త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మేడిగ‌డ్డ బ్యారేజీ ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయండి: మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

మేడిగ‌డ్డ బ్యారేజీ పున‌రుద్ధ‌ర‌ణ కోసం అవసరమైన సాంకేతిక సంస్థలతో, డిజైన్ కన్సల్టెంట్స్ తో సమన్వయం చేసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్లకు దశలవారీగా అనుమతులు పొందడం సులభతరమౌతుందని ఆయన చెప్పారు .

a

News | Published On Feb 1, 2026, 7.46 pm IST

మేడిగ‌డ్డ బ్యారేజీ ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయండి: మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
Advertisement

మేడిగ‌డ్డ బ్యారేజీ ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయండి
ఎస్ఎల్‌బీసీ నిర్మాణంలో జాప్యాన్ని కూడా ఉపేక్షించం
సొరంగం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయండి
అధికారుల‌తో స‌మీక్ష‌లో
మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగ‌మైన మేడిగ‌డ్డ బ్యారేజీ ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఆదివారం ఆయ‌న కాళేశ్వ‌రం, ఎస్ ఎల్ బీసీ ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్..అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ టీంతో స‌మ‌న్వ‌యం చేసుకోండి

మేడిగ‌డ్డ బ్యారేజీ పున‌రుద్ధ‌ర‌ణ కోసం అవసరమైన సాంకేతిక సంస్థలతో, డిజైన్ కన్సల్టెంట్స్ తో సమన్వయం చేసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్లకు దశలవారీగా అనుమతులు పొందడం సులభతరమౌతుందని ఆయన చెప్పారు .
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్ , ప్రాజెక్ట్‌ డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారుల‌కు మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్‌ సూచించారు. ఈ మేరకు ఫిబ్రవరి 16 తరువాత ఎన్.డి.ఎస్.ఏ నిపుణుల కమిటీ తో సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అనుమతులు పొంది పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఎస్ ఎల్ బీసీ లో ఆల‌స్యం వ‌ద్దు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణంపనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సొరంగ‌ మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్రప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించారు. అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ కోసం హెలి-బోర్న్ బృందం చేసిన సర్వే నివేదిక ప్రభుత్వానికి అందింద‌ని ఆయన చెప్పారు. ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం మిగిలిన భాగం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలాక్ట్రో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన తెలిపారు.సొరంగమార్గం పూర్తికి సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భౌగోళికంగా ప్రతికూల పరిస్థితిలు ఏర్పడితే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టదానికి ఈ సర్వే ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సొరంగమార్గం పూర్తి చేయడానికి గాను ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు శాస్త్రీయ పద్దతిలో నిరంతరం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణకై ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బృందానికి ప్రత్యేక చీఫ్ ఇంజనీర్ ను నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు భద్రతా,నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూడడంతో పాటు అధికారులు రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మాణం కొనసాగేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్ కు సహకరించేలా ఉండేందుకు స్వతంత్ర పర్యవేక్షణ కన్సల్టెంట్ ను నియమించాలని మంత్రి ఉత్త‌మ్ సూచించారు. నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యులు అవుతారని ఆయన చెప్పారు. అదే సమయంలో సొరంగ మార్గంలో ఏర్పదుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు గాను ప్రత్యేక జియో టెక్నీకల్,జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement