త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dr Menaka Guruswamy | భారత పార్లమెంట్‌లో సరికొత్త చరిత్ర.. తొలి LGBTQ+ రాజ్యసభ ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణ స్వీకారం

భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక LGBTQ+ (క్వీర్) వర్గానికి చెందిన మహిళ, ప్రముఖ న్యాయవాది డాక్టర్ మేనకా గురుస్వామి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరపున పశ్చిమ బెంగాల్ నుంచి ఆమె ఎన్నికయ్యారు.

J

News | Published On Apr 6, 2026, 8.32 pm IST

Dr Menaka Guruswamy | భారత పార్లమెంట్‌లో సరికొత్త చరిత్ర.. తొలి LGBTQ+ రాజ్యసభ ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణ స్వీకారం
Advertisement
  • రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టిన 'క్వీర్' (LGBTQ+) ఎంపీగా డాక్టర్ మేనకా గురుస్వామి రికార్డు.
  • ఏప్రిల్ 6, 2026 న సోమవారం రాజ్యసభలో ప్రమాణ స్వీకారం
  • టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆమెను పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచారు
  • 2018లో స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో కీలక వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది
  • 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జన్మించిన మేనక
  • ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం
  • టైమ్స్ మ్యాగజైన్ టాప్ 100 జాబితాలోనూ చోటు

Dr Menaka Guruswamy | త్రినేత్ర.న్యూస్ : రాజ్యసభ.. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి, సామాజిక సేవకులకు పెద్దల సభగా ప్రసిద్ధి. ఇప్పటివరకు వైద్య, విద్యా, కళా రంగాలకు చెందిన ఎంతోమందికి ఈ సభలో స్థానం దక్కింది. అయితే, దేశ పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారిగా ఓ సరికొత్త అధ్యాయం లిఖించబడింది.

ఒక LGBTQ+ (క్వీర్) కమ్యూనిటీకి చెందిన మహిళ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మేనకా గురుస్వామి (Dr. Menaka Guruswamy) ఏప్రిల్ 6, 2026న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి దేశ చరిత్రలో నిలిచిపోయారు.

మమతా బెనర్జీ సంచలన నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎవరూ ఊహించని విధంగా స్వలింగ సంపర్కురాలైన (హోమోసెక్సువల్) మేనకా గురుస్వామిని టీఎంసీ తరపున రాజ్యసభకు పంపి మమతా బెనర్జీ అందరినీ ఆశ్చర్యపరిచారు. "మా పార్టీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది" అనే బలమైన సందేశాన్ని మమతా బెనర్జీ ఈ నామినేషన్ ద్వారా దేశానికి ఇచ్చారు. ఎంతోకాలంగా వివక్ష ఎదుర్కొంటున్న LGBTQ కమ్యూనిటీ వాయిస్ ఇప్పుడు పార్లమెంట్‌లో వినిపించే అవకాశం దక్కింది.

ఎవరీ మేనకా గురుస్వామి?

మేనకా గురుస్వామి కేవలం హక్కుల కార్యకర్త మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సీనియర్ న్యాయవాది.

హైదరాబాద్‌లో జననం: ఆమె 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జన్మించారు.

అత్యున్నత విద్యాభ్యాసం: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక 'నల్సార్' (NALSAR) విశ్వవిద్యాలయంతో పాటు, ఆక్స్‌ఫర్డ్ (Oxford), హార్వర్డ్ (Harvard) యూనివర్సిటీల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. కొలంబియా యూనివర్సిటీలో బీఆర్ అంబేద్కర్ రీసెర్చ్ స్కాలర్‌గానూ పనిచేశారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన అనేక న్యాయపరమైన వ్యవహారాలను కూడా పర్యవేక్షించారు.

సెక్షన్ 377 రద్దు: 2018లో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో మేనకా గురుస్వామి కీలక వాదనలు వినిపించారు. ఈ కేసు తర్వాత 'టైమ్స్ మ్యాగజైన్' ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు.

మేనక తన భాగస్వామి, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన అరుంధతి కట్జూతో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరూ కలిసే ఎన్నో ముఖ్యమైన కేసులను వాదించారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ

మేనకా గురుస్వామి కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాలేదు. రాజకీయంగానూ చురుగ్గా ఉంటూ టీఎంసీకి సంబంధించిన అనేక న్యాయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ఈడీ (ED) దాడుల సమయంలో టీఎంసీ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. పరిపాలనా సంస్కరణలు, రైట్ టు ఎడ్యుకేషన్, సాల్వాజుడుం వంటి ఎన్నో సంచలనాత్మక కేసులలో కూడా ఆమె తన వాదనలు వినిపించారు.

ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా LGBTQ కమ్యూనిటీ వారిని రాజకీయంగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ మమతా బెనర్జీ వేసిన ఈ అడుగు, భారత రాజకీయాల్లో మరియు LGBTQ+ వర్గాల ప్రాతినిధ్యంలో (Visibility) ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.

Advertisement
Advertisement