త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Hanumantha Rao | 9న ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు కూర్చుంటా.. బీసీ కుల‌గ‌ణ‌ను తేల్చాల్సిందే: వీ హ‌నుమంత‌రావు

V Hanumantha Rao | బీసీ కుల‌గ‌ణ‌న (BC Census) పై కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఈనెల 9వ తేదీన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌(Hunger strike unto death) కు కూర్చుంటాన‌ని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత‌ రావు ప్ర‌క‌టించారు. బీసీ కుల గ‌ణ‌న‌పై స్ప‌ష్ట‌త ఇచ్చాకే ప్ర‌ధాని మోదీ (PM Modi) తెలంగాణ‌కు రావాల‌ని డిమాండ్ చేశారు.

S

News | Published On May 5, 2026, 1.03 pm IST

V Hanumantha Rao | 9న ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు కూర్చుంటా.. బీసీ కుల‌గ‌ణ‌ను తేల్చాల్సిందే: వీ హ‌నుమంత‌రావు
Advertisement
  • బీసీ కుల‌గ‌ణ‌నపై మోదీ వైఖ‌రి చెప్పాలి
  • బీసీలపై ఆయ‌నకు వివ‌క్ష ఎందుకు?
  • స్ప‌ష్ట‌త ఇచ్చాకే తెలంగాణ‌కు రావాలి
  • తెలంగాణ‌లో రాహుల్ కుల‌గ‌ణ‌న చేయించారు
  • మీడియా స‌మావేశంలో హ‌నుమంత‌రావు వెల్ల‌డి

V Hanumantha Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బీసీ కుల‌గ‌ణ‌న (BC Census) పై కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఈనెల 9వ తేదీన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌(Hunger strike unto death) కు కూర్చుంటాన‌ని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత‌ రావు ప్ర‌క‌టించారు. దీనిపై కేంద్రం స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చేదాకా దీక్ష కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్ల‌డారు. బీసీ కుల గ‌ణ‌న‌పై స్ప‌ష్ట‌త ఇచ్చాకే ప్ర‌ధాని మోదీ (PM Modi) తెలంగాణ‌కు రావాల‌ని డిమాండ్ చేశారు.

అప్పుడే మోదీ రావాలి..

బీసీ క్యాస్ట్ సెన్సెస్ పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ వైఖరికి నిరసనగా ఈ నెల 9న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా. బీసీ కులాల జ‌నాభా లెక్కింపుపై కేంద్రం స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వాలి. స‌మ‌స్య ప‌రిష్కారం చేయాలి. అప్పటి వ‌ర‌కు ఈ ఆమ‌ర‌ణ‌ దీక్ష కొనసాగుతుంది. ఈనెల‌ 8వ తేదీ లోపు ప్ర‌ధాని మోదీ దీనిపై స్పష్టత ఇవ్వాలి. అప్ప‌డే 10వ తేదీన మోదీ తెలంగాణకు రావాలి.

బంగారం రేట్లు పెరిగితే పెండ్లీలు ఎట్ల‌యిత‌య్..

బీసీ అని చెప్పుకునే మోదీ బీసీలపై వివక్ష చూపించడం ఎందుకు? ఓసీ అయిన రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీ కులాల లెక్కింపును చేశారు. ఇందుకోసం రూ.150 కోట్లు వెచ్చించారు. మోదీ హయాంలో రేట్లు పెరిగి అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. పెట్రోల్ రేట్లు ఆనాడు 70 రూపాయ‌ల‌పైన ఉంటే ఈరోజు 107 కు పెరిగింది. డీజిల్ రేట్ల‌నూ పెంచారు. ఇక ఎల్పీజీ గ్యాస్ రూ.600 ఉంటే ఇప్పుడు రూ.965 అయింది. వాణిజ్య సిలిండ‌ర్ 1200 ఉంటే 3 వేల‌కు పైగా పెంచారు. గ‌రీబోళ్ల నోట్ల మ‌ట్టి కొట్టారు. బంగారం రేట్లు అమాంతం పెరిగిన‌య్‌. ఇగ పెండ్లీలు ఏడికెంచి అయిత‌య్? చికెన్ రేటు 120 నుంచి 300కు పైగా పెరిగింది. మ‌టన్ కిలో రేటు రూ.400 ఉండే.. ఇయ్యాళ 1200 అయింది అని మోదీపై హ‌నుమంత‌రావు మండిప‌డ్డారు.

 

Advertisement
Advertisement