ఉమ్మడి ఏపీలో మంజూరైన ప్రాజెక్టులకు.. ఆటంకాలు కలిగించొద్దు.. జల వివాదాలు కోరుకోవడం లేదు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.. మీరు ఒక్క అడుగు ముందుకెస్తే.. పది అడుగులు ముందుకేసే తత్వం మాది పక్క రాష్ట్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి.. CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను తాను కోరుకోవడం లేదని, సామరస్యపూర్వకంగా పరిష్కారించుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగుదామని ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఏపీలో మంజూరైన ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగించొద్దు అని కోరారు. సమస్యల పరిష్కారం కోసం మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే.. పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజల్లో ఉందని రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్రం సీఎంకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయివేటు రంగంలో ఉపాధి అవకాశాలపై మాట్లాడిన అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సొంత రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. ఈ వేదిక మీద నుంచి పక్క రాష్ట్రంలో ఉండే ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలచుకున్నా. మీకు పంచాయితీలు కావాల్నా..? నీళ్లు కావాల్నా..? అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటాను. మీకు వివాదాలు కావాల్నా..? పరిష్కారాలు కావాల్నా..? అని అంటే పరిష్కారం కావాలని కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలని మా పార్టీ, మా ప్రభుత్వం భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కాబట్టి నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించి పరిష్కరించుకోవాలి. దీనికి చర్చ ఒక్కటే పరిష్కారం. న్యాయస్థానాల దగ్గర్నో, ఇతరుల వద్దకు వెళ్లి పంచాయితీ తెంచుకోవడం కంటే మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పక్క రాష్ట్రం సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టులకు ఆటంకం కలిగించొద్దు.. కృష్ణా నది బేసిన్లో ఉన్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల కావొచ్చు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు కావొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు ఇవి.. వీటి అనుమతులకు అడ్డంకి పెట్టకండి. వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఏపీ నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌లు కానీ, సీడబ్ల్యూసీతో అనుమతులు తెచ్చుకోవడం మాకు సమస్యగా మారింది. ఈ అనుమతులు రాకపోవడం వల్ల మాకు బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం, యాక్సిలేటర్ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్‌లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. వీటన్నింటికి మాకు సహకరిస్తే.. మీకేమైనా సమస్యలు ఉంటే మేం కూడా సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేం వివాదం కోరుకోవడం లేదని మరొక్కసారి చెప్తున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నాను. ఇది రాజకీయ ప్రయోజనం కాదు.. ప్రజల, రైతుల, పెట్టుబడిదారుల ప్రయోజనం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంతో సయోధ్య ఉండాలి.. ఈ ప్రాంతంలో డేటా సెంటర్స్ స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సెంటర్స్‌కు విద్యుత్‌తో పాటు నీరు కూడా అవసరం. కృష్ణా నది నుంచి నీటిని తరలించాలన్నా, యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ను తీసుకురావాలి. ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు. దేశంలో పోర్టులేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మరి పోర్టు కనెక్టివిటీ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి. అందుకే మచిలీపట్నం పోర్టుకు నేరుగా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే విత్ కంట్రోల్ యాక్సెస్, విత్ రైల్వే కనెక్టివిటీతో కేంద్రం నుంచి మనం అనుమతులు అడిగాం. ఇలాంటి అభివృద్ది జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి. పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి. పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం లేకుండా మచిలీపట్నం పోర్టుతో కానీ, కృష్ణపట్నం పోర్టుతో కానీ పోర్టు కనెక్టివిటీ తెలంగాణకు రాదు. తెలంగాణ రాష్ట్రానికి పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి. అలాగే పక్క రాష్ట్రం రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి అని రేవంత్ అన్నారు. తెలంగాణ రక్తంలోనే ఆ తత్వం ఉంది.. నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు. అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం. వాళ్లు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చకునే ధోరణితో ముందుకు వెళ్లాలి. పక్కరాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైనా కావొచ్చు. ఈ రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదు.. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. మీరు సానుకూలంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే.. పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజల్లో ఉంది.. తెలంగాణ రక్తంలో ఉన్నది. సమస్యల పరిష్కారం కోసం మేం సంపూర్ణంగా ముందుకు వస్తామని తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.