River disputes | కేంద్రం డైరెక్షన్ లో కొత్త నీళ్ల ఒప్పందాలు
తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మధ్య జల జగడాలకు ఇక కేంద్రం చెక్ పెట్టనుంది. 3 రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్యల పరిష్కారానికి తానే మధ్యవర్తిగా వ్యవహరించనుంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం డైరెక్షన్ లోనే ఆయా నదులకు సంబంధించి కొత్త ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబునాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ లు గురువారం నాడు భేటీ అయ్యారు. మూడు రాష్ట్రాలకు మేలు జరిగేలా నీటి ఒప్పందాలు చేసుకోవాలని, సమష్టిగా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
కర్ణాటకలో తుంగభద్ర డ్యాం 33 స్పిల్ వే గేట్ల పునరుద్ధరణ తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు
సంక్షిప్త సారాంశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య నెలకొన్న జలవివాదాలకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచించారు. కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కేంద్రం సమక్షంలో ఒక ఎంఓయూ చేసుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఒకే రాష్ట్రంలో చేసుకోగలిగే నదుల అనుసంధానాల్ని, ఇతర రాష్ట్రాలతో చేసుకోగలిగే జల ఒప్పందాలను ఉదహరించారు. ట్రిబ్యునళ్లలో ఏళ్ల తరబడి నడుస్తున్న కేసుల కన్నా.. ఇలాంటి రాజీయే ఉత్తమ మార్గమని చెప్పారు.
- కృష్ణా, తుంగభద్ర, గోదావరి జల సమస్యలపై
ఏకతాటిపైకి వచ్చిన తెలంగాణ, ఏపీ, కర్ణాటక - కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకత్వంలో
3 రాష్ట్రాల మధ్య సరికొత్త నీళ్ల ఒప్పందాలు - జలశక్తి మంత్రి పాటిల్ ప్రతిపాదనకు
అంగీకరించిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు - చరిత్రలో సువర్ణాధ్యాయంగా పేర్కొన్న సీఎంలు
శాశ్వత పరిష్కారం దిశగా అడుగేశామంటూ.. ప్రకటనలు
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మధ్య జల జగడాలకు ఇక కేంద్రం చెక్ పెట్టనుంది. 3 రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్యల పరిష్కారానికి తానే మధ్యవర్తిగా వ్యవహరించనుంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం డైరెక్షన్ లోనే ఆయా నదులకు సంబంధించి కొత్త ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబునాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ లు గురువారం నాడు భేటీ అయ్యారు. మూడు రాష్ట్రాలకు మేలు జరిగేలా నీటి ఒప్పందాలు చేసుకోవాలని, సమష్టిగా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

తెలంగాణ నష్టపోతున్నది
కర్ణాటకలోని హోస్పెటలో తుంగభద్ర డ్యాం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పెల్ వే గేట్లను ప్రారంభించిన అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, శివకుమార్, చంద్రబాబు నాయుడు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.... తుంగభద్ర, కృష్ణా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులు, చెక్ డ్యాంల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా..కేవలం 5 టీఎంసీలు కూడా రావడం లేదన్న విషయాన్ని పాటిల్ దృష్టికి తీసుకొచ్చారు. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ఆధునీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ 59 కోట్లు డిపాజిట్ చేసినా.. ప్యాకేజీ 1,2 పనులు ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ పనులు పూర్తి చేయడంలో తమకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను కూడా కర్ణాటక సీఎం శివకుమార్ ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ కాల్వలో తెలంగాణ వైపు పేర్కొని ఉన్న పూడికను తొలగించే పనులను వేగం చేస్తామని ఈ సందర్భంగా శివకుమార్ హామీ ఇచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా ..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అనుమతుల విషయంపై పాటిల్ కు నివేదించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఒక కొత్త ఆలోచనను తెరమీదికి తీసుకొచ్చారు.

ఒప్పందాలే ఉత్తమం
మూడు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జలవివాదాలకు కేంద్ర మంత్రి పాటిల్ ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచించారు. కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కేంద్రం సమక్షంలో ఒక ఎంఓయూ చేసుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఒకే రాష్ట్రంలో చేసుకోగలిగే నదుల అనుసంధానాల్ని, ఇతర రాష్ట్రాలతో చేసుకోగలిగే జల ఒప్పందాలను సూచించారు. నర్మదా డ్యాం నుంచి సర్దావర్ సరోవర్ డ్యాం ద్వారా సబర్మతి నదికి చేసిన నది అనుసంధానాన్ని, కెన్, బెత్వా నదుల మధ్య అనుసంధానాన్ని ఈ సందర్భంగా పాటిల్ ఉదహరించారు. రాజస్థాన్=, మధ్యప్రదేశ్ మధ్య పార్వతి, నేవాజ్, కాళీ సింధ్, చంబల్ నదులను సంధానపరిచి ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ కు నీరందిస్తున్న విషయాన్ని పాటిల్ గుర్తు చేశారు. దేశంలో అనేక నదులకు సంబంధించి నదీ జలాల ట్రిబ్యునల్స్ లో , సుప్రీం కోర్టులో అనేక కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో ఉన్నాయని అవి పరిష్కారం అయ్యేలోపు మధ్యే మార్గంగా కొన్ని ఆచరణాత్మక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా రైతులు నష్టపోరని సూచించారు. ఇందుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని పాటిల్ స్పష్టం చేశారు.

ఇక మేం కొట్లాడం
కేంద్రమంత్రి డైరెక్షన్ ను ముగ్గురు ముఖ్యమంత్రులు స్వాగతిస్తూ అధికారికంగా ప్రకటనలు చేశారు. నదీ జలాల సమస్యలకు పరిష్కారం కోసం కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చేసిన సూచనను వారు ఆహ్వానించారు. మధ్యవర్తిగా ఆయనను అంగీకరించారు. సానుకూలమైన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన భేటీ మూడు రాష్ట్రాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఒక కొత్త చరిత్రను సృష్టించనున్నదని సీఎంలు రేవంత్ రెడ్డి, శివకుమార్, చంద్రబాబు నాయుడులు వేదికపైనే ప్రకటించారు. ఇదే విషయాన్ని పాటిల్ కూడా ధృవీకరించారు. "నీళ్ల కోసం ఇక తాము కొట్లాడుకోమంటూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాకు హామీ ఇచ్చారు. మా మాట వింటామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా అందరికీ మేలు జరిగేలా ఒక చక్కటి నిర్ణయం అమలైతే తమకు సంతోషం అని చెప్పారు. దక్షిణాది చరిత్రలో ఇదొక మరిచిపోలేని రోజు " అని పాటిల్ చెప్పారు.

వాటాలు తేలకుండానే సమసిపోయేనా
కర్ణాటకలోని మునీరాబాద్ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి సంయుక్తంగా చేసిన ప్రకటన ప్రకారం.. కృష్ణా, తుంగభద్ర, గోదావరి జలాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ సమసిపోయే ఒక వినూత్న నిర్ణయం లేదా ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే.. ఇప్పటికీ కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణ, ఆంధ్ర వాటాలెంతో తేలకుండానే .. వివాదాలు సమసిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికీ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైన అనేక సమస్యలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పైగా కర్ణాటక కృష్ణ, తుంగభద్ర పై కడుతున్న ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. కొన్ని నిర్మితమయ్యాయి. మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని అంశాలపై ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వీటన్నింటినీ విస్మరించి.. ఎలాంటి ఒప్పందం చేసుకున్నా.. అవి కంటితుడుపు చర్యలు అవుతాయే తప్ప..పై నుంచి నీళ్లు దిగువకు అంత సులువుగా రావు. పైగా కేంద్రం చెబుతున్నట్టు ఒప్పందాలు జరిగిన మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున చర్చలు ఫలప్రదమయ్యాయి. కానీ సాగునీటి హక్కుల కోసం తీవ్రంగా పోరాడుతున్న తెలంగాణ, ఆ హక్కులకు విరుద్ధంగా ఎగువన ప్రాజెక్టులు కట్టుకుంటున్న కర్ణాటక, కృష్ణకు దిగువన నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగే ఏ ఒప్పందమైనా సులువుగా నిలబడుతుందా అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న.
సంబంధిత వార్తలు

SIR | రాష్ట్రంలో నేటి నుంచి సర్.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే..
జూన్ 25, 2026

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. ‘పీఎం కుసుమ్’లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి
జూన్ 24, 2026

Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!
- ●Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ - రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!
- ●Morocco Vs Haiti | 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్.. మొరాకోకు చుక్కలు చూపించిన హైతీ, కానీ నాకౌట్‌కు ఎవరంటే?
- ●Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి
- ●Jabardasth Faima | ప్రియుడిని రెండు సార్లు పెళ్లాడిన జబర్ధస్థ్ కమెడియన్ - నిన్న అలా...నేడు ఇలా
- ●Brazil vs Scotland | స్కాట్లాండ్పై బ్రెజిల్ పంజా.. వినీసియస్ డబుల్ ధమాకా, 981 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి నెయ్మర్

Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!

Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ - రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!

Morocco Vs Haiti | 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్.. మొరాకోకు చుక్కలు చూపించిన హైతీ, కానీ నాకౌట్‌కు ఎవరంటే?

Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి



