కేవ‌లం 45 టీఎంసీలే చాలంటూ కేంద్రం ఇచ్చిన సూచ‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌లూప‌డాన్ని గులాబీ ద‌ళం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ది.

గోదావ‌రి జ‌లాల‌పై
తెలంగాణ సాగునీటి రంగ స్వ‌రూపాన్ని మార్చి హ‌రిత తెలంగాణ‌గా మార్చిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా నిర్ల‌క్ష్యం చేస్తున్న‌ద‌ని బీఆర్ ఎస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్న‌ది. చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌తో తిరిగి గాడిన ప‌డే ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా నిధులు విద‌ల్చ‌కుండా రాజకీయ క‌క్ష సాధింపు కోసం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌దంటూ కాంగ్రెస్ పై బీఆర్ ఎస్ గుర్రుగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఇక రంగంలోకి దిగేందుకు నిశ్చ‌యించుకున్నారని బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తొలి అడుగుగా ఈ నెల 19న (2025 డిసెంబ‌రు) తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ సంయుక్త స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది. ఆ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి బీఆర్ ఎస్ ఎల్పీ , పార్టీ రాష్ట్ర ప్ర‌తినిధుల‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. రెండేండ్లుగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం, 8 మంది ఎంపీలు క‌లిగిన బీజేపీ పార్టీ.. తెలంగాణ‌కు సాగునీటి హ‌క్కుల విష‌యంలో క‌న‌బ‌రుస్తున్న ఉదాసీన‌త‌, నిర్ల‌క్ష్యం వ‌ల్ల తెలంగాణ భ‌విష్య‌త్తుకు అంతులేని న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఒక ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 19న జ‌ర‌గ‌బోయే బీఆర్ ఎస్ పార్టీ స‌మావేశం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. ఆ రోజు భేటీలో ఒక కొత్త ఉద్య‌మానికి శ్రీకారం చుట్టేందుకు ఆస్కారం ఉంద‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement