త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | ఆదాయ ల‌క్ష్యం కాదది.. ఆర్థిక‌ నాట‌కం: దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్‌

Dasoju Sravan Kumar | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వినాశనం చేశాడ‌ని, తెలంగాణ భవిష్యత్తును అప్పుల పాలు చేయడం, రూ.3 ట్రిలియన్ ఎకానమీ, "తెలంగాణ రైజింగ్" (Telangana Rising) వంటి గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ విమ‌ర్శించారు.

S

News | Published On May 14, 2026, 4.25 pm IST

Dasoju Sravan Kumar | ఆదాయ ల‌క్ష్యం కాదది.. ఆర్థిక‌ నాట‌కం: దాసోజు శ్ర‌వ‌ణ్  కుమార్‌
Advertisement
  • 2026-27 బడ్జెట్‌లో మళ్లీ రూ. 2,41,263.58 కోట్ల ఆదాయం వస్తుందని త‌ప్పుడు అంచనాలు
  • గతేడాది రూ. 1,81,810.53 కోట్లు కూడా తేలేకపోయారు
  • తెలంగాణ రైజింగ్ పేరుతో డ‌ప్పు కొట్ట‌డం ఆపు
  • రూ.3 ట్రిలియన్ ఎకానమీ ఒట్టి భూట‌కం
  • కాగ్ నివేదిక‌తో మీ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది
  • మీ ఢిల్లీ దౌత్యం పెద్ద వైఫల్యం
  • సీఎం రేవంత్‌కు రాసిన‌ బ‌హిరంగ లేఖలో దాసోజు శ్ర‌వ‌ణ్ ధ్వ‌జం

Dasoju Sravan Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వినాశనం చేశాడ‌ని, తెలంగాణ భవిష్యత్తును అప్పుల పాలు చేయడం, రూ.3 ట్రిలియన్ ఎకానమీ, "తెలంగాణ రైజింగ్" (Telangana Rising) వంటి గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ విమ‌ర్శించారు. గుజ‌రాత్ మోడ‌ల్ పాట పాడుతూ తెలంగాణ ఎదిగిన తీరును మ‌రిచి విజ్ఞ‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

ఇవీ లేఖ వివ‌రాలు..

మీ ప్రభుత్వం నిత్యం డప్పు కొట్టుకునే "తెలంగాణ రైజింగ్", మీరు ఇచ్చే రూ. 3 ట్రిలియన్ ఎకానమీ వంటి ఆడంబరపు హామీల వెనుక ఉన్న అసలు రంగు 2025, మార్చి నుండి 2026, మార్చి వరకు ఉన్న కాగ్ (CAG) నివేదికతో బయటపడింది. మీరు తెలంగాణ ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారో, అంకెల గారడీతో ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో ఈ నివేదిక సాక్ష్యాధారాలతో సహా నిలదీస్తోంది. ఇది మీరు ముఖ్యమంత్రిగా చేసిన రాజ్యాంగబద్ధమైన ప్రమాణానికి విరుద్ధం. అంతే కాదు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే.

ఢిల్లీలో ఫొటోల‌కు ఫోజులే మీ ప‌ని..

ఢిల్లీలో ఫోటోలకు ఫోజులిస్తూ, కేంద్రం చెప్పే రూ. 40 ట్రిలియన్ల లక్ష్యానికి వంత పాడుతూ, 'గుజరాత్ మోడల్'ను పొగడడం మీ ఆర్థిక అజ్ఞానాన్ని చాటుతోంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా ఎలా ఎదిగిందో అర్థం చేసుకునే విజ్ఞత మీకు లేదని అర్థమవుతోంది. నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు పొగిడే గుజరాత్ మోడల్ కంటే తెలంగాణ అన్ని రంగాల్లోనూ మెరుగ్గా ఉందని తెలిసినా, మీ ఆర్థిక అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ఈ వేషాలు వేస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్‌ నాయకత్వంలో కళకళలాడిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నేడు ఆగమైపోతున్నది. ఒకప్పుడు ధీమాగా ఉన్న రాష్ట్ర ఖజానా ఇప్పుడు కేవలం ఖాళీ అయింది. మీ పరిపాలనా అసమర్థత, అస్తవ్యస్త నిర్వహణ, మోసపూరిత లెక్కల వల్ల నిలువునా దోపిడీకి గురవుతున్నదని కాగ్ (CAG) నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి అని దాసోజు లేఖ‌లో వివ‌రించారు.

అదొక క‌ట్టు క‌థ‌..

I. కుప్పకూలిన ఆదాయం, పక్షవాతం పట్టిన రాష్ట్రం: మీ 2025-26 బడ్జెట్ ఒక ఆర్థిక ప్రణాళిక కాదు, అది ఒక కట్టుకథ. ప్రతి కీలక రంగంలోనూ ఆదాయం దారుణంగా పడిపోయింది, ఇది రాష్ట్ర సంక్షేమానికి గొడ్డలి పెట్టుగా మారింది. ప్రభుత్వ ఆదాయ యంత్రాంగం పూర్తిగా మొరాయించిందని కాగ్ నివేదిక చెబుతోంది.

ఆదాయ లక్ష్యం అట్టర్ ప్లాప్: మీరు రూ. 2,29,720.63 కోట్ల ఆదాయం వస్తుందని బడాయిలు చెప్పారు. కానీ వచ్చింది కేవలం రూ. 1,81,810.53 కోట్లు మాత్రమే అంటే దాదాపు 20.86% లోటు ఉంది.
భూ ఆదాయం - ఒక ప్రహసనం: భూముల ద్వారా రూ. 11.20 కోట్లు వస్తాయని చెబితే వచ్చింది కేవలం రూ. 0.62 కోట్లు అంటే సాధించింది కేవలం 5.54% మాత్రమే.
రియల్ ఎస్టేట్ మాంద్యం: "ఫ్యూచర్ సిటీ" అని మీరు చేస్తున్న ప్రచారంలో దమ్మెంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం చూస్తే అర్థమవుతోంది. రూ. 19,087.26 కోట్ల లక్ష్యానికి కేవలం రూ. 15,251.03 కోట్లు (79.90%) మాత్రమే రావడం చూస్తుంటే, మీ "తెలంగాణ రైజింగ్" నినాదాలపై పెట్టుబడిదారులకు నమ్మకం పోయిందని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న వారి వ్యక్తిగత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటే, రాష్ట్ర ఆదాయం మాత్రం పాతాళానికి పడిపోతోంది.
పన్నుయేతర ఆదాయ సంక్షోభం: మీ పరిపాలనా దక్షతకు పన్నుయేతర ఆదాయమే నిదర్శనం. రూ. 31,618.77 కోట్ల టార్గెట్ పెడితే, మీరు సాధించింది కేవలం 60.05% మాత్రమే. అంటే రూ. 12,600 కోట్ల భారీ లోటును మిగిల్చారు.

రూ. 5,200 కోట్ల ఆదాయం ఎటు పోయింది?

II. మద్యం మాయాజాలం: కిటకిటలాడే షాపులు.. వెలవెలబోయే ఖజానా: రాష్ట్రంలోని మద్యం దుకాణాల దగ్గర ఉన్న రద్దీకి, మీ లెక్కల్లో చూపిస్తున్న ఆదాయానికి అస్సలు పొంతనే లేదు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు జనంతో కిటకిటలాడుతున్నా, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 27,623.36 కోట్ల లక్ష్యానికి కేవలం రూ. 22,359.52 కోట్లు (80.94%) మాత్రమే రావడం దేనికి సంకేతం? సుమారు రూ. 5,200 కోట్ల ఆదాయం ఎటు పోయింది? మీ కనుసన్నల్లోనే ఒక అక్రమ మద్యం సిండికేట్ నడుస్తూ, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును దారి మళ్లిస్తున్నారని అర్థమవుతోంది. ఈ భారీ కుంభకోణంపై విచారణ జరపాలి. ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి అని ఆ లేఖ‌లో శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

III. "అప్పుల రారాజు": తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టారు: మీ పాలనలో అత్యంత దారుణమైన విషయం అప్పుల మీద మీకున్న మోజు. చట్టాలను, శాసనసభను బేఖాతరు చేస్తూ మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘన: శాసనసభ రూ. 54,009.74 కోట్ల అప్పుకు అనుమతి ఇస్తే, మీరు అహంకారంతో ఆ పరిమితిని దాటి రూ. 77,762.35 కోట్లు (143.98%) అప్పు చేశారు.

IV. ఫెయిల్ అయిన "బడే భాయ్" దౌత్యం: కేంద్ర పెద్దల మెప్పు కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ, 'గుజరాత్ మోడల్'ను పొగడడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది శూన్యం. రూ. 22,782.50 కోట్ల గ్రాంట్లు రావాల్సి ఉంటే, మీరు తెచ్చింది కేవలం రూ. 10,422.98 కోట్లు (45.75%) మాత్రమే. మీ "ఢిల్లీ దౌత్యం" ఒక పెద్ద వైఫల్యం అని తేలిపోయింది. రాష్ట్రానికి రావలసిన నిధుల్లో సగం కూడా తేలేకపోయారు. దీనివల్ల సంక్షేమ పథకాలు కుంటుపడుతున్నాయి.

V. మిగులు నుండి లోటుకు: బయటపడ్డ బండారం: 2025-26లో రూ. 2,738.35 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ఆశ చూపి, చివరకు రూ. 9,235.06 కోట్ల రెవెన్యూ లోటును మిగిల్చారు. మీ పరిపాలనా అసమర్థత వల్ల సుమారు రూ. 12,000 కోట్ల భారీ వ్యత్యాసం ఏర్పడింది. అంతేకాకుండా ప్రాథమిక లోటు (Primary Deficit) అంచనా వేసిన రూ. 34,640.70 కోట్ల కంటే 138.80% పెరిగి రూ. 48,082.93 కోట్లకు చేరింది. అయినా సరే.. మీలో పశ్చాత్తాపం లేదు. 2026-27 బడ్జెట్‌లో మళ్లీ రూ. 2,41,263.58 కోట్ల ఆదాయం వస్తుందని అబ‌ద్ధ‌పు అంచనాలు వేశారు. గత ఏడాది రూ. 1,81,810.53 కోట్లు కూడా తేలేకపోయిన మీరు, ఇప్పుడు ఇంత భారీ లక్ష్యం ఎలా పెడతారు? ఇది కేవలం మరిన్ని అక్రమ అప్పులు చేయడానికి మీరు ఆడుతున్న "ఆర్థిక నాటకం" మాత్రమే.

ప్ర‌భుత్వం ఎందుకు విఫ‌ల‌మైందే జ‌వాబివ్వు..

రేవంత్ రెడ్డి తెలంగాణ "రైజింగ్" కావడం లేదు.. మీ అసమర్థత, అడ్డగోలు అప్పులు, ఆర్థిక దార్శనికత లేనితనం వల్ల రాష్ట్రం "సింకింగ్" (మునిగిపోవడం) అవుతోంది. మీరు రూ. 3 ట్రిలియన్ ఎకానమీని నిర్మించడం లేదు, తెలంగాణకు అప్పుల సమాధిని నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రజల తరఫున, రాష్ట్ర ఆదాయాలపై పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పూర్తి లెక్కలను వెల్లడించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పరిపాలనను బలపరచడంలో, రాష్ట్ర ఆర్థిక ఉత్పాదకతను పెంచడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కూడా కోరుతున్నాను అని దాసోజు శ్ర‌వ‌ణ్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement