త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి

Banganapalle Mango | కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీడీఏ) భారత్ నుంచి సింగపూర్‌కు ప్రీమియం బంగినపల్లి మామిడి పండ్ల తొలి వాణిజ్య సముద్ర రవాణాను విజయవంతంగా పూర్తి చేసింది.

S

Business | Published On Jun 25, 2026, 5.41 pm IST

Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి
Advertisement

Banganapalle Mango | కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీడీఏ) భారత్ నుంచి సింగపూర్‌కు ప్రీమియం బంగినపల్లి మామిడి పండ్ల తొలి వాణిజ్య సముద్ర రవాణాను విజయవంతంగా పూర్తి చేసింది. భారత ఉద్యాన ఉత్పత్తులను తక్కువ వ్యయంతో, పర్యావరణ హితంగా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలిచింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ రవాణాలో మొత్తం 5 మెట్రిక్ టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు ఉన్నాయి. వీటిని ఒసమ్ ఫుడ్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ ఎగుమతి చేసింది. ఈ సరుకు జూన్ 11న భారత్ నుంచి బయలుదేరి జూన్ 24న సింగపూర్‌కు చేరుకుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏపీడీఏ, ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (సీఐఎస్‌హెచ్)తో కలిసి భార‌త్ నుంచి సింగపూర్‌కు ప్రీమియం బంగినపల్లి మామిడి పండ్లను ర‌వాణా చేశారు.

సింగ‌పూర్ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా..

ప్రీమియం భారతీయ మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను విస్తరించడంతోపాటు, సముద్ర రవాణాను సమర్థవంతమైన ఎగుమతి మార్గంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మామిడి పండ్లను ఆంధ్రప్రదేశ్‌లోని జీఏపీ (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్) ధ్రువీకరణ పొందిన తోటల నుంచి సేకరించారు. అనంతరం కర్ణాటకలోని ఏపీడీఏ గుర్తింపు పొందిన ప్యాక్‌హౌస్‌లో ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ నిర్వహించారు. మొత్తం సరుకును సింగపూర్ నిర్దేశించిన నాణ్యత, ఫైటోశానిటరీ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేశారు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత అక్కడి దిగుమతిదారు ఈసీ-లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పండ్ల నాణ్యతపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. మామిడి పండ్ల తీపి రుచి, సమానంగా పండిన తీరు, నిల్వ సామర్థ్యం, ఫైటోశానిటరీ ప్రమాణాల పరంగా అవి అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది.

రెట్టింపు ధ‌ర‌తో అధిక లాభం..

కాగా ఈ ఎగుమతితో రైతులకు అధిక ఆదాయం కూడా లభించింది. దేశీయ మార్కెట్లో బంగినపల్లి మామిడి ధర కిలోకు రూ.25 నుంచి రూ.30 మధ్య ఉండగా, ఎగుమతి సరుకు ద్వారా కిలోకు సుమారు రూ.50 లభించింది. దీంతో రైతులకు దాదాపు రెండింతల గిట్టుబాటు ధర లభించడంతోపాటు అదనపు విలువను సృష్టించిన‌ట్ల‌యింది. బంగినపల్లి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మామిడి రకాలలో ఒకటి. బంగారు పసుపు రంగు, ఆహ్లాదకరమైన సువాసన, పీచు లేని గుజ్జు, అధిక తీపి కారణంగా ఈ రకానికి ప్రపంచ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. భవిష్యత్తులో ఈ రకం ఎగుమతులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement