త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan Kumar | హైడ్రా కుంభ‌క‌ర్ణ‌ నిద్ర లేచింది.. ఇన్ని రోజులు గ‌డ్డి పీకిందా?: ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌

MLC Dasoju Sravan Kumar | ఇవ్వాళ ఉదయం హైడ్రా అక్రమ స్టోన్ క్రషర్లపై చర్యలు తీసుకుందని, కొంత సంతోషం కలిగినా ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అనుమానం వ్య‌క్తం చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పొంగులేటిని మంత్రివర్గం నుంచి వెంట‌నే బర్తరఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

S

News | Published On May 5, 2026, 6.27 pm IST

MLC Dasoju Sravan Kumar | హైడ్రా కుంభ‌క‌ర్ణ‌ నిద్ర లేచింది.. ఇన్ని రోజులు గ‌డ్డి పీకిందా?: ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌
Advertisement
  • ఆరు అక్రమ స్టోన్ క్రషర్లపై హైడ్రా చ‌ర్య‌లు
  • మొద‌ట‌ రాఘవ కంస్ట్రక్షన్ అని చెప్పిన హైడ్రా చెప్పింది
  • మూడు గంటల తర్వాత తిరుమల కంస్ట్రక్షన్ వి అని సవరించిన ప్రెస్ నోట్ ఇచ్చింది
  • సాక్ష్యాలను తారుమారు చేసేందుకే రంగ‌నాథ్‌ రెండో ప్రెస్ నోట్
  • ఆయ‌న్ను కోర్టుకు లాగుతం
  • క‌లెక్ట‌ర్‌, ఆర్డీవోల‌పై చ‌ర్య‌లు తీసుకోకుంటే సీఎం రేవంత్‌కు సంబంధం ఉన్న‌ట్టే
  • పొంగులేటిని మంత్రివర్గం నుంచి వెంట‌నే బర్తరఫ్
  • అక్ర‌మ మైనింగ్‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేయాలి
  • మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ దాసోజు నిప్పులు

MLC Dasoju Sravan Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: ఇవ్వాళ ఉదయం హైడ్రా అక్రమ స్టోన్ క్రషర్లపై చర్యలు తీసుకుందని, కొంత సంతోషం కలిగినా ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అనుమానం వ్య‌క్తం చేశారు. హైడ్రా ఇప్పుడు కుంభ‌క‌ర్ణ నిద్ర లేచింద‌ని, ఇన్ని రోజులు గ‌డ్డిపీకిందా అంటూ ఫైర‌య్యారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్ల‌డారు. పొంగులేటికి ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కూర్చునే హక్కు లేదన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పొంగులేటిని మంత్రివర్గం నుంచి వెంట‌నే బర్తరఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

పొంగులేటి అక్ర‌మ మైనింగ్‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేయాలి..

పొంగులేటి స్థానంలో మరెవరైనా ఉంటే హైడ్రా ఇన్ని రోజులు ఆగేదా? పొంగులేటి తెలంగాణ అల్లుడా? ఎందుకు మర్యాదలు.. 60 రోజుల తర్వాత హైడ్రా కుంభకర్ణ నిద్ర లేచింది. ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నార‌ని రంగనాథ్ ను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాష్ట్ర గవర్నర్ కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పొంగులేటి అక్రమ మైనింగ్ పై కూడా సీబీఐ దర్యాప్తు కు గవర్నర్ ఆదేశించాలి. మంత్రులు రియల్ ఎస్టేట్ ముసుగులో దందాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న విషయాన్ని ఆధారాలతో సహా బయట పెట్టాం అని దాసోజు చెప్పారు.

అసెంబ్లీలో హ‌రీశ్‌రావు పొలికేక‌..

మానస హిల్స్ లో అక్రమ మైనింగ్ పై హరీష్ రావు అసెంబ్లీలో పొలికేక పెట్టారు. వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ మైనింగ్ కు పొంగులేటి పాల్పడ్డారని అక్కడకు వెళ్లి నిరూపించాం. ప్రజా ఆస్తులను, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని గ‌త‌ ఫిబ్రవరిలో బయటపెట్టాం. ఇన్ని రోజులు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం, ప్రజా పోరాటాలు చేశాం. అయినా దున్న పోతు మీద వాన పడ్డట్టు వ్యవహరించారు. హైడ్రా ఈరోజు ఉదయం 9.16 నిమిషాలకు పంపిన ప్రెస్ మీట్ లో ఆరు క్ర‌షింగ్ యూనిట్లను తొలగించామని చెప్పింది. ఇన్ని రోజులు గడ్డి పీకారా? అని శ్ర‌వ‌ణ్‌కుమార్‌ మండిప‌డ్డారు.

రంగ‌నాథ్‌ను కోర్టుకు లాగుతాం..

నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు పతివ్రతల్లా మాట్లాడారు. పర్యావరణ విద్వంసం గురించి మేము చెప్పినపుడు హైడ్రా ఏం చేసింది. పుంఖాను పుంఖాలుగా రేవంత్ భేష్, పొంగులేటి భేష్ అన్నట్టుగా హైడ్రా వార్తలు ప్రచారం చేసింది. మొదట కూల్చివేతలు రాఘవ కంస్ట్రక్షన్ అని చెప్పిన హైడ్రా మూడు గంటల తర్వాత తిరుమల కంస్ట్రక్షన్ వి అని సవరించిన ప్రెస్ నోట్ ఇచ్చింది. ఈ మూడు గంటల్లో ఎవరు ఒత్తిడి చేశారో హైడ్రా రంగనాథ్ చెప్పాలి. ఏమైనా టేబుల్ కింద లావాదేవీలు జరిగితే హైడ్రా ప్రెస్ నోట్ మార్చిందా? పొంగులేటి ఒత్తిడికి రంగనాథ్ తలొగ్గి ఆ విధంగా చేశారు. ఐపీఎస్ అధికారిగా ఉండి రంగనాథ్ మాట మార్చడం తగునా? ఎందుకు రాఘవ కంస్ట్రక్షన్ ను కాపాడుతున్నారు? రంగనాథ్ ను కోర్టుకు లాగుతాం అని హెచ్చ‌రించారు.

క‌లెక్ట‌ర్‌, ఆర్డీవో ఆస్తులను జ‌ప్తు చేసి ఆ డ‌బ్బులు ఇస్త‌రా?

రెండు నెలల పాటు సీఎం రేవంత్ ,హైడ్రా రంగనాథ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. ఇన్నేళ్ల పాటు పొంగులేటి తరలించిన 500 కోట్ల రూపాయల విలువైన మైనింగ్ సంపదను తిరిగి ఎలా రాబడుతారు? కలెక్టర్, ఆర్డీవో ఆస్తులను జప్తు చేసి ఆ 500 కోట్ల రూపాయలను రాబడుతారా? కలెక్టర్, ఆర్డీవోలపై చర్యలు తీసుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఈ అక్రమ మైనింగ్ తో సంబంధం ఉన్నట్టే. అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారందరి పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

వాస్త‌వాల‌ను క‌ప్పి పెడితే ఏడేళ్ల జైలు...

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ లిక్కర్ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించారు. భాగ్యలక్ష్మి మినరల్స్ పేరిట మరో తెలంగాణ అల్లుడు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా హోర్డింగ్ లు పెడితే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారు సుద్దపూసల్లా కేసీఆర్ పై సీబీఐ విచారణకు రాస్తున్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడే వాళ్ళకు ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందని చట్టం చెబుతోంది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే హైడ్రా కమిషనర్ రెండో ప్రెస్ నోట్ ఇచ్చారు. వాస్తవాలను కప్పి పెట్టిన వారికి కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది అని దాసోజు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement