త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Human Rights Forum Petition | మా గ్రామాల‌కు రావాలి.. గోడు వినాలి: మూసీ బాధితుల త‌ర‌ఫున మంత్రుల క‌మిటీకి మాన‌వ హ‌క్కుల వేదిక విన‌తి

Musi project | మూసీ ప్రాజెక్టు విషయంలో నది పునరుద్ధ‌రణ.. నది శుద్ధీకరణ.. నదీ ప్రాంత అభివృద్ధి అని ఇలా రకరకాలుగా వార్త‌లున్నాయ‌ని.. గౌరెల్లి వరకే ప్రకటించిన ప్రాజెక్టును ఖేతపల్లి మండలం సోలిపేట గ్రామం వ‌ర‌కు (సూర్య పేట ప్రాజెక్టు వరకు) పొడిగించాలని మాన‌వ హ‌క్కుల (Human Rights Forum) వేదిక కోరింది. ఈ మేర‌కు మూసీ బాధిత ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌ మంత్రుల స‌బ్ క‌మిటీకి విన‌తి ప‌త్రం (Petition) స‌మ‌ర్పించారు.

S

News | Published On Apr 16, 2026, 4.24 pm IST

Human Rights Forum Petition | మా గ్రామాల‌కు రావాలి.. గోడు వినాలి: మూసీ బాధితుల త‌ర‌ఫున మంత్రుల క‌మిటీకి మాన‌వ హ‌క్కుల వేదిక విన‌తి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: మూసీ ప్రాజెక్టు విషయంలో నది పునరుద్ధ‌రణ.. నది శుద్ధీకరణ.. నదీ ప్రాంత అభివృద్ధి అని ఇలా రకరకాలుగా వార్త‌లున్నాయ‌ని.. గౌరెల్లి వరకే ప్రకటించిన ప్రాజెక్టును ఖేతపల్లి మండలం సోలిపేట గ్రామం వ‌ర‌కు (సూర్య పేట ప్రాజెక్టు వరకు) పొడిగించాలని మాన‌వ హ‌క్కుల (Human Rights Forum) వేదిక కోరింది. ఈ మేర‌కు మూసీ బాధిత ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌ మంత్రుల స‌బ్ క‌మిటీకి విన‌తి ప‌త్రం (Petition) స‌మ‌ర్పించారు. మూసీ సుందరీకరణ‌లో పరీవాహక గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవాల‌ని కోరారు. క‌మిటీ అధ్యక్షులు భట్టి విక్రమార్క, సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇందుకు కృషి చేయాల‌న్నారు. ఈ ప్రాజెక్ట్ లో త‌మ‌ను కూడా భాగం చేయాల‌ని చెప్పారు.

దాదాపు మూడు జిల్లాలోని 20 మండలాల్లోని వంద గ్రామాలకు మూసీ నీరు వెళ్తుంది. ఈ గ్రామ ప్రజల జీవితాలు మూసీ నది తో పెనవేసుకొని ఉన్నాయి. మూసీ నదిలోని కాలుష్యాన్ని అంతా శుద్ధి చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్రామాలకు శుద్ధి చేసిన నీరు నది ద్వారా అందించేందుకు సన్నాహాలు చేయ‌డం సంతోష‌క‌రం. మూసీని శుభ్రపరచడానికి జనానికి ఇబ్బంది కలిగించొద్దు. ఇంతవరకు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేత‌లు, ప్రతిపక్ష, అధికార పార్టీ ప్రతినిధులు మా ఊర్లలోకి రావాలి. ఇంకా ఈ ప్రాజెక్టు విషయాలు మాకు తెలుపలేదు.

కమిటీ దృష్టికి తెచ్చిన‌ స‌మ‌స్య‌లు..

గత మూడు దశాబ్దాలుగా మూసీ నీరు విషపూరితం కావడంతో మా బతుకులు విధ్వంమ‌య్యాయి. జంటనగరాల నుంచి వచ్చే డ్రయినేజీ నీటితో పాటు, పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాల వ్యర్థాలతో కూడిన నీరు, ఎట్లా మా జీవితాలను, మా పశువులను, మా గొర్రెలను, మా మత్స్య సంపదను, మా పంటలను, మా తాటి, ఈత కల్లును, ఇంకా సర్వం నాశనం అయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో దాదాపు వంద మందికి పైగా స్త్రీలకు గర్భ విచ్ఛిత్తి జరిగింది. పశువులు కూడా సరిగా సంతానం ఉత్పత్తి చేయలేకపోయాయి. గొర్రెల, మేకల మందలకు ప్రసిద్ధిగా ఉండే మా ఊర్లలో గొర్రెలు, మేకలు కూడా గర్భం దాల్చడం లేదు. అన్ని చెరువుల్లో చేపలు అదృశ్యమయ్యాయి. పొలాలల్లో పని చేసేవారికి ఇంకా చర్మ వ్యాధులు వస్తున్నాయి. మా భూముల్లో, ఈ కాలుష్య నీటితో ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తిలో 40% తాలుగా ఉంటుంది. కూరగాయలు పండించుకునే స్థితి లేదు.

గ్రామాల ప్రజల ప్రతినిధులుగా మా ప్రతిపాదనలు ఇవే..

  • మూసీ ప్రాజెక్టు పై అభిప్రాయాలు స్వీకరించే మంత్రుల కమిటీ మా గ్రామాల్లో పర్యటించి, మా అభిప్రాయాలు వినాలి
  • ఈ ప్రాజెక్ట్ లో మమ్మల్ని కూడా భాగం చేయాలి
  • గౌరెల్లి గ్రామం వరకే ప్రకటించిన ప్రాజెక్టును, ఖేత‌ప‌ల్లి మండ‌లం, సోలిపేట గ్రామం అంటే మూసీపై నిర్మించిన సూర్యపేట ప్రాజెక్టు వరకు పొడిగించాలి
  • మీరు తలపెట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం భారీగా నిధులు ప్రభుత్వం ఖర్చుపెడుతున్నట్టు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అందులో మూసీ దిగువన ఉన్న దాదాపు 70 గ్రామాలకు
    రూ.1000/- కోట్లు కేటాయించాలి. మూడు దశాబ్దాలుగా మా గ్రామాల‌ ప్రజల జీవితాలు విధ్వంసం అయినందుకు, మా సంక్షేమం కోసం ఈ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి
  • అన్ని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు (Reverse Osmasis) ఏర్పాటు చేసి వాటిని గ్రాప పంచాయ‌తీల అజమాయిషిలో ఉంచాలి
  • శిశువులకు స్నానం చేయించడానికి ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నుంచి నీటిని ఖరీదు చేసి వాడుతున్న దుస్థితి ఉంది
  • నిజాం కాలంలో ఏర్మా ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన 24 కత్వాలు, వాటికి అనుసంధానంగా ఉన్న వంద‌లాది ఉప కాల్వ‌ల‌ సాగు నీటి వ్యవస్థ మా ప్రాంతంలో ఉంది. ఈ నీటి పారుదల వ్యవస్థ ద్వారా దాదాపు 70 గ్రామాల చెరువులు నిండుతాయి. అప్పుడు నిర్మించిన కత్వాల రాళ్లు ఊడిపోయి అవసాన దశకు చేరాయి. ఉప కాల్వ‌ల్లోకి నీరు వదిలే తూము పరికరాలు తుప్పు పట్టాయి. కాల్వ‌ల్లో బ్రహ్మజెముడు, సర్కారు తుమ్మ చెట్లు పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. సాగు నీటి పారుదల వ్య‌వస్థకు మ‌ర‌మ్మ‌తులు చేయాలి.
  • నిజాం సర్కారు 25 వేల ఎకరాల వ్యవసాయం కోసం చేసిన ఈ ఏర్పాటు వల్ల ఇప్పుడు లక్ష 12 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట పండుతుందని గుర్తు చేస్తున్నాం.
  • పై భాగాన మూసీ నీటిని శుభ్రం చేసి వదిలేలోపు, గ్రామాల్లోని దాదాపు 70 చెరువుల్లో పూడిక తీసి శుభ్రం చేయాలి.
    అన్ని చెరువులు రసాయన కాలుష్యాల మడ్డి (Sediment)తో నిండి ఉన్నాయి. వాటిని శుభ్రం చేయాలి.
  • ఈ ప్రాంతంలో మత్స్య‌కారుల జనాభా ఎక్కువ‌గా ఉంది. నదీ కాలుష్యం కాకముందు ఇక్కడి చెరువుల్లో లభించే చేపలకు బాగా గిరాకీ ఉండేది. ముఖ్యంగా ఏదులాబాద్ చెరువులో లభించే చేపలను కలకత్తా వరకు ఎగుమతి చేసేవారు. మత్స్యకారులకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
  • ఏదులాబాద్ చెరువులో రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేయాలి.
  • మా గ్రామాల్లో గొర్రెల, మేకల మందలు సమృద్ధిగా ఉండేవి. ఇప్పుడు మూసీ ప్రాంతంలోని పచ్చిక మేయడంతో గొర్రెలు, మేకలకు సంతానోత్పత్తి కావడం లేదు. యాదవ కులస్తులకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించాలి.
  • తాటి, ఈత కల్లు అమ్మి జీవించే గౌడ కులస్తులు కూడా, చెట్టు లోంచి వచ్చే కల్లు రుచి కోల్పోయి కలుషితం కావడంతో కల్లు అమ్ముకోలేకపోతున్నారు. రైతులు కూడా పండించిన పంటల్లో నాణ్యత లోపించడం, వరిలో 40% తాలు రావడంతో చాలా నష్టపోతున్నారు. వీరికి కూడా ఆర్థిక సహాయం అందించాలి. ఈ ప్రాంతంలోని కులవృత్తుల జీవనోపాధికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.
  • మండల స్థాయిలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు సరిపోవడం లేదు. నాలుగు, అయిదు గ్రామాల క్షస్టర్ల‌కు ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పరచాలి. అందులో తప్పనిసరిగా మహిళా, శిశువు, వైద్య బృందం, చర్మవ్యాధుల వైద్యుడు ఉండాలి.

పై సమస్యల‌ను సానుకూలంగా పరిశీలించి, ప్రభుత్వం తరపున మూసీ ప‌రీవాహక గ్రామాల ప్రజల కష్టాలు తీర్చే దిశగా కృషి చేయాల‌ని కోరుతున్నాం. జీవన్ కుమార్ (మానవ హక్కుల వేదిక), బట్టెశంకర్ (మూసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు), బాలరాజ్ గౌడ్ (గౌడ సంఘం), చిలువేరి ఐలయ్య (యాదవ సంఘం), గుండోళ్ల‌ లింగ స్వామి (శాలివాహన సంఘం), పూలమోని బస్వయ్య (ముదిరాజ్ సంఘం), సిరిపని ఐలయ్య (దళిత సంఘం MRPS), మల్యాల బాలయ్య (నాయీ బ్రాహ్మణ సంఘం), బట్టె శంకర్, దిండు, బాలరాజ్ గౌడ్, చిలువేరి అయిలయ్య, గుండోళ్ల‌ లింగస్వామి విన‌తి ప‌త్రం పంపిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement